Urvasivo Rakshasivo film review: అల్లు శిరీష్ కి హిట్టొచ్చింది

ABN , First Publish Date - 2022-11-04T19:32:49+05:30 IST

ఇప్పుడున్న యంగ్ నటులు ఒకరితో ఒకరు పోటీలో ఉండాలంటే ఒక మంచి హిట్ పడాలి, అందుకే అలాంటి హిట్ కోసం అల్లు శిరీష్ (Allu Sirish) ప్రయత్నిస్తున్నాడు. దానికోసమే ఎదురు చూస్తున్నట్టుగా, చాల గ్యాప్ తీసుకున్న తరువాత 'ఊర్వశివో రాక్షసీవో'

Urvasivo Rakshasivo film review:  అల్లు శిరీష్ కి హిట్టొచ్చింది

సినిమా: ఊర్వశివో రాక్షసీవో 

నటీనటులు: అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్, ఆమని, సునీల్, వెన్నెల కిశోర్ తదితరులు 

సినిమాటోగ్రాఫర్: తన్వీర్ మీర్ 

సంగీతం: అనూప్ రూబెన్స్, అచ్చు రాజమణి 

రచన దర్శకత్వం: రాకేష్ శశి 

నిర్మాతలు: ధీరజ్ మొగిలినేని, విజయ్ ఎం. తమ్మారెడ్డి భరద్వాజ్ 


--- సురేష్ కవిరాయని 


ఇప్పుడున్న యంగ్ నటులు ఒకరితో ఒకరు పోటీలో ఉండాలంటే ఒక మంచి హిట్ పడాలి, అందుకే అలాంటి హిట్ కోసం అల్లు శిరీష్ (Allu Sirish) ప్రయత్నిస్తున్నాడు. దానికోసమే ఎదురు చూస్తున్నట్టుగా, చాల గ్యాప్ తీసుకున్న తరువాత 'ఊర్వశివో రాక్షసీవో'  (Urvasivo Rakshasivo) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పూర్తి అయి చాలా కాలం అయినా, విడుదలకి మంచి టైం కోసం ఎదురు చూసారు. ఇప్పుడు ఆ టైం వచ్చింది అని విడుదల చేసారు.  ప్రచార వీడియోస్ లో రొమాంటిక్ కామెడీ అని చెప్పనే చెప్పారు, అదీ కాకుండా ఆ వీడియోస్ కుర్రకారుని హుషారు ఎక్కించే విధంగా వున్నాయి. అను ఇమ్మానుయేల్ (Anu Emmanuel) ఇందులో కథానాయిక, ఆమె కూడా ఈ ప్రచార వీడియోస్ లో చాలా బాగుంది. ఈ సినిమాని అల్లు శ్రీరిష్ సొంత సంస్థ గీత ఆర్ట్స్ 2 (Geetha Arts 2) మరియు తమ్మారెడ్డి భరద్వాజ్ (Thammareddy Bharadwaj) నిర్మించారు. సినిమా ఎలా ఉందొ చూద్దాం. 


#UrvasivoRakshasivo story కథ:

శ్రీ (అల్లు శిరీష్) ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, సాఫ్ట్ వెర్ కంపెనీలో పని చేస్తూ ఉంటాడు. అతని ఆఫీస్ పక్కనే వున్న ఇంకో ఆఫీస్ లో సింధు (అను ఇమ్మానుయేల్) పని చేస్తూ ఉంటుంది. తన ఆఫీస్ కిటికీ లోనుండి రోజూ ఆమెని చూడటం, మురిసిపోవటం శ్రీ రెగ్యులర్ పని. ఒకరోజు సడన్ గా సింధూజ తన ఆఫీస్ లో జాయిన్ అవుతోంది అనేసరికి శ్రీ సంతోషానికి అవధులు లేవు. ఆమెని ఎలా పరిచయం చేసుకోవాలి అని చేయని ప్రయత్నం అంటూ లేదు. ఒకసారి లిఫ్ట్ లో ఇద్దరూ వెళుతున్న సమయంలో ఒక సంఘటన జరిగి అక్కడ నుండి ఇద్దరూ దగ్గరవుతారు, ఒకరికొకరు ఇష్ట పడతారు. శ్రీ ఏమో పెళ్లి చేసుకుందాం అంటారు, సింధు ఏమో సహా జీవనం చేద్దాం, ఒకరినొకరు ఇంకా బాగా తెలుసుకుందాం అంటుంది. వీళ్లిద్దరు ఇలా వాదించుకుంటూ చివరికి సింధూజ చెప్పిన సహా జీవనానికి ఒప్పుకుంటాడు, అది కూడా తన తల్లిదండ్రులకి తెలియకుండా. ఈలోగా శ్రీ తల్లిదండ్రులు శ్రీ కి పెళ్లి చెయ్యాలని అమ్మాయిలను చూస్తూ వుంటారు, కానీ శ్రీ కి ఎవరూ నచ్చరు, ఎందుకంటే తాను సింధు ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు కనక. కానీ సింధు పెళ్ళికి మాత్రం ససేమిరా అంటుంది, కానీ సహజీవనానికి ఒకే. ఈలోగా తల్లిదండ్రుల నుండి శ్రీ మీద ఒత్తిడి పెరుగుతుంది పెళ్లి చేసుకోమని. సింధుజ ఒప్పుకుందా పెళ్ళికి లేక శ్రీ వేరే పెళ్లి చేసుకున్నాడా చివరికి ఏమైంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 


విశ్లేషణ:

దర్శకుడు రాకేష్ శశి (Director Rakesh Sashi) ఇప్పుడు యువతలో ఎటువంటి భావాలున్నాయో అలాంటి సబ్జెక్టునే కదాంశంగా ఎంచుకొని దాన్ని స్క్రీన్ మీద నేరేట్ చేసే విధానం కూడా చాలా బాగుంది. అలాగే ఇందులో ఇప్పుడు ప్రేక్షకులకి కావలసిన ఎంటర్ టైన్ మెంట్ కూడా చాల ఎక్కువగా పెట్టాడు దర్శకుడు. రాకేష్ శశి బలం రచన, అందుకని అందులోనే అతను తన ప్రతాపాన్ని చూపించి ప్రేక్షకులను బాగా ఎంటర్ టైన్ చేయగలిగాడు. సహా జీవనం మంచిదా, పెళ్లి చేసుకోవటం మంచిదా  అన్న సున్నితమయిన విషయాన్ని ఇప్పటి యువత ఎలా ఆలోచిస్తుందో అలానే చూపించాడు. పక్క మిడిల్ క్లాస్ కుటుంబాలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనే విషయం కూడా బాగా టచ్ చేసాడు. 


దర్శకుడు చాల తెలివిగా తాను చెప్పదలుచుకున్నది హిలేరియస్ గా చూపించాడు. సినిమా ఎక్కడా బోర్ కొట్టనివ్వకుండా ఉంచగలిగాడు. దానికి తోడు కథకి తగ్గ ఆర్టిస్టులు దొరికారు, వాళ్ళు అందరితో మంచి నటన రాబట్టగలిగాడు. సినిమాలో రెండు మూడు సన్నివేశాలు అయితే అసలు నవ్వు ఆపుకోలేము. అంత బాగా ఆ సన్నివేశాలను రాసుకున్నాడు, చూపించాడు కూడా. ముఖ్యంగా కరెంట్ పోయినప్పుడు వచ్చే సన్నివేశం ఫుల్ కామెడీ. అలానే ఆ పెళ్లి చూపుల సన్నివేశం కూడా. మొదటి సినిమా 'విజేత' అంతగా నడవకపోయిన, దర్శకుడు రాకేష్ శశి కి ఈ 'ఉర్వశివో రాక్షసీవో' తో తాను ఏంటో నిరూపించుకున్నాడు. ఇది అతనికి మంచి బ్రేక్ ఇవ్వొచ్చు. 


ఇంకా నటీనటుల విషయానికి వస్తే ఇందులో అందరూ బాగా చేసారు. అల్లు శిరీష్ చాల కాలం తరువాత మంచి నటన కనపరిచాడు. ఇందులో తాను పోషించిన శ్రీ పాత్రకి పర్ఫెక్ట్ అని నిరూపించాడు. అలాగే డైలాగ్ చెప్పడం లో, హావభావాలు పలికించడం లో ఎంతో పరిణితి చెందాడు. నిజంగా శిరీష్ కి ఇది ఒక మంచి సినిమా. ఈ సినిమాలో చాల హుషారుగా చెయ్యడమే కాకుండా, పంచ్ డైలాగ్స్ టైమింగ్ తో చెప్పడమే కాకుండా, కామెడీ సన్నివేశాలను కూడా చాలా చక్కగా పండించాడు. ఇంకా అను ఇమ్మానుయేల్ సినిమాకే హైలైట్. చాలా బాగా చేసింది. ఆమె తన కళ్ళతోనే భావాలు పలికించింది చాలా సన్నివేశాల్లో.  ఈ సినిమాతో తను మంచి రోల్ వస్తే నటించి చూపించ గల సత్తా వున్నా నటి అని చెప్పగలిగింది. ఆమె చాల అందంగా కనపడుతుంది, అందం, అభినయం రెండింటినీ చక్కగా చూపించ గలిగే నటీమణుల్లో అను కూడా వుంది అని చెప్పగలిగింది.  ఆమెకి శిరీష్ కి మధ్య కెమిస్ట్రీ చాల బాగుంది. అదే సినిమా బాగుండటానికి ముఖ్య కారణం. ఇద్దరూ ముద్దు సన్నివేశాలను కూడా బాగా పండించారు. ఈ సినిమా శిరీష్ కి, అను ఇమ్మానుయేల్ కి ఇద్దరికీ మంచి బ్రేక్ ఇస్తుంది అనటం లో సందేహం లేదు.  


వెన్నెల కిశోర్, శిరీష్ కి స్నేహితుడిగా నటించాడు. అలాగే అతను నవ్వులు పండించాడు. అతను తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఒక ముఖ్యమయిన నటుడు అయిపోయాడు. అతని హాస్య సన్నివేశాలు ప్రేక్షకులకు ఒక పెద్ద రిలీఫ్ లాగా ఉంటాయి. అలాగే ఇందులో పాత సునీల్ ని చూడవచ్చు. పంచ్ డైలాగ్స్, కామెడీ టైమింగ్ అదిరిపోయింది. సునీల్ కూడా ట్రాక్ లో పడ్డాడు అనిపిస్తుంది. 

తల్లి దండ్రులుగా ఆమని, కేదార్ ఇద్దరూ చాల సహజంగా నటించారు. పోసాని కృష్ణ మురళి కూడా ఒకటి రెండు సన్నివేశాల్లో కనిపించి నవ్విస్తాడు. 


ఇంకా అచ్చు రాజమణి బ్యాక్ గ్రౌండ్ సంగీతం అయితే సినిమాని ఇంకో లెవెల్ కి తీసుకెళ్లింది. అతను సినిమా విజయవంతం కావటం లో ఒక ముఖ్య భూమికను పోషించాడు. అనూప్ రూబెన్స్ పాటలు బాగున్నాయి. ఈ సినిమాకి ఇంకో హైలైట్ ఏంటి అంటే, డైలాగ్స్. చాల బాగా రాసాడు శశి. మంచి పంచ్ డైలాగ్స్ తో పాటు, పెళ్లా, సహా జీవనమా అనే దాని మీద కూడా ఆలోచన పరమయిన డైలాగ్స్ కూడా బాగున్నాయి. కుటుంబ భావేద్వేగాల మీద కొంచెం దృష్టి పెట్టి ఉంటే ఇంకా బాగుండేది. అక్కడక్కడా కొన్ని లోపలున్నా సినిమా నచుతుంది. 


చివరగా, 'ఉర్వశివో రాక్షసీవో' సినిమా హిలేరియస్ రొమాంటిక్ ఎంటర్ టైనర్. ఇప్పుడున్న యువతకి బాగా ఆకర్షించే కథాంశంతో దర్శకుడు రాకేష్ శశి ఒక మంచి చిత్రాన్ని చూపించాడు. దానికి తోడు అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ ఇద్దరు పోటీ పడి నటించారు, అను ఇమ్మానుయేల్ అందం అభినయం తో ఆకర్షిస్తుంది. వెన్నెల కిశోర్ , సునీల్ కామెడీ అదుర్స్. తన్నుకోడాలూ, కొట్టుకోడాలూ, భారీ సన్నివేశాలు లాంటివి ఏమి లేకుండా, ఈ సినిమా చూసి హాయిగా నవ్వుకోవచ్చు.  Updated Date - 2022-11-04T19:32:49+05:30 IST

Read more