Akasam film review: భావోద్వేగాలతో కూడిన ఒక అందమయిన ప్రయాణం

ABN , First Publish Date - 2022-11-05T21:09:46+05:30 IST

ఈమధ్య పర బాషా చిత్రాలు చాల తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. ఆలా విడుదల అయినా సినిమానే 'ఆకాశం' (#AkasamFilm).

Akasam film review:  భావోద్వేగాలతో కూడిన ఒక అందమయిన ప్రయాణం

Akasam film review:  భావోద్వేగాలతో కూడిన ఒక అందమయిన ప్రయాణం

సినిమా: ఆకాశం 

నటీనటులు: అశోక్ సెల్వన్, రైతు వర్మ, శివాత్మిక రాజశేఖర్, అపర్ణ బాలమురళి, జీవా, ఇషా రెబ్బా తదితరులు

సంగీతం: గోపి సుందర్

సినిమాటోగ్రఫి: విధూ అయ్యన్న 

రచన, దర్శకత్వం: రా కార్తీక్ 

నిర్మాత: శ్రీనిధి సాగర్, పీ రూపక్ ప్రణవ్ తేజ్ 


-- సురేష్ కవిరాయని 


ఈమధ్య పర బాషా చిత్రాలు చాల తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. ఆలా విడుదల అయినా సినిమానే 'ఆకాశం' (#AkasamFilm). అశోక్ సెల్వన్ (#AshokSelvan) ఇందులో కథానాయకుడు కాగా, ఇద్దరు తెలుగు అమ్మాయిలు రీతూ వర్మ, (#RituVarma #ShivatmikaRajasekhar) శివాత్మిక రాజశేఖర్ కథానాయికలుగా కనిపిస్తారు. రా కార్తిక్ (Director Ra Karthik) దీనికి దర్శకుడు కాగా గోపిసుందర్ (Music director Gopi Sundar) సంగీతం ఇచ్చారు. ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం. 


#AkasamStory కథ:

అర్జున్ (అశోక్ సెల్వన్) ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ లో పని చేస్తూ ఉంటాడు. అతను ఎక్కువ ఎవరితూనూ మాట్లాడాడు, అలాగే ప్రతి దగ్గరా పరిశుభ్రతగా  ఉండాలని అనుకుంటూ ఉంటాడు. అందుకని ఇంటి నుంచి ఎక్కువ బయటకి రాదు. ఈ అర్జున్ కి ఇంకో అలవాటు కూడా వుంది. పుస్తకాలూ బాగా చదివే అలవాటు వున్న అర్జున్, ఏ కథ చదివినా, అందులో పాత్రని తనని ఊహించుకుంటూ ఉంటాడు. అయితే ఇతనికి పెళ్లి చెయ్యాలని తల్లిదండ్రులు భావించి, ఒక అమ్మాయిని సెలెక్ట్ చేస్తారు. పెళ్లి జరిగిన రోజే, ఆ అమ్మాయి తన ప్రియుడితో వెళ్ళిపోవటం తో, అర్జున్ తీవ్రమయిన నిరాశకు గురవుతాడు. అసలే ఇల్లు వొదిలి బయటకి రాని అర్జున్, ఇంక తన రూమ్ కె పరిమితం అయి ఆఫీస్ కి కూడా సెలవు పెడతాడు. దీన్ని నుండి బయటపడటానికి తల్లిదండ్రులకి తెలిసిన డాక్టర్ ఒకామె అర్జున్ ని హాస్పిటల్ కి రమ్మని చెపుతుంది ట్రీట్మెంట్ కోసం. అక్కడ అర్జున్ తో మాట్లాడి ఒక రెండు డైరీస్ ఇచ్చి అందులోని కథలని చదవమంటుంది. ఆసక్తికరంగా రెండు కథలకి ముగింపు కాయితాలు చిరిగిపోతాయి. సస్పెన్స్ తట్టుకోలేని అర్జున్ డాక్టర్ ని అడుగుతాడు ఆతృతగా రెండు కథల క్లైమాక్స్ గురించి. డాక్టర్ అవి కథలు కావు, నిజ జీవితం లో జరిగినవి అని చెప్పి వాళ్ళ దగ్గరకి వెళ్లి తెలుసుకో అని చెప్పి వాళ్ళ అడ్రస్ ఇస్తుంది. అప్పుడు అర్జున్ తన ప్రయాణం మొదలెడతాడు. ఆ ప్రయాణం లో ఏమి జరిగింది, అర్జున్ జీవితం మీద ఎటువంటి మార్పు తీసుకు వచ్చింది అన్నదే మిగతా కథ. 


విశ్లేషణ:

దర్శకుడు రా కార్తిక్ ఒక మంచి కథని ఎంచుకున్నాడు. ఎప్పుడూ ఇంట్లోంచి రాని, ఎవరితో ఎక్కువగా మాట్లాడని, ఒక నిరాశ లో వున్న వ్యక్తి  ఎలా ప్రభావితం చెయ్యగలం అన్న కథ. ఈ ప్రపంచంలో కొందరు మనుషులు చాల ముఖ్యమయిన మనుషులని పోగొట్టుకున్నా ఆత్మ స్థయిర్యంతో ఎలా ముందుకు సాగుతున్నారు, ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు ఇతరులను ఎలా ప్రభావితం చేస్తున్నారు అన్నదే ఈ కథ. తన జీవితం లో తాను ఏమి పోగొట్టుకున్నాడు, తన గురించి తాను తెలుసుకోవాలన్న తపనే ఈ 'ఆకాశం' సినిమా. అయితే తెలుగులో ఇంతకు ముందు 'ఎవడె సుబ్రహ్మణ్యం' అనే సినిమా వచ్చింది, ఈ 'ఆకాశం' కూడా ఇంచుమించు కొంచెం అలానే అనిపించినా, ఇది వేరేగా ఉంటుంది. అలాగే విజయ్ దేవరకొండ నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో విజయ్ కథలు రాస్తూ తన కథలో తననే చూపిస్తూ ఉంటాడు. అలాగే ఈ సినిమాలో కూడా దర్శకుడు కథానాయకుడు తనని తానే కథల్లో పాత్రలని వూహించుకునేట్టు చూపించి, అశోక్ సెల్వన్ చేత వివిధ పాత్రల్లో కనిపించేట్టు చేస్తాడు. దర్శకుడు ఆయా పాత్రలని మలచిన తీరు బాగుంది. అర్జున్ ప్రయాణం మొదలు పెట్టిన దగ్గర నుండి సినిమా ఇంకా ఆహ్లాదకరంగా, ఒక కవిత రాస్తున్నట్టుగా, ఒక కథ చదువుతున్నట్టుగా ఎంతో హృద్యంగా సాగుతూ ఉంటుంది. భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలతో కథ నడుస్తూ ఉంటుంది. అలాగే క్లైమాక్స్ కొంచెం వెరైటీ గా వుంది. సినిమా మామూలుగా మొదలయ్యి వెళుతున్న కొద్దీ ఆ భావోద్వేగాలు ఆలా ఎక్కువవుతూ ప్రేక్షకుడికి ఆసక్తికరంగా ఉంచడం లో చాల సఫలం అయ్యాడు దర్శకుడు కార్తిక్. హాయిగా చూడగలిగే సినిమా. ఎక్కడా డబ్బింగ్ సినిమా లా అనిపించదు. 


ఇంకా నటీనటుల విషయానికి వస్తే అశోక్ సెల్వన్ పాత్ర బాగా రాసాడు దర్శకుడు, అలాగే అతను అద్భుతమయిన నటన కనపరిచాడు. అశోక్ సెల్వన్ వివిధ రకాలు అయినా పాత్రల్లో కనపడతాడు, ఒకదానికొకటి పొంతన ఉండదు, కానీ అన్ని పాత్రలు చాలా చక్కగా పోషించి మెప్పించాడు. సినిమా అంతటికీ అతనే హైలైట్. అలాగే ఇందులో అమ్మాయిలు అందరూ చాల చక్కగా నటించారు. మొదట వచ్చిన శివాత్మిక రాజశేఖర్ మంచి హావభావాలు, నటన కనపరిచింది. కళ్ళ తో నే ఎక్కువ మాట్లాడింది. అలాగే అపర్ణ బాలమురళి పాత్ర సరదాగా సాగుతుంది. రీతూ వర్మ మెయిన్ కథానాయికగా కనపడుతుంది. ఆమె ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది, ఇందులో మరోసారి చాలా చక్కగా చేసి చూపించింది. చివర్లో జీవా అతిధి పాత్రలో వచ్చి తళుక్కున మెరుస్తాడు. ఈషా రెబ్బ కూడా అంతే. 


ఈ సినిమాకి ఇంకో రెండు ముఖ్యమయిన హైలైట్స్ వున్నాయి. ఒకటి సంగీతం. గోపి సుందర్ సంగీతం కథని ఆసక్తికరంగా ప్రేక్షకుడిని అలా తీసుకు వెళుతూ ఉంటుంది. పాటలు కూడా బాగుంటాయి. ఇంకో హైలైట్ సినిమాటోగ్రఫీ. చక్కని దృశ్యాలను తన కెమెరాతో బంధించి మనల్ని కూడా ఆ ప్రదేశాలు అన్నిటికీ తీసుకు వెళ్లాడు కెమరామెన్ విధూ అయ్యన్న. సినిమా చూస్తున్నంత సేపూ ఒక చక్కని దృశ్యం చూస్తున్నట్టుగా అతి సుందరంగా, మనోహరంగా ఉంటుంది అతని వల్ల. మాటలు కూడా సన్నివేశాలకి తగ్గట్టుగా బాగున్నాయి. 

చివరగా 'ఆకాశం' సినిమా ఒక అందమయిన ప్రయాణం. దర్శకుడు రా కార్తిక్ అందరిని తన సినిమాతో పాటు ఆలా చక్కని ప్రదేశాలకు తీసుకువెళ్లటమే కాకుండా, ఒక భావోద్వేగాలకు కూడా గురి చేస్తాడు. సినిమా అయ్యాక ప్రేక్షకుడికి ఒక చక్కటి అనుభూతి మిగులుతుంది. అంత అందంగా తీసాడు, చూపించాడు. (#Akasam #AshokSelvan #RaKarthik #RituVarma)

Updated Date - 2022-11-05T21:09:46+05:30 IST