Top Gear Film Review: ‘టాప్ గేర్’లో కూడా స్లోగానే నడిచింది

ABN , First Publish Date - 2022-12-30T16:25:34+05:30 IST

యువ నటుడు ఆది సాయి కుమార్ (Aadi Saikumar) ఈ సంవత్సరం మొదటి వారంలో ఒక సినిమా, మధ్యలో ఇంకొకటి, ఇప్పుడు చివరి వారంలో ఇంకో సినిమా ‘టాప్ గేర్’..

Top Gear Film Review: ‘టాప్ గేర్’లో కూడా స్లోగానే నడిచింది
Top Gear Movie Review

నటీనటులు: ఆది సాయికుమార్, రియా సుమన్, మైమ్ గోపి, శత్రు, బ్రహ్మాజీ, మిర్చి హేమంత్, సత్యం రాజేష్ తదితరులు

ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్

సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్

కథ, మాటలు, దర్శకత్వం: ఎన్.శశికాంత్

నిర్మాత: కె. శ్రీధర్ రెడ్డి

-సురేష్ కవిరాయని

యువ నటుడు ఆది సాయి కుమార్ (Aadi Saikumar) ఈ సంవత్సరం మొదటి వారంలో ఒక సినిమా, మధ్యలో ఇంకొకటి, ఇప్పుడు చివరి వారంలో ఇంకో సినిమా ‘టాప్ గేర్’ (Top Gear)తో ముగిస్తున్నాడు. ఈ చిత్ర ప్రమోషనల్ వీడియోస్ ఈ చిత్రం ఒక థ్రిల్లర్ గా చెప్పాయి. ఇందులో ఆది ఒక క్యాబ్ డ్రైవర్ పాత్ర పోషించాడు. ఎన్. శశికాంత్ (Shashikanth) ఈ సినిమాకి దర్శకుడు, ఇది అతని మొదటి సినిమా. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. (Top Gear Movie Review)

Top-Gear-1.jpg

‘టాప్ గేర్’ కథ:

అర్జున్ (ఆది సాయికుమార్) హైదరాబాద్‌లో ఒక సాధారణ క్యాబ్ డ్రైవర్ మరియు అతనికి భార్య ఆద్య (రియా సుమన్) (Riya Suman) అంటే ఎంతో ఇష్టం, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటూ వుంటారు. హైదరాబాద్ పోలీసులు డ్రగ్ సప్లయి చేసే క్రిమినల్ సిద్ధార్థ్ (మైమ్ గోపి Mime Gopi) కోసం వెతుకుతూ ఉంటారు. అతను వందల కోట్ల విలువైన డ్రగ్స్‌తో దేశం వదిలి పారిపోవాలని ఒక ప్లాన్ వేసుకుంటాడు. అందుకోసం తన అనుచరులను పురమాయిస్తాడు కూడా. అయితే అతని ప్లాన్ అనుకోకుండా గాడి తప్పుతుంది. అతని అనుచరులు ఇద్దరు బ్రహ్మాజీ (బ్రహ్మాజీ) (Brahmaji) మరియు రాజేష్ (రాజేష్) (Rajesh) డ్రగ్స్ వున్న బ్యాగ్ పట్టుకుని అర్జున్ క్యాబ్ ఎక్కుతారు. అనుకోకుండా ఆ ఇద్దరి మధ్య జరిగిన పోట్లాటలో బ్రహ్మాజీ మరణిస్తాడు. రాజేష్ అర్జున్‌ని బెదిరించి క్యాబ్ సిద్ధార్థ్ దగ్గరికి కాకుండా వేరే దగ్గరికి తీసుకెళ్ళమంటాడు. రాజేష్ ఎక్కడికి తీసుకెళ్లాడు, అక్కడ పరిస్థితి ఏమిటి, డ్రగ్స్ వున్న బ్యాగ్ సిద్ధార్థ్ కి అందిందా? అర్జున్ తన భార్యను చంపేస్తా అని విలన్స్ అంటే ఎలా కాపాడుకున్నాడు? పోలీస్ లు ఏమి చేశారు? ఇవన్నీ తెలియాలంటే వెండితెర మీద సినిమా చూడాల్సిందే. (Top Gear Movie Telugu Review)

Top-Gear-2.jpg

విశ్లేషణ:

దర్శకుడు శశికాంత్ తన మొదటి సినిమా ‘టాప్ గేర్’ కోసం ఒక మామూలు కథనే ఎంచుకున్నాడు. ఇందులో అంత కొత్తదనం ఏమీ లేదు. ఇంతకు ముందు ఒక్క రోజులో ఏమి జరిగింది అనే కాన్సెప్ట్ లో తెలుగులో ‘అనుకోకుండా ఒకరోజు’ అనే సినిమా.. ఆ తరువాత అదే తరహాలో చాలా సినిమాలు వచ్చాయి. అందులో ‘మత్తు వదలరా, దొంగలున్నారు జాగ్రత్త’ అనే సినిమాలది కూడా ఒక్క రోజులో ఏమి జరిగింది అనే కాన్సెప్టే. అయితే దర్శకుడు శశికాంత్ ఇక్కడ ఒక క్యాబ్ డ్రైవర్‌ని తీసుకొని దానికి డ్రగ్స్ మాఫియా, పోలీస్‌లను జతచేసి ఒక రాత్రి వేళ ఈ ముగ్గురి మధ్య ఏమి జరిగింది, క్యాబ్ డ్రైవర్ ఎలా సఫర్ అయ్యాడు, మళ్ళీ ఆ పరిస్థితి నుండి బయటకి ఎలా రాగలిగాడు అన్నది స్టోరీ. దర్శకుడు కొంచెం దృష్టి పెడితే ఈ సినిమా ఒక మంచి థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపాంతరం చెంది ఉండేది, కానీ కథ అంత బలంగా లేకపోవడం‌తో ఇది ఒక మామూలు సినిమాగా తయారైంది. (Top Gear Movie)

సినిమా మధ్యలో కొన్ని కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నా, దర్శకుడు మొత్తం సినిమాని ఆసక్తికరంగా మలచలేకపోయాడు. క్యాబ్ లోకి డ్రగ్స్ వున్న బ్యాగ్‌తో బ్రహ్మాజీ, రాజేష్‌లు ఎక్కిన తరువాత కథ కొంచెం ఆసక్తి రేపుతోంది. కానీ అది కొంత వరకే, మళ్ళీ మామూలు అయిపోతుంది. సెకండ్ హాఫ్‌లో హైవే మీద కార్ ఛేజింగ్, అలాగే కారు అదే రోడ్డు మీద ప్రయాణం చేయడం లాంటివి ఎక్కువ ఉండటం‌తో అవి కొంచెం డ్రాగ్ అయినట్టుగా వున్నాయి. అదీ కాకుండా, ఇందులో అన్నీ మనం ముందే ఊహించేసుకోవచ్చు. అంత థ్రిల్లింగ్‌గా కూడా ఏమీ లేదు. కాకపోతే సినిమా అక్కడక్కడా బాగుంది.. అంతే. దర్శకుడు విలన్‌కి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చినట్టుగా కనపడింది.

ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకి బ్యాక్ గ్రౌండ్ సంగీతం చాలా ముఖ్యం. అది హర్షవర్థన్ రామేశ్వర్ సమకూర్చాడు, పరవాలేదు అనిపించాడు కూడా. సినిమాకి హైలైట్ మాత్రం సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ. అతను రాత్రి ఎఫెక్ట్ ని బాగా చూపించటమే కాకుండా, కొన్ని సన్నివేశాల్లో కథకి తగ్గట్టుగా బాగా చూపించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. (Top Gear Review)

Top-Gear-3.jpg

ఇక నటీనటుల విషయానికి వస్తే.. ఆది సాయికుమార్‌ క్యాబ్ డ్రైవర్ అర్జున్ పాత్రలో బాగా చేశాడు, ఆకట్టుకున్నాడు. ఇక రియా సుమన్‌కి ఎటువంటి ప్రాముఖ్యం లేని పాత్ర వచ్చింది.. అందుకని ఆమె గురించి మాట్లాడటం అనవసరం. మైమ్ గోపి విలన్‌గా సిద్ధార్థ్ పాత్రలో బాగా చేశాడు.. ఇంకా చెప్పాలంటే, సినిమాలో అతని పాత్రే ఎక్కువ. అతనే ఒక సమయంలో ఈ చిత్రానికి లీడ్ యాక్టర్ అనేట్టుగా అతని పాత్ర వుంది. శత్రు మరొకసారి పోలీస్ అవతారం ఎత్తాడు, అతనికి ఇప్పుడు మంచి పాత్రలు వస్తున్నాయి. అతను కూడా అవి బాగా చేస్తున్నాడు కూడా. బ్రహ్మాజీ, రాజేష్‌లు చిన్న పాత్రల్లో మెరుస్తారు. ఇంకా చాలామంది సపోర్టివ్ రోల్స్‌లో కనపడతారు.

ఫైనల్‌గా, ‘టాప్ గేర్’ సినిమా ఒక సాధారణ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. దర్శకుడు కథ మీద కొంచెం దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. ఈరోజు విడుదల అయిన చాలా సినిమాల్లో ఈ ‘టాప్ గేర్’ ఒక్కటే కాస్త బాగుంది అని టాక్ వచ్చింది అంటే, మిగతా సినిమాలు ఎలా ఉన్నాయో మీరే ఆలోచించుకోండి.

Updated Date - 2022-12-30T16:31:34+05:30 IST