సినిమా రివ్యూ: ఆడవాళ్లు మీకు జోహార్లు

ABN , First Publish Date - 2022-03-04T20:49:12+05:30 IST

ప్రేమకథలు, కుటుంబ కథలకు కేరాఫ్‌గా నిలిచారు శర్వానంద్‌. ‘శతమానం భవతి’ చిత్రంతో పూర్తిగా ఫ్యామిలీ హీరోగా గుర్తింపు పొందారాయన. ఆ తర్వాత కూడా అలాంటి ప్రయత్నాలు చేసి కొన్నాళ్లు పంథా మార్చారు. తాజాగా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.

సినిమా రివ్యూ: ఆడవాళ్లు మీకు జోహార్లు

రివ్యూ: ఆడవాళ్లు మీకు జోహార్లు

విడుదల తేది: 04–02–2022


నటీనటులు: శర్వానంద్‌, రష్మిక మందన్నా, ఖుష్బూ, రాధిక, ఊర్వశి, సత్యకృష్ణన్‌, సత్య, వెన్నెల కిశోర్‌, రవిశంకర్‌, బెనర్జీ తదితరులు.

కెమెరా: సుజిత్‌ సారంగ్‌

ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌

సంగీతం: దేవిశ్రీప్రసాద్‌

నిర్మాణం: సుధాకర్‌ చెరుకూరి

దర్శకత్వం: కిశోర్‌ తిరుమల. 


ప్రేమకథలు, కుటుంబ కథలకు కేరాఫ్‌గా నిలిచారు శర్వానంద్‌. ‘శతమానం భవతి’ చిత్రంతో పూర్తిగా ఫ్యామిలీ హీరోగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత కూడా అలాంటి ప్రయత్నాలు చేసి కొన్నాళ్లు పంథా మార్చారు. తాజాగా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్‌లతో ఆకట్టుకుంది. మరీ చిత్రం ఎలా ఉందో చూద్దాం. 


కథ:

చిరంజీవి (శర్వానంద్‌) కల్యాణ మండపం నిర్వహిస్తూ ఉమ్మడి కుటుంబంలో అల్లారుముద్దుగా పెరిగిన కుర్రాడు. అందం, ఐశ్వర్యం ఉన్నా అతనికి పెళ్లి ఘడియలు రావు. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలని తపన పడుతుంటాడు. వచ్చిన సంబంధాలు తన ఇంట్లో వాళ్లకు ఓ పట్టాన నచ్చవు. అలా సంబంధాలు చూస్తున్న తరుణంలో చిరుకి, ఆద్య (రష్మిక మందన్నా) తారసపడుతుంది. ఆద్యను కుటుంబ సభ్యులకు పరిచయం చేస్తాడు. ఆమె నచ్చడంతో తమ ఇంటి కోడలిగా చేసుకోవాలని చిరు కుటుంబ సభ్యులు అనుకుంటారు. ఆద్యా తల్లి వకుళ (ఖుష్భూ)కు పెళ్లి చేయడం ఇష్టం ఉండదు. తల్లి మాటే వేదంగా భావించే ఆద్య, ఆమెను ఎంతగానో ఇష్టపడిన చిరు.. చివరికి ఒకటయ్యారా లేదా అన్నది మిగతా కథ. 

విశ్లేషణ: 

అమ్మ, పెద్దమ్మ, పిన్ని బాబాయ్‌ ఇలా బంధాలు, విలువల మధ్య  పద్దతిగా పెరిగిన చిరు తన కుటుంబ సభ్యులకు నచ్చితేనే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఈ తరుణంలో చిరు ఫ్యామిలీ అమ్మాయిల్ని తిరస్కరించడం నుంచి అమ్మాయిలే అతన్ని అతన్ని రిజెక్ట్‌ చేసే పరిస్థితి ఎదురవుతుంది. ఇది కాస్త ఫ్రెష్‌గా అనిపిస్తుంది. మరో పక్క తను ప్రేమించిన అమ్మాయి తల్లికి పెళ్లి అంటే మంచి అభిప్రాయం ఉండదు. వకుళ మెప్పు పొందడానికి పెళ్లి పట్ల ఆమె సరైన అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి హీరో చేసే ప్రయత్నాలు నిజాయతీగా ఉన్నప్పటికీ చాలా చిత్రాలతో పోలిక కనిపిస్తుంది. ఈతరం అబ్బాయిలకు పెళ్లి సంబంధం కుదరాలంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయనేది దర్శకుడు వినోదాత్మకంగా చెప్పారు. ఫస్టాఫ్‌ అంతా పెళ్లి సంబంధాలు, కుటుంబ సభ్యుల చర్చలు ఇవే నడుస్తాయి. ప్రేక్షకుడి ఊహకు అందేలా సన్నివేశాలు, సంభాషణలు ఉన్నాయి. దర్శకుడు కిశోర్‌ తిరుమల రాసుకునే ప్రతి కథ ఫ్యామిలీ ఆడియన్స్‌ టార్గెట్‌గా ఉంటాయి. ఈ కథ కూడా అంతే. అయితే ఈ చిత్రం పూర్తిగా ఆడవాళ్లే కీలకంగా సాగుతుంది. మరో జంట లవ్‌స్టోరీని చిరు సాల్వ్‌ చేయడం రొటీన్‌గా అనిపించింది. ఫైనల్‌గా వకుళ ఆద్య పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే ప్రీ క్లైమాక్స్‌ సన్నివేశాలు ఉత్కంఠ కలిగించేలా ఉన్నాయి. వకుళ జీవితాన్ని మాటల రూపంలో కాకుండా సన్నివేశాల రూపంలో చెప్పుంటే బావుండేది. సెంటిమెంట్‌ సీన్స్‌ రాయడంలో కిశోర్‌ది విభిన్నమైన శైలి. ఎందుకో ఈ చిత్రంలో అది మిస్‌ అయింది. టైటిల్‌కు తగ్గట్టు తెర మొత్తం ఆడవాళ్లే కనిపించడం, వాళ్ల డైలాగులే వినిపిస్తాయి. శర్వా, వెన్నెల కిశోర్‌ మినహా మిగిలిన మగ పాత్రలన్నీ రెండు మూడు సన్నివేశాల్లో ఇలా వచ్చి అలా వెళ్తుంటాయి. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌లో పన్నీర్‌ జిలేబీ బాక్స్‌, వెన్నెల కిశోర్‌ బెడ్‌రూమ్‌ సీన్‌, శర్వా అమ్మాయి ప్రేమ గురించి చెప్పే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. మాటలు, కొన్ని పంచులు బాగానే పేలాయి.


ఇక ఆర్టిస్ట్‌ల విషయానికొస్తే.. కుటుంబ నేపథ్యమున్న కథల్లో చిరులాంటి పాత్ర చేయడం శర్వాకు కొట్టిన పిండి అనే చెప్పాలి. గత నాలుగు చిత్రాల్లో సీరియస్‌ రోల్స్‌లో కనిపించిన ఆయన ఈ పాత్రను చాలా ఈజీగా చేశాడు. రష్మిక అందం అభినయంతో ఆకట్టుకుంది. రాధిక, ఊర్వశి అండ్‌ కో అంతా పాత్రల మేరకు న్యాయం చేశారు. సత్య, వెన్నెల కిశోర్‌,  ప్రదీప్‌ రావత్‌ పాత్రలు కొంత హాస్యం పంచాయి. ఫస్టాఫ్‌లో కాస్త కత్తెర వేసుంటే బాగుండును. దేవిశ్రీ ప్రసాద్‌ పాటలు ఆకట్టుకున్నాయి. నేపథ్య సంగీతం తన మార్క్‌లో లేదు. కెమెరా పనితనం, నిర్మాణ విలువలు బావున్నాయి. కిశోర్‌ తాలుక భావోద్వేగాలు ఇంకాస్త జోడించి ఉంటే కొన్ని సన్నివేశాలు పండేవి. కమర్షియల్‌ అంశాలు ఆశించకుండా సినిమాకు వెళ్లిన వాళ్లకు మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అవుతుంది. 


ట్యాగ్‌లైన్‌: ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

Updated Date - 2022-03-04T20:49:12+05:30 IST