AAGMC: ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ రివ్యూ: చెప్పడానికేం లేదక్కడ!

ABN , First Publish Date - 2022-09-16T18:53:40+05:30 IST

మోహనకృష్ణ ఇంద్రగంటి (Mohanakrishna Indraganti) సినిమా అనగానే ఆ సినిమాలో కచ్చితంగా ఏదో కొత్త విషయం ఉంటుందని అంతా భావిస్తుంటారు. సాహిత్య బ్యాక్‌డ్రాప్ నుండి వచ్చాడు కాబట్టి..

AAGMC: ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ రివ్యూ: చెప్పడానికేం లేదక్కడ!

మూవీ పేరు: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి (Aa Ammayi Gurinchi Meeku Cheppali)

విడుదల తేదీ: 16 సెప్టెంబర్, 2022

నటీనటులు: సుధీర్ బాబు, కృతి శెట్టి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు

సమర్పణ: గాజులపల్లె సుధీర్ బాబు

బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్‌మార్క్ స్టూడియోస్

సంగీతం: వివేక్ సాగర్

డీవోపీ: పీజీ విందా

ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్

ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్

నిర్మాతలు: బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి

రచన, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి

  

   -సురేష్ కవిరాయని


మోహనకృష్ణ ఇంద్రగంటి (Mohanakrishna Indraganti) సినిమా అనగానే ఆ సినిమాలో కచ్చితంగా ఏదో కొత్త విషయం ఉంటుందని అంతా భావిస్తుంటారు. సాహిత్య బ్యాక్‌డ్రాప్ నుండి వచ్చాడు కాబట్టి.. ఆయన సినిమాలు కూడా అలానే ఉంటూ ఉంటాయి. ఒకటి రెండు సినిమాలు పరాజయం పాలైనప్పటికీ.. దర్శకుడిగా ఇంద్రగంటి తన మార్క్ ముద్ర వేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఆయనిప్పుడు సుధీర్ బాబు (Sudheer Babu)తో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ (Aa Ammayi Gurinchi Meeku Cheppali) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది సుధీర్ బాబుతో ఇంద్రగంటి చేసిన మూడో సినిమా. ఇందులో ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..


కథ:

నవీన్ (సుధీర్ బాబు) ఒక కమర్షియల్ దర్శకుడు. ఆయన సినిమాలన్నీ చాలా బాగా ఆడతాయి. తన తదుపరి సినిమా చేయడానికి ప్రయత్నాలు చేసుకుంటున్న నవీన్‌కి.. చెత్తలో ఒక పాత రీల్ దొరుకుతుంది. అది తీసుకుని ఇంటికెళ్లి చూశాక.. అందులో ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. ఆ రీల్‌లో తను చూసిన అమ్మాయిని వెతకడం ప్రారంభిస్తాడు నవీన్. చివరగా ఆ అమ్మాయి కనబడుతుంది. ఆమె పేరు అలేఖ్య (కృతి శెట్టి) అని ఆమె కళ్ల డాక్టర్ అని తెలుస్తుంది. నవీన్ ఆమెను కలిసి.. ఆమెతో సినిమా చేస్తానంటాడు. కానీ ఆమెకు సినిమాలంటే పడదు. అలేఖ్య తల్లిదండ్రులకు కూడా సినిమా అంటే పడదు. ఎందుకు వాళ్లకి సినిమా అంటే పడదు? అలేఖ్యతో నవీన్ సినిమా తీశాడా లేదా? అనేది తెరపైనే చూడాలి. (Aa Ammayi Gurinchi Meeku Cheppali Review)


విశ్లేషణ:

దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ సినిమా అనగానే ఆ సినిమాలో ఎంతో కొంత విషయం ఉంటుందని అనుకుంటాం.. కానీ, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా మొదటి సన్నివేశం నుండి ప్రేక్షకులకు ఎందుకో ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది ఇంద్రగంటి తీసిన సినిమానా? లేక అతని అసిస్టెంట్ తీశాడా? అని కూడా అనిపిస్తుంది. మొదటి సగంలో ఎటువంటి ఇంటరెస్టింగ్ పాయింట్ లేకుండా తీశాడు. ఇక మొదటి సగం చూసేసరికే ప్రేక్షకుడికి విషయం అర్థమై.. రెండో సగానికి ఇంట్లో ఉంటాడు. ఎందుకంటే.. రెండో సగం చూడనవసరం లేదు..  డైలాగ్స్‌తో సహా కథంతా ప్రేక్షకుడికి అర్థమైపోతుంది. చాలా సన్నివేశాలను ఇంద్రగంటి సాగదీస్తూనే వచ్చాడు. ఈమధ్య ఓటిటి వాళ్లు సినిమాలని తప్పనిసరిగా థియేటర్లలో విడుదల చేస్తేనే కానీ తీసుకోము అనే షరతు విధించడంతో.. చేసేది లేక కొందరు నిర్మాతలు తమ సినిమాలని థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా కూడా ఆ కోవకే వస్తుంది. అందుకే ఈ సినిమాని థియేటర్లో విడుదల చేశారు.. లేదంటే డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేయాల్సిన సినిమా ఇది. విషయం ఉన్న ఇంద్రగంటి వంటి దర్శకులు కూడా.. ఎటువంటి విషయంలేని సినిమాలు ఎలా తీయవచ్చో ఈ సినిమాతో చూపించారు. సినిమా వాళ్లమీద తీసిన ఈ సినిమాలో చివరి 15 నిమిషాలు తప్ప.. సినిమా వాళ్ల గురించి చెప్పిందీ ఏం లేదు.. అలాగే టైటిల్‌లో అమ్మాయి గురించి కూడా చెప్పడానికేం లేదు. ఆ చివరి పదిహేను నిమిషాల కోసం రెండు గంటలు ప్రేక్షకుడిని హింస పెట్టడమే. (aagmcreview)


ఇక నటీనటుల విషయానికి వస్తే సుధీర్ బాబు తన వంతు కృషి తను చేశాడు కానీ మంచి కథ లేకపోవడంతో అతను చేసిన కృషి అంతా వృథా ప్రయత్నమే. కృతి శెట్టి పరవాలేదనిపించింది. వెన్నెల కిషోర్ అదే జోక్స్.. అదే నటన. ఈ మధ్య కాలంలో ఆయన నటించిన సినిమాలన్నింటిలో దాదాపు ఒకటే ఎక్స్‌ప్రెషన్. అందుకే ఈ సినిమాలో ఆయన ఏం చేస్తున్నా.. బోర్‌గానే అనిపిస్తుంది. రాహుల్ రామకృష్ణ బాగానే చేశాడు. శ్రీకాంత్ అయ్యంగార్, అలాగే ఆయన భార్యగా వేసినామే ఇద్దరూ ఓవర్ యాక్టింగ్ చేశారు. అవసరాల అతిథి పాత్రలో కనిపిస్తాడు. వీళ్లే ఈ సినిమాలో ప్రధాన పాత్రలు. ఇంక సంగీతం అంతంత మాత్రమే.. సినిమాలో విషయం లేనప్పుడు మిగతావి ఎన్ని బాగున్నా కూడా.. వాటికి పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. ఇంద్రగంటి తను చదివిన ఇంటలెక్చువల్ పదాలు ఈ సినిమాలో ఎక్కువ వాడాడు. అవి సగటు ప్రేక్షకుడికి అస్సలు అర్థం కావు. (Aa Ammayi Gurinchi Meeku Cheppali Review)


చివరగా ఈ అమ్మాయి గురించి మనం ఏమి తెలుసుకోనవసరం లేదు. తెలుసుకోలేకపోయామని విచారించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే, ఓటిటిలో ఈ సినిమా త్వరలోనే కనిపిస్తుంది. అప్పుడు చూసుకోవచ్చు.. అంత కంగారు పడాల్సిన అవసరమే లేదు.


ట్యాగ్‌లైన్: చెప్పడానికేం లేదక్కడ!

Updated Date - 2022-09-16T18:53:40+05:30 IST