గీత దాటుతున్న యూట్యూబ్‌ ఛానళ్లు

ABN , First Publish Date - 2022-11-30T05:07:12+05:30 IST

‘కొన్ని యూ ట్యూబ్‌ ఛానల్స్‌ , వెబ్‌ సైట్స్‌ తన గురించి అసత్యప్రచారం చేస్తున్నాయి, వారిపై చర్య తీసుకోండి’ అని నటి పవిత్ర హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు కంప్లయింట్‌ ఇవ్వడంతో...

గీత దాటుతున్న యూట్యూబ్‌ ఛానళ్లు

అసత్య ప్రచారంతో అడ్డదారులు 

సినీ తారల పరువు ప్రతిష్టతో ఆటలు

‘కొన్ని యూ ట్యూబ్‌ ఛానల్స్‌ , వెబ్‌ సైట్స్‌ తన గురించి అసత్యప్రచారం చేస్తున్నాయి, వారిపై చర్య తీసుకోండి’ అని నటి పవిత్ర హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు కంప్లయింట్‌ ఇవ్వడంతో మళ్లీ సోషల్‌ మీడియా నియంత్రణ  గురించి చర్చ మొదలైంది.  గీత దాటడమే కాకుండా హద్దు మీరి ప్రవర్తిస్తున్న కొన్ని యూ ట్యూబ్‌ ఛానల్స్‌ పై చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం చిత్ర పరిశ్రమలో వ్యక్తమవుతోంది. తమపై దుష్ప్రచారం చేస్తున్న యూ ట్యూబ్‌ ఛానల్స్‌ వెనుక నరేశ్‌ మూడో భార్య రమ్య హస్తం ఉందనే అనుమానాన్ని కూడా పవిత్ర తన కంప్లెయింట్‌లో వ్యక్తం చేశారు. తమని ఇబ్బంది పెడుతున్న యూ ట్యూబ్‌ ఛానల్స్‌ లింక్స్‌ను కూడా ఆమె జత చేయడంతో వాటిని పరిశీలించి, పది యూ ట్యూబ్‌ ఛానల్స్‌కు నోటీసులు జారీ చేశారు పోలీసులు. నరేశ్‌, పవిత్రలను ట్రోల్‌ చేసిన వీడియోలను కూడా డిలీట్‌ చేయించారు. ఈ వ్యవహారంలో రమ్మ పాత్ర పై విచారణ జరుపుతున్నామనీ, అవసరమైతే ఆమెకు కూడా నోటీసులు జారీ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. 


సోషల్‌ మీడియా విజృంభణ వల్ల లాభం ఎంత ఉందో, అదే స్థాయిలో నష్టం కూడా జరుగుతోంది. దేనికైనా ఓ పరిధి ఉంటుంది. దానిని అతిక్రమిస్తే ఇలా ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఇప్పుడు వెబ్‌ సైట్స్‌ హవా కొంత తగ్గింది కానీ పదేళ్ల క్రితం వాటి జోరుకి హద్దులు ఉండేవి కాదు. కాంట్రవర్సీ విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం, హద్దు మీరి విమర్శలు చేయడం, వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుని వాటికి విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించడం.. గతంలో కొన్ని వెబ్‌ సైట్స్‌ చేశాయి. దాంతో చిత్ర పరిశ్రమ పెద్దలు రంగంలోకి ఆ వెబ్‌ సైట్స్‌ జోరుకు కళ్లెం వేశారు. మరీ దూకుడుగా వ్యవహరించిన వెబ్‌ సైట్స్‌  పై కేసులు కూడా పెట్టారు. దాంతో చాలా కాలం పాటు వెబ్‌ సైట్స్‌ వివాదస్పద విషయాల జోలికి వెళ్లలేదు. 


లెక్కకు మించిన సంఖ్యలో ఉన్న యూ ట్యూబ్‌ ఛానల్స్‌పై నియంత్రణ లేకపోవడంతో తమకు ఇష్టం వచ్చిన రీతిలో అవి వ్యవహరిస్తున్నాయి. వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా థంబ్‌ నెయిల్స్‌ పెడుతున్నాయి. కొన్ని యూ ట్యూబ్‌ ఛానల్స్‌ పెడుతున్న థంబ్‌ నెయిల్స్‌కు, వీడియోలో ఉన్న కంటెంట్‌కు సంబంధమే ఉండడం లేదు. అయితే వివాదాస్పదమైన థంబ్‌ నెయిల్స్‌ పెడితేనే వీక్షకుల సంఖ్య పెరుగుతుంది కనుక తమకు ఆదాయం రావడం కోసం ఎంతకైనా తెగిస్తున్నాయి కొన్ని యూ ట్యూబ్‌ ఛానల్స్‌. సబ్‌స్కైబర్స్‌ను  పెంచుకోవడానికి సోషల్‌ మీడియాలో కొందరు వ్యక్తులు చూపిస్తున్న అత్యుత్సాహం చిత్ర ప్రముఖుల ఇమేజ్‌ని దెబ్బ తీస్తోంది. అయితే ఓర్పుకు కూడా ఒక హద్దు ఉంటుంది. దాన్ని అతిక్రమిస్తే ఏమవుతుందో హీరోయిన్‌ సమంత తన చేతలతో నిరూపించారు. హీరో నాగచైతన్యతో తన విడాకుల విషయాన్ని ప్రకటించిన దగ్గర నుంచి పని కట్టుకుని దుష్ప్రచారం చేస్తున్న కొన్ని యూ ట్యూబ్‌ ఛానల్స్‌ పై ఆమె కన్నెర్ర చేశారు. తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడమే కాకుండా నిజానిజాలు తెలుసుకోకుండా అసత్య ప్రచారం చేస్తున్న కొన్ని యూ ట్బూబ్‌ ఛానల్స్‌ పై  ఆమె పరువు నష్టం దావా వేశారు.  ఇలాంటి విషయాల్లో ఓ హీరోయిన్‌ కోర్టు మెట్లు ఎక్కడం అదే ప్రథమమేమో! సమంత దెబ్బకు యూ ట్యూబ్‌ ఛానల్స్‌ కొన్ని రోజులు మౌనం వహించాయి. అయితే మళ్లీ ఆమె అనారోగ్యం గురించి రకరకాల కథనాలలతో యూ ట్యూబ్‌ ఛానల్స్‌  వీడియోలు చేయడం పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లయింది. 


ట్రోల్స్‌ పై స్పందించిన విష్ణు

ఈ మధ్య కాలంలో బాగా ట్రోల్‌కు గురయిన సినీ కుటుంబాల్లో మంచు ఫ్యామిలీ ఒకటి. సీనియర్‌ హీరో మోహన్‌బాబు గురించి, ఆయన తనయుడు విష్ణు గురించి కొన్ని యూ ట్యూబ్‌ ఛానల్స్‌ హద్దు మీరి ప్రవర్తించి, వ్యక్తిగత విమర్శలతో వీడియోలు చేశాయి. తన ఫ్యామిలీని టార్గెట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ చేస్తున్న వారెవరో తనకు తెలుసనీ, ఇండస్ట్రీలోని వారే కావాలని ఇలా ప్రచారం చేస్తున్నారని మంచు విష్ణు మీడియాకు చెప్పారు కూడా. ఒక హీరోకు చెందిన ఆఫీసు నుంచే ఇలా తనపై ట్రోల్స్‌ వస్తున్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు కూడా. దీనికి సంబంధించిన కేసు కూడా నడుస్తోంది. 


కంటతడి పెట్టిన జీవిత

తన కుమార్తెల గురించి సోషల్‌ మీడియాలో తప్పుడు వార్తలు రాస్తున్న వారి మీద, ఇష్టం వచ్చినట్లు థంబ్‌ నెయిల్స్‌ పెడుతున్న వారి మీద జీవితా రాజశేఖర్‌ కూడా ఓ సందర్భంలో ఫైర్‌ అయ్యారు. పెళ్లి కావాల్సిన ఆడపిల్లల మీద ఇలా ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తారా అని ప్రశ్నిస్తూ ఓ దశలో కంటతడి పెట్టారు కూడా. రాజశేఖర్‌, జీవిత పెట్టిన కేసు కూడా సైబర్‌ పోలీసుల పరిశీలనలో ఉంది. ఉద్దేశపూర్వకంగా ఇలాంటి వీడియోలు రూపొందించి, మహిళలను ఇబ్బంది పెడితే ఐపీసీ చట్టం లోని సెక్షన్‌ 509 కింద కేసు నమోదు చేసి, మూడేళ్ల వరకూ శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. 


నియంత్రణ ఏది?

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న యూ ట్యూబ్‌ ఛానల్స్‌ పై నియంత్రణ ఏమీ లేదు. లైసెన్సింగ్‌ విధానం లేదు. పెట్టుబడి పెద్దగా అవసరం లేదు. అందుకే  సినిమాకు సంబంధించి తెలుగులో ఉన్నన్ని యూ ట్యూబ్‌ ఛానల్స్‌ మరే ఇతర భాషలోనూ లేవని చెప్పాలి. సినిమాల గురించి ఎటువంటి అవగాహన లేని వ్యక్తులు కూడా యూ ట్యూబ్‌ ఛానల్స్‌ పెట్టడం, సెల్‌ఫోన్‌తోనే వీడియోలు తీస్తూ జనం లోకి పంపించడం చేస్తున్నారు.  ఎక్కువ మంది సబ్‌ స్కైబర్స్‌ను ఆకర్షించాలనే తాపత్రయంతో కొన్ని చానల్స్‌ వివాదస్పద మైన థంబ్‌ నెయిల్స్‌ పెడుతూ సినీ ప్రముఖుల్ని ఇబ్బంది పెడుతున్నాయి. నియంత్రణ లేకపోవడంతో ఆ ఛానల్స్‌ హద్దు మీరి ప్రవర్తిసూ తారల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తూ వివాదాలు సృష్టిస్తున్నాయి. వీటి మీద చిత్ర పరిశ్రమ పెద్దలు దృష్టి పెడితే తప్ప వాటి జోరుకు కళ్లెం వేయడం కష్టం. 

Updated Date - 2022-11-30T05:07:12+05:30 IST

Read more