Bigg Boss విన్నర్ జాతకం తెలిసిపోయే రోజు వచ్చేసింది
ABN , First Publish Date - 2022-09-13T23:29:59+05:30 IST
‘నన్ను నేను తెలుసుకోవాలి.. నేనేంటో సమాజానికి తెలియాలి..’ ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఇదే. అదే కాస్త సెలబ్రిటీలు అయితే.. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత

‘నన్ను నేను తెలుసుకోవాలి.. నేనేంటో సమాజానికి తెలియాలి..’ ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఇదే. అదే కాస్త సెలబ్రిటీలు అయితే.. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మంచి అవకాశాలు వస్తాయని భావిస్తూ ఉంటారు. కానీ, హౌస్‌లో కొన్ని రోజుల పాటు ఉండి.. ఎలిమినేట్ అయిన సెలబ్రిటీలెవరికీ సరైన అవకాశాలు వచ్చిన దాఖలాలైతే లేవు. అలాగే మొదటి సీజన్ నుండి గెలిచిన వారెవరూ కూడా బిజీగా లేరు.. సరికదా.. అసలు వారిని పట్టించుకునే వారే లేరు. కానీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్ విజె సన్నీ (VJ Sunny) మాత్రం.. వరుస అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. హీరోగా ఓ ఐదారు సినిమాలు వెంటవెంటనే ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆయన నుండి సినిమా ప్రకటనలు అయితే వస్తున్నాయి కానీ.. సినిమా మాత్రం ఇంత వరకు రాలేదు. అయితే.. బుల్లితెర నుండి వెండితెరవైపు అడుగేసిన సన్నీ భవిష్యత్ ఎలా ఉండబోతుందనేది తెలిసే రోజు వచ్చేసింది. ఆయన హీరోగా నటించిన మొదటి చిత్రం ‘సకల గుణాభి రామ’ (Sakala Gunabhi Rama) సెప్టెంబర్ 16న విడుదల కాబోతోంది.
విజె సన్నీ, అషిమా హీరోహీరోయిన్లుగా శ్రీనివాస్ వెలిగొండ (Srinivas Veligonda) దర్శకత్వంలో సంజీవ్ రెడ్డి (Sanjeev Reddy) నిర్మించిన చిత్రం ‘సకల గుణాభి రామ’. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 16న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఆది నారాయణ ఎస్కెఎమ్ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించేందుకు మేకర్స్ తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హీరో సన్నీ మాట్లాడుతూ.. మాకు బిగ్‌బాస్ ప్లాటుఫామ్ ఉన్నా.. హీరోగా నటించాలనే కోరిక మాత్రం ఎప్పటి నుంచో ఉంది. నేను బిగ్ బాస్‌లోకి రాక ముందే నాకు హీరోగా అవకాశం ఇచ్చిన మా నిర్మాత సంజీవ్‌గారికి నా కృతజ్ఞతలు. మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ అద్భుతమైన పాటలు ఇచ్చారు. నాకు హీరోగా ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీనివాస్‌గారికి నా ధన్యవాదాలు. ఈ సినిమా విషయంలో చాలా మంది సపోర్ట్ చేశారు.. వారందరికీ ధన్యవాదాలు. మా చిత్రాన్ని 100 థియేటర్స్‌లో విడుదల చేస్తున్న ఆది నారాయణగారికి ధన్యవాదాలు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని చేశాము.. ప్రేక్షకులందరూ మా సినిమాని చూసి హిట్ చేస్తారని కోరుతున్నానని అన్నారు. (Sakala Gunabhi Rama Release date)