స్పీడు పెరిగింది... తీరు మారింది
ABN , First Publish Date - 2022-12-31T02:28:59+05:30 IST
దేశ భవిష్యత్తు యువతరంపైనే ఆధారపడి ఉంది. వాళ్లే... దేశాన్ని ముందుకు నడిపిస్తారు. సినిమాల్లోనూ అంతే. యువ హీరోలే దిశా నిర్దేశకులు.
దేశ భవిష్యత్తు యువతరంపైనే ఆధారపడి ఉంది. వాళ్లే... దేశాన్ని ముందుకు నడిపిస్తారు. సినిమాల్లోనూ అంతే. యువ హీరోలే దిశా నిర్దేశకులు. ప్ హీరోలు చిత్రసీమని శాసిస్తారు. కాదనలేం. కానీ... యూత్ హీరోలే ఆక్సిజన్ అందిస్తారు. పెద్ద హీరోలంతా కలిపి యేడాదికి 20 సినిమాలు చేస్తే గొప్ప. మిగిలిన హీరోలు 200 సినిమాలు అందిస్తారు. చిత్రసీమ నిత్య కల్యాణం.. పచ్చ తోరణంలా మెరుస్తోందంటే దానికి కారణం యువ హీరోలే. పరిశ్రమకు కొత్త కథతో అడుగుపెట్టిన దర్శకుడికీ, కోటి ఆశలతో వచ్చిన నిర్మాతకీ... వచ్చీ రాగానే పెద్ద హీరోలు దొరకరు. చిన్న హీరోలతోనే ఎవరి ప్రయాణమైనా మొదలవ్వాలి. ఓ చిన్న హీరో హిట్టు కొడితే.. తనని నమ్ముకొని, కొత్త సినిమాలు పట్టాలెక్కుతాయి. పరిశ్రమలో కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. నిత్యం... సినిమాలూ, షూటింగులతో.. టాలీవుడ్ కళకళలాడుతుంది. ఈ యేడాది కూడా యువతరం స్పీడు స్పీడుగా సినిమాలు చేసేసింది. హిట్లు కొట్టారా? ఫ్లాపులతో ఇబ్బంది పడ్డారా? అనేది పక్కన పెడితే... వాళ్ల నుంచి భారీ సంఖ్యలో చిత్రాలొచ్చాయి.
యువ హీరోల్లో... నాని, శర్వానంద్, నాగచైతన్య ఓ బ్యాచు. వీళ్లు ఎలాంటి కథలకైనా సూట్ అయిపోతారు. నాని అయితే ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్. శర్వా, చైతూలకు లవ్‌స్టోరీలు, ఫ్యామిలీ డ్రామాలు నప్పుతాయి. నాని నుంచి 2022లో ‘అంటే... సుందరానికీ..’ వచ్చింది. నాని స్టైల్‌లో సాగిపోయిన వినోదాత్మక చిత్రమిది. బాక్సాఫీసు దగ్గర ‘ఓకే’ అనిపించుకొంది. నిర్మాతగా ‘హిట్ 2’తో ఓ మంచి హిట్టు కొట్టాడు. అయితే వెబ్ సిరీ్‌సగా చేసిన ‘మీట్ - క్యూట్’ మెప్పించలేదు. శర్వానంద్ నుంచి ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’, ‘ఒకే ఒక జీవితం’ వచ్చాయి. రెండూ యావరేజ్ మార్క్ దగ్గరే ఆగాయి. ‘ఆడవాళ్లూ..’ ఫ్యామిలీ డ్రామా అయితే.. ‘ఒకే ఒక జీవితం’ ఎమోషనల్ జర్నీ. నాగచైతన్య ఈ యేడాది మూడు సినిమాలిచ్చాడు. అందులో ఓ హిందీ సినిమా ఉంది. నాగార్జునతో చేసిన ‘బంగార్రాజు’ కమర్షియల్‌గా ‘ఓకే’ అనిపించుకొంది. అయితే భారీ అంచనాలతో వచ్చిన ‘థ్యాంక్యూ’ నిరాశ పరిచింది. అమీర్ ఖాన్ కోసం ఎంతో ఇష్టంగా చేసిన ‘లాల్ సింగ్ చద్దా’ కూడా బోల్తా కొట్టింది.
ఈ యేడాది అడవిశేష్, నిఖిల్‌లకు మంచి ఫలితాలొచ్చాయి. ముఖ్యంగా అడవిశేష్ వరుస హిట్లు కొట్టాడు. పాన్ ఇండియా సినిమాగా చేసిన ‘మేజర్’ అన్ని చోట్లా ఘన విజయం సాధించింది. ‘హిట్ 2’ సైతం మంచి వసూళ్లు దక్కించుకొంది. రెండూ వేర్వేరు జోనర్లే. ‘కార్తికేయ 2’తో నిఖిల్ జాతకమే మారిపోయింది. ఈ సినిమాతో తను ‘పాన్ ఇండియా హీరో’ అయిపోయాడు. నార్త్‌లో ఈ చిత్రం ఊహించని వసూళ్లు దక్కించుకొంది. ఈ యేడాది చివర్లో వచ్చిన ‘18 పేజెస్’ మంచి రివ్యూలను దక్కించుకొంది. విడుదలకు ముందే ఈ చిత్రం నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది. ఈ యుడాది విజయ్ దేవరకొండ నుంచి వచ్చిన ఏకైక చిత్రం ‘లైగర్’. భారీ అంచనాలతో విడుదలైన ‘లైగర్’ ఊహించని విధంగా పరాజయాన్ని మూటగట్టుకొంది. అన్ని ఏరియాల్లోనూ బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు శివ నిర్వాణతో చేస్తున్న ‘ఖుషి’ సమంత అనారోగ్యంతో ఆగింది. పూరితో చేయాలనుకొన్న ‘జనగణమన’ ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. వరుణ్‌తేజ్‌కి మిశ్రమ ఫలితాలొచ్చాయి. వెంకటేశ్‌తో చేసిన ‘ఎఫ్ 3’ కమర్షియల్ హిట్ దక్కించుకొంటే ‘గని’ ఫ్లాప్ అయ్యింది. అఖిల్ సినిమా ఒక్కటీ విడుదల కాలేదు. ‘ఏజెంట్’ రీషూట్లతో నత్తనడక నడుస్తోంది. నాగశౌర్య ‘వరుడు కావలెను’ డీసెంట్ హిట్ అయితే, ‘కృష్ణ వ్రింద విహారి’ ఆశించిన మేర ఆడలేదు. ‘భళా తందనాన’, ‘అల్లూరి’ ఫ్లాపులతో... శ్రీవిష్ణు కెరీర్ కాస్త డల్ అయ్యింది. సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మెప్పించలేదు. రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై.. చాలా కాలం కెమెరాకు దూరమయ్యాడు తేజ్. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలు చేస్తున్నాడు. వచ్చే యేడాది వైవిధ్యభరితమైన చిత్రాల్ని విడుదల చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాడు తేజ్. రానా ‘భీమ్లా నాయక్’లో మెరిశాడు. తన నటనకు మంచి పేరొచ్చింది. ‘విరాటపర్వం’ బాక్సాఫీసు దగ్గర మెప్పించలేదు కానీ, విమర్శకుల ప్రశంసలు దక్కించుకొంది. తన లైనప్ కూడా చాలా స్ర్టాంగ్‌గా ఉందిప్పుడు.
పెద్ద హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఆ గాలి.. యువ హీరోల వైపూ మళ్లింది. నాని ‘దసరా’ పాన్ ఇండియా ప్రాజెక్టే. విజయ్ దేవరకొండ ‘లైగర్’ దేశ వ్యాప్తంగా విడుదలైంది. ‘కార్తికేయ 2’ కూడా అన్ని భాషలకూ వెళ్లింది. సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ పాన్ ఇండియా ప్రాజెక్టే. ఫలితాల మాట ఎలా ఉన్నా.. యంగ్ హీరోలంతా జోరుగా సినిమాలు చేస్తున్నారు. పాన్ ఇండియా కథల వైపుగా దృష్టి సారిస్తున్నారు. దాంతో... కథల విషయంలో రచయితలు, దర్శకులు తమ పంథాని మారుస్తున్నారు. బడ్జెట్లు కూడా పెరుగుతున్నాయి. దాంతో నాణ్యమైన చిత్రాలు తయారవుతున్నాయి. 2023లో ఈ హీరోల నుంచి మరిన్ని ఎక్కువ చిత్రాలొస్తున్నాయి. మరి కొత్త యేడాది వీరి స్పీడు ఎలా ఉంటుందో..?