వర్మకీ.. ఈ కథకీ సంబంధం లేదు
ABN, First Publish Date - 2022-01-20T07:21:09+05:30
నిర్మాత నట్టికుమార్ కుమారుడు నట్టి క్రాంతి కథానాయకుడిగా పరిచయమైన చిత్రం ‘వర్మ... వీడు తేడా’. నట్టికుమార్ దర్శకత్వం వహించారు.
నిర్మాత నట్టికుమార్ కుమారుడు నట్టి క్రాంతి కథానాయకుడిగా పరిచయమైన చిత్రం ‘వర్మ... వీడు తేడా’. నట్టికుమార్ దర్శకత్వం వహించారు. నట్టి కరుణ నిర్మాత. ఈనెల 21న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా క్రాంతి మాట్లాడుతూ ‘‘టైటిల్ చూసి ఇది రాంగోపాల్ వర్మపై తీసిన సినిమా అనుకుంటున్నారంతా. కానీ ఈ కథకూ వర్మకూ సంబంధం లేదు. ఈ సినిమాలో హీరో పేరు.. వర్మ. తను సైకోలా ప్రవర్తిస్తుంటాడు. అలాంటి కుర్రాడు ప్రేమలో పడితే ఎలా ఉంటుందో చూపించాం. సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. మంచి లవ్ స్టోరీ కూడా ఉంది. చమక్ చంద్రతో రూపొందించిన సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. నా తొలి సినిమాకి నా తండ్రి దర్శకత్వం వహించడం సంతోషంగా ఉంది. ఆయన నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. నిజానికి నాకు దర్శకుడు కావాలని కోరిక. అందుకోసం న్యూయార్క్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో శిక్షణ పొందాను. వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర నటనకు సంబంధించిన మెళకువలు నేర్చుకున్నా. నాకు రజనీకాంత్ అంటే చాలా ఇష్టం. చిత్రసీమలో దాసరి, రామానాయుడు నాకు గురుసమానులు’’ అన్నారు.