టాలీవుడ్‌... మూణ్ణాళ్ల ముచ్చట

ABN , First Publish Date - 2022-03-28T06:27:49+05:30 IST

‘ఆశా ఎన్‌కౌంటర్‌’ అనే సినిమాతో ఈ యేడాది మొదలైంది. జనవరి 1న విడుదలైన చిత్రమది. అదే రోజు వరుణ్‌ సందేశ్‌ ‘ఇందువదన’ కూడా వచ్చింది. రెండూ ఫ్లాపులే. అలా.. 2022 సంవత్సరం...

టాలీవుడ్‌... మూణ్ణాళ్ల ముచ్చట

2022 కాలెండర్‌లో అప్పుడే మూడు నెలలు గడిచిపోయాయి. విద్యార్థుల భాషలో చెప్పాలంటే క్వార్టర్లీ అయిపోయిందన్నమాట. ఈ మూడు నెలల కాలంలో చాలానే సినిమాలొచ్చాయి. వారానికి రెండు మూడు చిత్రాలు ప్రేక్షకుల్ని పలకరించాయి. అందులో భారీ సినిమాలూ ఉన్నాయి. కొన్ని హిట్లు.. ఎన్నో ఫ్లాపులు. ఆశలు మోసుకొంటూ వచ్చిన చిత్రాలు కొన్ని చతికిల పడ్డాయి. ఒకట్రెండు చిత్రాలు అనూహ్య విజయాల్ని సొంతం చేసుకొన్నాయి. ఈ మూడు నెలల ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ ఒక్కసారి పరిశీలిస్తే...


‘ఆశా ఎన్‌కౌంటర్‌’ అనే సినిమాతో ఈ యేడాది మొదలైంది. జనవరి 1న విడుదలైన చిత్రమది. అదే రోజు వరుణ్‌ సందేశ్‌ ‘ఇందువదన’ కూడా వచ్చింది. రెండూ ఫ్లాపులే. అలా.. 2022 సంవత్సరం పరాజయాలతో శ్రీకారం చుట్టుకొంది. సంక్రాంతికి రావాల్సిన ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’, ‘భీమ్లా నాయక్‌’ వాయిదా పడినా ‘బంగార్రాజు’, ‘హీరో’, ‘రౌడీ బోయ్స్‌’, ‘సూపర్‌ మచ్చీ’ పండక్కి వినోదాలు పంచడానికి రెడీ అయిపోయాయి. వీటిలో ‘బంగార్రాజు’కి మాత్రమే విజయం దక్కింది. ఏపీలో టికెట్‌ రేట్లు తక్కువ ఉన్నా, ‘బంగార్రాజు’ మంచి వసూళ్లనే అందుకొంది. తెలంగాణలో మాత్రం ఆశించిన ఫలితాలు రాలేదు. ఏదేమైనా ఈ యేడాది టాలీవుడ్‌కు తొలి విజయం ‘బంగార్రాజు’తోనే దక్కింది. ఈనెలలోనే విడుదలైన కీర్తి సురేష్‌ సినిమా ‘గుడ్‌ లక్‌ సఖీ’ పూర్తిగా నిరాశపరిచింది. ఈ చిత్రానికి కనీసం ఓపెనింగ్స్‌ కూడా రాలేదు. ఫిబ్రవరిలో కూడా కొత్త చిత్రాల జోరు కొనసాగింది. 11న ‘ఖిలాడీ’ వచ్చింది. రవితేజ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. మాస్‌ అంశాలు పుష్కంలగా మేళవించినా, ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోలేకపోయింది. అదే రోజు విడుదలైన ‘సెహరి’ కూడా ఆకట్టుకోలేకపోయింది. ఫిబ్రవరి 12న విడుదలైన ‘డిజె టిల్లు’ చిన్న చిత్రాల్లో మిన్నగా నిలిచింది. జొన్నలగడ్డ సిద్దు నటన, ఆ పాత్రని తీర్చిదిద్దిన విధానం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ‘డీజే టిల్లు’ టైటిల్‌ సాంగ్‌ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించింది. 18న ‘సన్నాఫ్‌ ఇండియా’ వచ్చింది. మోహన్‌బాబు నటిస్తూ, స్ర్కీన్‌ ప్లే కూడా అందించిన చిత్రమిది. అయితే ప్రేక్షకుల నుంచి కనీస స్పందన కూడా రాలేదు. 25న విడుదలైన ‘భీమ్లా నాయక్‌’తో టాలీవుడ్‌కు కాస్త జోష్‌ వచ్చింది. పవన్‌ కల్యాణ్‌ - రానా కాంబినేషన్‌లో రూపొందిన చిత్రమిది. పవన్‌ సినిమా అనేసరికి ఓపెనింగ్స్‌ అదిరిపోతాయి. ఈ సినిమాకీ అదే జరిగింది. భారీ వసూళ్లతో శుభారంభం అందుకున్న ‘భీమ్లా..’ తొలి మూడు రోజులూ తన హవా చూపించగలిగింది. అయితే ఆ తరవాత వసూళ్లు అనూహ్యంగా తగ్గుమొహం పట్టాయి. ఎలా చూసినా పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌లో మరో విజయవంతమైన చిత్రంగా ‘భీమ్లా నాయక్‌’ నిలిచిపోయింది. 


మార్చి 4న ‘సబాస్టియన్‌’, ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ విడుదలయ్యాయి. రెండూ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి. ఇక అందరి దృష్టీ... ‘రాధేశ్యామ్‌’పైనే. ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన పాన్‌ ఇండియా చిత్రమిది. భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం మార్చి 11న వచ్చింది. తొలిరోజు వసూళ్ల వీర విహారం తరవాత.. మిక్డ్స్‌ టాక్‌ రావడంతో క్రమంగా వసూళ్లు తగ్గాయి. సాంకేతికంగా అత్యున్నతంగా తీర్చిదిద్దిన ఈ సినిమాలో బలమైన కథ, కథనాలు లేకపోవడం, ప్రభాస్‌ నుంచి ఆశించే మాస్‌ అంశాలు తగ్గడంతో.. అభిమానుల్ని నిరాశ పరిచింది. ‘బాహుబలి’, ‘సాహో’ చిత్రాలకు నార్త్‌లో భారీ వసూళ్లు వచ్చాయి. అయితే ఈసారి ఆ మ్యాజిక్‌ జరగలేదు. తదుపరి వారం వచ్చిన ‘స్టాండప్‌ రాహుల్‌’ రాజ్‌ తరుణ్‌ ఖాతాలో మరో పరాజయాన్ని చేర్చింది.


ఇక దేశమంతా తన వైపు తిప్పుకొన్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ ఈనెల 25న విడుదలైంది. ఎప్పటి నుంచో ప్రేక్షకుల్ని ఊరిస్తున్న చిత్రమిది. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కలిసి నటించడం, రాజమౌళి సినిమా కావడం, భారీ బడ్జెట్‌ కేటాయించడం.. ఇలా ఎలా చూసినా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ జనాల్ని విపరీతంగా ఆకర్షించేసింది. ఎన్నో వాయిదాల తదనంతరం వచ్చినా.. ఓపెనింగ్స్‌ అదిరిపోయాయి. తొలి రోజు వసూళ్లలో సరికొత్త ఇండియన్‌ రికార్డు సృష్టించింది. ప్రస్తుతానికైతే.. ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తోంది. అంచనాలకు తగ్గట్టుగా లేదని కొందరు, రాజమౌళి మరో అద్భుతం సృష్టించారని ఇంకొందరు.. తమ తీర్పు చెప్పేస్తున్నారు. ఆర్థికంగా ఈ సినిమా నిలబడిందా, లేదా? అనేది ఇంకొన్ని రోజులు ఆగితే గానీ తెలీదు.


మొత్తానికి ఈ మూడు నెలలూ కొన్ని కుదుపులు, ఇంకొన్ని మెరుపులతో సాగింది. ‘భీమ్లా నాయక్‌’, ‘రాధే శ్యామ్‌’, ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ ఓపెనింగ్స్‌ చూస్తుంటే, ప్రేక్షకులు సినిమాలు చూడ్డానికి రెడీగానే ఉన్నారు అనేది స్పష్టం అవుతోంది. ఇదివరకెప్పుడూ చూడని భారీ ఓపెనింగ్స్‌ ఈ చిత్రాలకు లభించాయి. ఓటీటీల నుంచి గట్టి పోటీ ఉన్నా.. థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ఆస్వాదించాలని ప్రేక్షకులు భావిస్తున్నారు. కావల్సిందల్లా.. వాళ్లకు నచ్చే చిత్రాలు రావడమే. ఈ వేసవిలో స్టార్‌ హీరోలు నటించిన చిత్రాలు చాలానే వరుస కట్టబోతున్నాయి. ‘ఆచార్య’, ‘ఎఫ్‌ 3’, ‘సర్కారు వారి పాట’, ‘కేజీఎఫ్‌ 2’, ‘బీస్ట్‌’ ఇలా క్రేజీ సినిమాలు వస్తున్నాయి. ఇవన్నీ ప్రేక్షకులకు ఆకట్టుకుని.. బాక్సాఫీసు కళకళలాడితే ఈ వేసవి సీజన్‌ని దిగ్విజయంగా ముగించొచ్చు. 


Updated Date - 2022-03-28T06:27:49+05:30 IST