ఈ విజయం అందరి కష్టం

ABN , First Publish Date - 2022-10-14T06:46:57+05:30 IST

‘‘గాడ్‌ఫాదర్‌’ విజయం వెనుక సమష్టి కృషి ఉంది. అందుకే ఈ విజయం నా ఒక్కడిదే అనుకోను’’ అన్నారు చిరంజీవి. ఆయన కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వం...

ఈ విజయం అందరి కష్టం

‘‘గాడ్‌ఫాదర్‌’ విజయం వెనుక సమష్టి కృషి ఉంది. అందుకే ఈ విజయం నా ఒక్కడిదే అనుకోను’’ అన్నారు చిరంజీవి. ఆయన కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వం వహించిన చిత్రం ఇది. సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో చిరంజీవి మీడియాతో ముచ్చటించారు. 


చిన్న చిన్న మార్పులు చేస్తే ‘లూసిఫర్‌’ చిత్రం నాకు చక్కగా సూటవుతుందని చరణ్‌తో సుకుమార్‌ చెప్పారట. అప్పుడు ‘లూసిఫర్‌’ చిత్రం చూశాను. అలాంటి  పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించగలిగితే మున్ముందు మరిన్ని వైవిధ్యమైన పాత్రలు, కథలు చేసే అవకాశం దక్కుతుందనుకున్నాను. ఈ సినిమాకు దర్శకుడిగా మోహన్‌రాజా మాత్రమే న్యాయం చేయగలడు అని చరణ్‌ నమ్మాడు. అదే నిజమైంది. నా అనుభవంతో ఏ మార్పు చెప్పినా మోహన్‌రాజా చాలా గొప్పగా స్వాగతించారు. 


పూరీ జగన్నాథ్‌, సర్వదమన్‌ బెనర్జీ, సత్యదేవ్‌, నయనతార... ఇలా ఆ పాత్రలకు వారిని ఎంపికచేయడంలో నా పాత్ర ఉంది. వారంతా అద్భుతంగా తమ పాత్రలు పండించారు. ఇక సల్మాన్‌ఖాన్‌ అయితే ‘చిరు గారు కోరితే నేను నటించడానికి రెడీ’ అన్నారు. అది ఆయన గొప్పదనం. 


బలమైన కథనం ఉంటే పాటలు, ఫైట్లు అవసరం లేదనుకున్నాం. ఇవేవీ లేకపోయినా ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. భవిష్యత్‌లోనూ ఇలాంటి వైవిధ్యమైన పాత్రలు చేస్తాను. మంచి పాత్రలు రావాలే గానీ పరభాషా చిత్రాల్లోనూ నటిస్తాను. 


ఈ తరం దర్శకులు సెట్స్‌లో డైలాగ్‌లు రాస్తున్నారనే  మాట మామూలుగా అన్నాను. సాధారణంగా ఇలాంటి పరిస్థితి ఉండదని చెప్పడమే నా ఉద్దేశం. ‘గాడ్‌ఫాదర్‌’ కోసం మోహన్‌రాజా అద్భుతమైన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చేశారు. దీనివలన సమయం, డబ్బు కలిసొచ్చాయి. 


నిజం నిలకడ మీద తెలుస్తుందని నమ్ముతాను కాబట్టే వివాదాల్లో నేను చాలా సంయమనంతో ఉంటాను. విమర్శించిన వాళ్లు తమ తప్పు తెలుసుకొని నా దగ్గరకు వస్తే ప్రేమగా వారిని దగ్గరకు తీసుకుంటాను. ఎంతమంది మనసులకు దగ్గరయ్యాను అనేదే నాకు ముఖ్యం. 


మా వంతు ప్రయత్నం చేసినా ‘ఆచార్య’ చిత్రం నిరాశపరిచింది. నాతో పాటు రామ్‌చరణ్‌ కూడా చాలా పెద్దమొత్తం పారితోషికం వదులుకున్నాం. నేను వదులుకున్న డబ్బు బయ్యర్లను కాపాడుతుందనే సంతృప్తి నన్ను అపజయ భావన నుంచి దూరం చేసింది. 


‘ప్రజారాజ్యం’ పార్టీని కొనసాగించి ఉంటే, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అత్యున్నత శిఖరాలు అందుకునేవాడిని అని అంటున్నారు. కానీ ఒక రాజకీయ నాయకుడిగా నేను ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం అవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు నటుడిగా నన్ను రెండు రాష్ట్రాల ప్రజలు ఆదరిస్తున్నారు. రాజకీయాల కన్నా ఇదే నాకు సంతోషంగా ఉంది. 

Updated Date - 2022-10-14T06:46:57+05:30 IST