‘అతడు’ సినిమానే నాకు స్ఫూర్తి: Swathimuthyam దర్శకుడు లక్ష్మణ్

ABN , First Publish Date - 2022-09-24T20:19:45+05:30 IST

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇప్పుడు చాలామంది యువకులు దర్శకులుగా వస్తున్నారు. వాళ్ళ కథలు కూడా ఫ్రెష్‌గా ఉంటున్నాయి. ఇప్పుడు ‘స్వాతిముత్యం’ (Swathimuthyam) అనే సినిమా..

‘అతడు’ సినిమానే నాకు స్ఫూర్తి: Swathimuthyam దర్శకుడు లక్ష్మణ్

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇప్పుడు చాలామంది యువకులు దర్శకులుగా వస్తున్నారు. వాళ్ళ కథలు కూడా ఫ్రెష్‌గా ఉంటున్నాయి. ఇప్పుడు ‘స్వాతిముత్యం’ (Swathimuthyam) అనే సినిమా దర్శకుడు లక్ష్మణ్ కూడా కుర్రాడే. సినిమాల మీద వున్న ఆసక్తితో ఈ పిఠాపురం అబ్బాయి ఇంజనీరింగ్ మధ్యలో ఆపేసి మరీ హైదరాబాద్ వచ్చేశాడు. ముందు ఒకటి రెండు షార్ట్ ఫిలిమ్స్ చేశాక.. బెల్లంకొండ గణేష్‌కి కథ నచ్చడం, వాళ్ళ ఫాదర్‌కి చెప్పడం, సితార ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ హౌస్‌తో మాట్లాడటం, అంతా ఆలా జరిగిపోయింది. ఈ సినిమా అక్టోబర్ 5న దసరా పండగకి విడుదల అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు లక్ష్మణ్‌ కె కృష్ణ (Lakshman K Krishna)తో స్పెషల్ ఇంటర్వ్యూ.. 


-సురేష్ కవిరాయని 


సినిమా ఇండస్ట్రీకి రావాలనే ఇన్స్పిరేషన్ ఎలా కలిగింది?

నేను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు ‘అతడు’ (Athadu) సినిమా విడుదలైంది, ఆ సినిమాని మూడు నాలుగు సార్లు చూశాను. అప్పుడు అనుకున్నాను సినిమా రైటర్ అవ్వాలని, దర్శకత్వం చేయాలని. అతడు సినిమాలో ఆ విలేజ్ అట్మాస్ఫియర్ అవన్నీ నాకు నచ్చాయి. ఆ సినిమా బాగా మైండ్‌లో ఉండిపోయింది, తర్వాత మణిరత్నంగారి సినిమాలు చూడటం మొదలు పెట్టా. 


విద్యాభ్యాసం ఎక్కడ, ఎంతవరకు?

కాకినాడ దగ్గర వున్న పిఠాపురం మా వూరు. నేను అక్కడే ఇంటర్మీడియట్ వరకు చదివాను. తరువాత గుంటూరులో ఇంజనీరింగ్ చదువుతూ మధ్యలో ఆపేశాను. సినిమాల మీద వున్న ఆసక్తితో హైదరాబాద్ వచ్చేశాను. 


హైదరాబాద్ వచ్చాక ఎలా సాగింది?

మొదటి నుండి షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉండేవాడిని. అలా చేస్తూ ఉండగా.. సైమా వాళ్ళు షార్ట్ ఫిలిం కాంటెస్ట్ స్టార్ట్ చేశారు, నేను కూడా పంపాను. అందులో నేను చేసిన షార్ట్ ఫిల్మ్ సెలెక్ట్ అయింది. అప్పుడు నా మీద నాకు కాన్ఫిడెంట్ పెరిగింది. ఆ తరువాత ఒక  చిన్న సినిమా ‘సదా మీ ప్రేమలో’ కొత్తవాళ్లతో చేశాను. నాకు తెలిసిన స్నేహితుడు ఫైనాన్స్ చేశాడు. ఈ సినిమాకి 12 లక్షల వరకు అయింది, కానీ చాలా బాగా వచ్చింది. ఆ తరువాత కొన్ని కథలు అనుకోని ఇంకా సినిమా ట్రై చేద్దాం అనుకున్నా. 


మొదటి సినిమాకి బీజం ఎక్కడ పడింది?

ఈ ‘స్వాతిముత్యం’ కథని లాక్‌డౌన్‌లో రాసుకున్నాను. కొత్తవాళ్లతో తీద్దామని ప్లాన్ చేసుకున్నా. ఇంతలో నాకు, బెల్లంకొండ గణేష్‌కి కామన్ స్నేహితుడు ఒకతను వున్నాడు. అతను నన్ను గణేష్ దగ్గరకి తీసుకెళ్లి కథలు చెప్పమన్నాడు. నేను ‘స్వాతిముత్యం’ కథ కాకుండా మూడు నాలుగు కథలు వేరేవి చెప్పాను. ఆయన నా ‘సదా మీ ప్రేమలో’ ట్రైలర్ చూశాడు, ఏదైనా ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఉంటే చెప్పమన్నాడు. అప్పుడు ‘స్వాతిముత్యం’ కథ చెప్పా. అతనికి నచ్చి వాళ్ళ ఫాదర్ సురేష్‌గారికి చెప్పాడు. సురేష్ గారు సితార వాళ్ళతో మాట్లాడారు, అలా మొదలైంది. (Swathimuthyam director Interview)


దర్శకుడిగా అనుభవం లేదు కదా? సెట్స్ మీద ఎలా సాగింది?

ముందు కొన్ని రోజులు తడబడ్డాను.. కానీ ఆ తర్వాత అలవాటయింది. ఈ సాయంత్రం షూటింగ్ లేదు అని ఉదయమే చెప్పేసేవాడిని, అలా చెప్పకూడదు అని నాకు తెలియదు. అలాంటివి చిన్నచిన్నవి వున్నాయి, కానీ నేర్చుకున్నాను. 


ఈ సినిమా క్లైమాక్స్ రీ-షూట్ చేశారని తెలిసింది?

ఇది రీ-షూట్ కాదండీ. క్లైమాక్స్ పార్ట్ సింపుల్గా ముగిద్దాం అనుకొని మొదట మేము తీసిన దానికే ఇంకో సీన్ యాడ్ చేస్తే బాగుంటుంది అని ఒక రోజు షూటింగ్ చేసాము. అంతే కానీ, అది రీ-షూట్ కాదు. 


త్రివిక్రమ్ (Trivikram) ఏమన్నారు మీ స్క్రిప్ట్ చూసి?

ఆయన ఏమైనా కరెక్షన్స్ చెప్తారేమో అనుకున్నా, కానీ చాలా బాగుంది, ఇందులో వున్న కేరక్టర్స్ అన్నీ కొత్తగా వున్నాయి, ప్రొసీడ్ అని చెప్పారు. 


ఎలాంటి కథలు అంటే ఇష్టం?

నేను ఎప్పుడూ నా చుట్టూ జరుగుతున్న సంఘటనలను, మనుషులను పరిశీలిస్తుంటాను. అందులో నుంచే కథలు వస్తాయి. అందుకే ఈ సినిమాలో డైలాగ్స్ కూడా మనం మాట్లాడుతున్నట్టుగానే ఉంటాయి. స్నేహితులు, కుటుంబాలు మన ఊర్లలో ఎలా మాట్లాడుతారు, ఎలా వుంటారు? అన్నీ నా సినిమాలో ఉంటాయి. ఇందులో కొన్ని పాత్రలు నేను చూసిన, తారసపడిన వాళ్ళని చూసి రాసినవే. 


కథానాయిక పాత్ర కూడా మీ వూర్లో వుండే అమ్మాయేనా? ప్రేమలో పడ్డారా?

ఆ పాత్రకు కూడా మా వూరిలో వున్న అమ్మాయిలే స్ఫూర్తి. నేను చాలా సార్లు ప్రేమలో పడ్డాను, మళ్ళీ లేచాను కూడా. నాదంతా వన్ సైడ్ లవ్. ప్రస్తుతానికి ఎవరూ లేరు. ఈ సినిమా విడుదలైన తర్వాత తదుపరి సినిమాలపై పూర్తిగా ఫోకస్ పెడదామనుకుంటున్నాను.


మీ అభిమాన నటుడు?

చిరంజీవి (Chiranjeevi)గారు నా అభిమాన నటుడు. అతని సినిమా ‘గాడ్‌ఫాదర్’ (GodFather)తో నా సినిమా విడుదలవడం నిజంగా నా అదృష్టం. నా సినిమా ఆయన సినిమాకి పోటీ కానే కాదు. ఆయన సినిమాతో కలిసి మాత్రమే విడుదలవుతోంది.. అంతే.Updated Date - 2022-09-24T20:19:45+05:30 IST

Read more