సూపర్‌ టాక్‌... వసూళ్లు వీక్‌!

ABN , First Publish Date - 2022-11-26T05:30:46+05:30 IST

ఇదంతా ఫస్ట్‌ షోకే తేలిపోతుంది. సినిమా ఇలా అయ్యిందో లేదో.. అలా రివ్యూలు వచ్చేస్తాయి. ‘బాగుంది’ అంటే ‘ఓకే’. అదే...

సూపర్‌ టాక్‌... వసూళ్లు వీక్‌!

సినిమా బాగుంది.. బాలేదు.. సూపర్‌.. బ్లాక్‌ బస్టర్‌.. ఇదంతా ఫస్ట్‌ షోకే తేలిపోతుంది. సినిమా ఇలా అయ్యిందో లేదో.. అలా రివ్యూలు వచ్చేస్తాయి. ‘బాగుంది’ అంటే ‘ఓకే’. అదే... ‘విషయం లేదు’ అని తేలిందా? జనం మోసేస్తారు. ఇక రెండో ఆటకే వసూళ్లు ఢమాల్‌ అంటాయి. ‘సినిమా బాగుంది’ అనే మౌత్‌ టాక్‌ కోసం నిర్మాతలు ఎదురు చూస్తుంటారు. ఒక్కసారి... ‘హిట్‌’ ముద్ర పడిందంటే ఇక హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకోవడం చాలా కష్టం. వచ్చిందా.. ఇక ఆ సినిమా విజయాన్ని ఎవరూ ఆపలేరు. అయితే ఈ మధ్య కొన్ని సినిమాల విషయంలో ఈ పాజిటీవ్‌ మంత్రం పనిచేయలేదు. సినిమా బాగుంది అనే టాక్‌ వచ్చినా... వసూళ్లు తేలిపోయాయి. ఆ టెంపోని చివరి వరకూ నిలబెట్టుకోవడంలో కొన్ని చిత్రాలు విఫలం అయ్యాయి. హిట్‌ బాట పట్టాల్సిన చిత్రాలు.. యావరేజ్‌ దగ్గర ఆగిపోతే, ఇంకొన్ని అనూహ్యంగా ఫ్లాప్‌ లిస్టులో చేరాయి. 


‘ఆచార్య’ నిరాశ పరచడంతో చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్‌’పై ఎక్కువ ఫోకస్‌ పెట్టారు. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసీఫర్‌’కి రీమేక్‌ ఇది. మోహన్‌ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరు లుక్‌, ఆయన స్ర్కీన్‌ ప్రెజెన్స్‌ కొత్తగా కనిపించాయి. విడుదల రోజున ‘హిట్‌’ టాక్‌ సంపాదించుకొంది. ప్రారంభ వసూళ్లు కూడా బాగున్నాయి. సోమవారం నుంచి వసూళ్లు బాగా మందగించాయి. నిర్మాతకు భారీ లాభాల్ని తెచ్చి పెడుతుందనుకొన్న ‘గాడ్‌ ఫాదర్‌’ బొటాబొటీగా గట్టెక్కినట్టు ట్రేడ్‌ వర్గాలు తేల్చాయి. ముందొచ్చిన టాక్‌కీ, చివర్లో తేలిన వసూళ్లకీ సంబంధమే లేదని విశ్లేషకులు పెదవి విరిచారు. కాకపోతే... చిరు అభిమానులకు ఈ సినిమా సంతృప్తిని మిగిల్చింది. అదొక్కటే కాస్త ఉపశమనం కలిగించే విషయం.


శర్వానంద్‌ కథల ఎంపిక ఎప్పుడూ కొత్తగా ఉంటుంది. సినిమా ఫలితం ఎలా ఉన్నా, కొత్తగా ప్రయత్నించాడన్న పేరు మాత్రం తెచ్చుకొంటారు. ‘ఒకే ఒక జీవితం’ విషయంలో అదే జరిగింది. శర్వా కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ఇటీవలే తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. టైమ్‌ మిషన్‌ నేపథ్యంలో, అమ్మ సెంటిమెంట్‌తో ఆసక్తిగా సాగిన కథ ఇది. చూసినవాళ్లంతా ‘బాగుంది..భేష్‌’ అంటూ మెచ్చుకొన్నారు. కానీ ఆ స్థాయిలో వసూళ్లు మాత్రం దక్కలేదు. డిజిటల్‌ రైట్స్‌ రూపంలో నిర్మాతకు ఆకర్షణీయమైన మొత్తం లభించింది. లేదంటే... నష్టాల బాట పట్టాల్సివచ్చేది. తమిళంలో అయితే ఈ సినిమాని లైట్‌ తీసుకొన్నారు. సమంత కథానాయికగా నటించిన ‘యశోద’కీ ఇదే పరిస్థితి వచ్చింది. హరి - హరీశ్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ సినిమా కోసం రూ.30 కోట్లు ఖర్చు పెట్టారు. సరోగసీ పేరుతో జరుగుతున్న అవకతవకల్ని ఈ సినిమాలో బయటపెట్టే ప్రయత్నం చేశారు. సమంత యాక్షన్‌ సన్నివేశాల్లో అదరగొట్టింది. ట్విస్టు కూడా ఆకట్టుకొంది. తొలి రోజు కూడా మంచి వసూళ్లే వచ్చాయి. అయితే ఆ తరవాత.. ఆ జోరు కనిపించలేదు. ప్రముఖ నటుడు కృష్ణ మరణం కూడా ‘యశోద’కు ప్రతికూలాంశంగా మారింది. కృష్ణ మృతికి సంతాప సూచికగా కొన్ని ప్రాంతాల్లో థియేటర్లు మూసివేశారు. లేకపోతే వసూళ్లు ఇంకాస్త మెరుగ్గా కనిపించేవి. అనారోగ్యం కారణంగా సమంత కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. తను ప్రమోషన్లకు వస్తే.. కాస్త హైప్‌ ఉండేది. 


చిన్న సినిమాలకు మౌత్‌ టాక్‌ చాలా కీలకం. ఎందుకంటే అందులో స్టార్స్‌ ఉండరు. సినిమా బాగుంటేనే జనాలు థియేటర్లకు వెళ్తారు. అలా మౌత్‌ టాక్‌ సంపాదించుకొన్నా... బాక్సాఫీసు దగ్గర బోల్తా పడిన కొన్ని సినిమాలున్నాయి. ‘స్వాతిముత్యం’ అందులో ఒకటి. బెల్లంకొండ గణేశ్‌ని కథానాయకుడిగా పనిచయం చేస్తూ రూపొందించిన చిత్రమిది. వర్ష బొల్లమ్మ కథానాయిక. చక్కటి వినోదాత్మక చిత్రంగా ప్రేక్షకుల మన్నన పొందిన సినిమా ఇది. కాకపోతే.. వసూళ్లు పేలవంగా ఉండడం చిత్రబృందాన్ని, ట్రేడ్‌ వర్గాల్ని సైతం ఆశ్చర్యపరిచింది. టాక్‌ బాగున్నా, పబ్లిసిటీ భారీగా చేసినా.. ప్రేక్షకుల నుంచి స్పందన లేదు. ‘గాడ్‌ ఫాదర్‌’, ‘ది ఘోస్ట్‌’ చిత్రాలతో పోటీగా ‘స్వాతిముత్యం’ విడుదల చేయడం దెబ్బ తీసింది. ఓ వారం ఆగి, విడుదల చేసి ఉంటే, ఫలితం మరోలా ఉండేది. ఓటీటీలో మాత్రం ‘స్వాతిముత్యం’కి ఆదరణ లభిస్తోంది.


ఎన్నాళ్ల నుంచో ఓ విజయం కోసం ఎదురు చూస్తున్నాడు అల్లు శిరీశ్‌. తను కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘ఊర్వశివో.. రాక్షసివో’. అను ఇమ్మాన్యుయేల్‌ నాయిక. ఇటీవలే విడుదలైంది. వినోదం, రొమాన్స్‌.. ఇవన్నీ సమపాళ్లలో మేళవించిన చిత్రమిది. శిరీశ్‌ గత చిత్రాలతో పోలిస్తే.. మంచి టాక్‌ సంపాదించుకొంది. అయితే వసూళ్లు మాత్రం పరమ వీక్‌గా ఉన్నాయి. టాక్‌కీ, కలక్షన్లకీ ఏమాత్రం సంబంధం లేకుండా పోయింది. చిత్రబృందం భారీ పబ్లిసిటీ చేసినా కలసి రాలేదు. విశ్వక్‌సేన్‌ ‘ఓరి దేవుడా’ది కూడా ఇదే పరిస్థితి. ఇదో ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ. వెంకటేశ్‌ సైతం అతిథి పాత్రలో మెరిశారు. ఆ స్టార్‌ డమ్‌ కూడా ఈ సినిమాని కాపాడలేకపోయింది. విశ్వక్‌ నటన, మంచి పాటలు ప్లస్‌ పాయింట్‌గా నిలిచాయి. రివ్యూలు కూడా బాగానే వచ్చాయి. అయితే ఆ ప్రభావం వసూళ్లపై కనిపించలేదు. ఇది వరకు యావరేజ్‌ సినిమానీ జనం చూసేవారు. వాటికీ మంచి వసూళ్లు దక్కేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ‘సినిమా చాలా బాగుంది.. దీన్ని థియేటర్‌లోనే చూడాలి’ అంటేతప్ప.. ప్రేక్షకులు ఇళ్ల నుంచి కదిలి రావడం లేదు. సినిమా ఎలా ఉన్నా, విపరీతంగా మోసే అభిమానులు కూడా బాగా తగ్గిపోయారు. రిపీట్‌ ఆడియన్స్‌ లేనే లేరు. ఓసారి.. థియేటర్‌లో చూస్తే, కావల్సినన్నిసార్లు ఓటీటీలో చూసుకోవచ్చన్న అభిప్రాయానికి వచ్చేశారు. ఆ ప్రభావం వసూళ్లపై పడుతోంది. మరోవైపు.. థియేటర్‌ రిలీజ్‌కీ, ఓటీటీ రిలీజ్‌కీ మధ్య పెద్దగా గ్యాప్‌ ఉండడం లేదు. మూడు వారాలకే ఓటీటీలో సినిమా వచ్చేస్తోంది. అందుకే ‘ఓటీటీలో చూద్దాం లే’ అని ప్రేక్షకులూ లైట్‌ తీసుకొంటున్నారు. అందుకే మంచి సినిమాలకు కూడా వసూళ్లు అంతంతమాత్రంగానే దక్కుతున్నాయన్నది విశ్లేషకుల మాట.

Updated Date - 2022-11-26T05:30:46+05:30 IST

Read more