వెయ్యికోట్ల మైలురాయి దాటిన ఆర్‌ఆర్‌ఆర్‌

ABN , First Publish Date - 2022-04-08T07:33:14+05:30 IST

టాలీవుడ్‌ అంచెలంచెలుగా ఎదుగుతోంది. రూ. 100 కోట్లు, రూ. 200 కోట్లు వసూళ్లు అనేది నిన్నా మొన్నటి మాట. ఇప్పుడు ఏకంగా రూ. 500 కోట్లు, రూ. 1000 కోట్లు అంటూ దూసుకుపోతోంది....

వెయ్యికోట్ల మైలురాయి దాటిన ఆర్‌ఆర్‌ఆర్‌

టాలీవుడ్‌ అంచెలంచెలుగా ఎదుగుతోంది. రూ. 100 కోట్లు, రూ. 200 కోట్లు వసూళ్లు అనేది నిన్నా మొన్నటి మాట. ఇప్పుడు ఏకంగా రూ. 500 కోట్లు, రూ. 1000 కోట్లు అంటూ దూసుకుపోతోంది. మొన్నటి ‘బాహుబలి’ వసూళ్లతో బాలీవుడ్‌ సైతం అవాక్కయింది. చరిత్రలో ఏ భారతీయ సినిమాకు సాధ్యంకాని వసూళ్లను అందుకుంది. ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కూడా అదే బాటలో నడుస్తోంది. మార్చి 25న విడుదలైన ఈ సినిమా రూ. 1000 కోట్ల మైలురాయిని దాటింది. దాదాపు రూ. 500 కోట్ల భారీ వ్యయంతో తెరకెక్కిన చిత్రం ఇది. విదేశాలతో పాటు భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ విడుదలై సంచలన విజయం సాధించింది. ఒక్క నైజాంలోనే రూ. 100 కోట్ల వసూళ్లను అందుకున్న తొలి చిత్రంగా నిలిచింది. దాదాపు అన్ని ఏరియాల్లోనూ వసూళ్ల పరంగా ఆల్‌టైమ్‌ రికార్డ్స్‌ సృష్టించింది. విడుదలై రెండు వారాలు దాటినా బాక్సాఫీసు దగ్గర ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రభంజనం తగ్గలేదు. ఈ చిత్రం ఒక్క హిందీ బెల్ట్‌లోనే రూ. 200 కోట్ల వసూళ్లను రాబట్టినట్టు సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం బుధవారం ముంబైలో సక్సెస్‌మీట్‌ నిర్వహించింది. బాలీవుడ్‌ హీరో ఆమిర్‌ఖాన్‌, దర్శక నిర్మాత కరణ్‌ జోహర్‌, రచయిత జావేద్‌ అక్తర్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. హుమాఖురేషీ, జితేంద్ర, సతీష్‌ కౌశిక్‌, అశుతోష్‌ గోవారికర్‌, నిర్మాత డి.వి.వి. దానయ్య తదితరులు హాజరయ్యారు. పెన్‌ స్టూడియోస్‌ అధినేత జయంతిలాల్‌ ఈ కార్యక్రమంలో రాజమౌళి, తారక్‌, చరణ్‌ను సత్కరించారు. ముగ్గురూ కేక్‌ కోసి సినిమా విజయాన్ని ఘనంగా సెలబ్రేట్‌ చేశారు.  


అమెరికా ప్రేక్షకులూ ఆదరిస్తున్నారు

అమెరికా లాంటి అగ్రదేశం నుంచి కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి ప్రశంసలు వస్తాయని ఊహించలేదు. న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి అతి పెద్ద మీడియా ఈ సినిమా గురించి ప్రముఖంగా ప్రచురించడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. ఏ సినిమాకైనా వసూళ్లతో పాటు ప్రేక్షకుల ప్రశంసలూ ముఖ్యమే. అవి రెండూ ఈ చిత్రానికి దక్కడం ఆనందంగా ఉంది.

రాజమౌళి


Updated Date - 2022-04-08T07:33:14+05:30 IST