Rangamarthanda: ‘నేనొక నటుడ్ని.. షాయరీ’.. ఏడిపించేసిన చిరు

ABN , First Publish Date - 2022-12-21T17:38:10+05:30 IST

‘రంగమార్తాండ’ (Rangamarthanda) సినిమాలోని ఫస్ట్ సింగల్ (షాయరీ) నేనొక నటుడ్ని (Nenoka Natudni) విడుదలయ్యింది. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తనదైన శైలిలో చెప్పిన ఈ షాయరీ..

Rangamarthanda: ‘నేనొక నటుడ్ని.. షాయరీ’.. ఏడిపించేసిన చిరు
Chiranjeevi and Krishna Vamsi

‘రంగమార్తాండ’ (Rangamarthanda) సినిమాలోని ఫస్ట్ సింగల్ (షాయరీ) నేనొక నటుడ్ని (Nenoka Natudni) విడుదలయ్యింది. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తనదైన శైలిలో చెప్పిన ఈ షాయరీ (Shayari)‌తో నటుడనేవాడికే కాకుండా.. వినేవాడికి కూడా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయంటే అతిశయోక్తి కానే కాదు. రచయిత లక్ష్మీ భూపాల (Lakshmi Bhupala) రచన.. మాస్ట్రో ఇళయరాజా (Maestro Ilayaraja) నేపథ్య సంగీతంతో ఈ షాయరీ ప్రతి ఒక్కరినీ కదిలించేదిగా ఉంది. ఈ షాయరీ వినే ప్రతి నటుడు తన కోసమే రాశారని భావించేలా లక్ష్మీ భూపాల ఎంతో అర్థవంతంగా రాశారు. మెగాస్టార్ అద్భుతంగా తన గొంతులో నవరసాలు పలికించి ఈ షాయరీకి ప్రాణం పోశారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamsi) ఈ ‘రంగమార్తాండ’ సినిమాని ఒక తపస్సులా పూర్తి చేశారనేదానికి ఈ షాయరీ అద్దం పడుతోంది.

రంగస్థల కళాకారుల జీవితాల చుట్టూ అల్లిన ఈ కథలో ప్రకాష్ రాజ్ (Prakash Raj), బ్రహ్మానందం (Brahmanandam), రమ్యకృష్ణ (Ramya Krishna), రాహుల్ సిప్లిగంజ్, శివాని రాజశేఖర్, ఆదర్శ్ బాలకృష్ణ, అలీ రెజా, అనసూయ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

చిరు కంఠంలో షాయరీ సాగిందిలా..

నేనొక నటుడ్ని..

చమ్కీల బట్టలేసుకుని,

అట్ట కిరీటం పెట్టుకుని,

చెక్క కత్తి పట్టుకుని,

కాగితం పూల వర్షంలో,

కీలుగుర్రంపై స్వారీ చేసే

చక్రవర్తిని నేను..

కాలాన్ని బంధించి శాసించే

నియంతని నేను...

నేనొక నటుడ్ని..

నాదికాని జీవితాలకు

జీవం పోసే నటుడ్ని..

నేనుకాని పాత్రల కోసం

వెతికే విటుడ్ని..

వేషం కడితే అన్నీ మతాల దేవుడ్ని,

వేషం తీస్తే ఎవరికి కానీ జీవుడ్ని..

నేనొక నటుడ్ని..

నవ్విస్తాను,ఏడ్పిస్తాను,

ఆలోచనల సంద్రంలో ముంచేస్తాను,

హరివిల్లుకి ఇంకో రెండు రంగులేసి

నవరసాలు మీకిస్తాను,

నేను మాత్రం, నలుపు తెలుపుల

గందరగోళంలో బ్రతుకుతుంటాను

నేనొక నటుడ్ని..

జగానికి జన్మిస్తాను,

సగానికి జీవిస్తాను,

యుగాలకి మరణిస్తాను,

పోయినా బ్రతికుంటాను..

నేనొక నటుడ్ని..

లేనిది ఉన్నట్టు చూపే కనికట్టుగాన్ని,

ఉన్నది లేనట్టు చేసే టక్కుటమారపోడ్ని..

ఉన్నదంతా నేనే అనుకునే అహంబ్రహ్మస్మిని..

అసలు ఉన్నానో లేనో తెలియని ఆఖరి మనిషిని ..

నేనొక నటుడ్ని..

గతానికి వారధి నేను..

వర్తమాన సారధి నేను..

రాబోయే కాలంలో

రాయబోయే చరిత్ర నేను..

పూట పూటకీ రూపం మార్చుకొనే

అరుదైన జీవిని నేను.

నేనొక నటుడ్ని..

పిడుగుల కంఠాన్ని నేను,

అడుగుల సింహాన్ని నేను,

నరం నరం నాట్యమాడే

నటరాజ రూపాన్ని నేను,

ప్రపంచ రంగస్థలంలో,

పిడికెడు మట్టిని నేను,

ప్రచండంగా ప్రకాశించు,

రంగమార్తాండుడ్ని నేను,

నేనొక నటుడ్ని..

అసలు ముఖం పోగొట్టుకున్న

అమాయకుడ్ని..

కానీ తొమ్మిది తలలున్న

నట రావణున్ని..

నింగి నేలారెండడుగులైతే

మూడోపాదం మీ మనసులపై

మోపే వామనున్ని..

మీ అంచనాలు దాటే ఆజానుబాహుడ్ని,

సంచలనాలు సృష్టించే మరో కొత్త దేవుడ్ని.

నేనొక నటుడ్ని..

అప్సరసల ఇంద్రుడ్ని,

అందుబాటు చంద్రున్ని,

అభిమానుల దాసుడ్ని,

అందరికీ ఆప్తుడ్ని..

చప్పట్లను భోంచేస్తూ,

ఈలల్నే శ్వాసిస్తూ,

అనుక్షణం జీవించే,

అల్పసంతోషిని నేను..

మహా అదృష్టవంతుడ్ని నేను..

తీర్చలేని రుణమేదో

తీర్చాలని పరి తపించే

సగటు కళాకారుడ్ని నేను..

ఆఖరి శ్వాస వరకూ

నటనే ఆశ నాకు

నటుడిగా నన్నిష్టపడ్డందుకు..

శతకోటి నమస్సులు మీకు...

Updated Date - 2022-12-21T18:24:09+05:30 IST

Read more