‘భీమ్లానాయక్’ సక్సెస్‌ క్రెడిట్‌ ఎవరికి ఎంత అంటే?: రానా

ABN , First Publish Date - 2022-03-03T03:25:46+05:30 IST

ఇద్దరు హీరోలు తెరపై కనిపిస్తే.. ఒకడు మంచోడు.. మరొకడు తాగుబోతు అయితే.. చెడ్డవాడే నచ్చుతాడు. ఇక్కడా అదే జరిగి ఉంటుంది. ఇందులో డామినేటింగ్‌ ఏమీలేదు. డ్యాని పాత్ర కోసం నేను పెద్దగా కసరత్తులు ఏమీ చేయలేదు. డ్యాని ఎలా

‘భీమ్లానాయక్’ సక్సెస్‌ క్రెడిట్‌ ఎవరికి ఎంత అంటే?: రానా

పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో సాగర్‌. కె చంద్ర దర్శకత్వం వహించిన చిత్రం ‘భీమ్లానాయక్‌’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ మాటలు, స్ర్కీన్‌ప్లే అందించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ చిత్రంలో డ్యానియేల్‌ శేఖర్‌ పాత్రలో నటించిన రానా దగ్గుబాటి.. బుధవారం మీడియాకు ఈ చిత్ర విశేషాలను తెలియజేశారు. 


ఆయన మాట్లాడుతూ..

‘‘సినిమా వాతావరణంలో పుట్టిన నాకు ఏం చేసినా కొత్తగా ఉండాలని ఉంటుంది. అందరిలా ఉండకూడదు అనేది నా తత్వం. తెర మీద కొత్తదనం చూడటానికే నేను థియేటర్‌కి వెళ్తాను. థియేటర్‌లో కొత్తగా చూసింది.. అంతకంటే కొత్తగా నేను చేయాలనుకుంటా. ఇప్పటి వరకూ అదే దారితో వెళ్తున్నా. ‘భీమ్లానాయక్’ కథ విన్న తర్వాత నా జోన్‌ సినిమా అనిపించింది. అయితే సినిమా చేసిన తర్వాత ఇంతకుమించి ముందుకు వెళ్లాలి అనిపించింది. నేను ఎప్పుడూ సెలెక్టివ్‌గా ఉంటాను.. సాహసాలు కూడా చేస్తాను. అయితే ‘భీమ్లానాయక్‌’ చేశాక హీరోయిజం అంటే ఏంటో తెలిసింది. ఒక సినిమాను రీమేక్‌ చేయాలంటే దాని వెనుక చాలా కష్టం ఉంటుంది. దాని మీద నాకూ అవగాహన ఉంది. ఎందుకంటే మా చిన్నాన్న వెంకటేశ్‌ చాలా రీమేక్‌లు చేశారు. మార్పుల చర్చలు ఎలా ఉంటాయో బాబాయ్‌ దగ్గర వినేవాడిని. ఈ సినిమా విషయంలో మాత్రం త్రివిక్రమ్‌‌గారు చాలా కష్టపడ్డారు. ఒరిజినల్‌ ఫ్లేవర్‌ను చెడగొట్టకుండా ఉన్న కథని మన వాళ్లకు నచ్చేలా ఎలా తీయాలో అలా చేశారు. ఆ విషయంలో ఈ సినిమాకు త్రివిక్రమ్‌గారు వెన్నెముక అనే చెప్పాలి. కొన్ని సన్నివేశాలు ఒరిజినల్‌ను మరచిపోయేలా రాశారు. దానికి తగ్గట్టే సాగర్‌ తెరకెక్కించారు. 


ఇద్దరు హీరోలు తెరపై కనిపిస్తే.. ఒకడు మంచోడు.. మరొకడు తాగుబోతు అయితే.. చెడ్డవాడే నచ్చుతాడు. ఇక్కడా అదే జరిగి ఉంటుంది. ఇందులో డామినేటింగ్‌ ఏమీలేదు. డ్యాని పాత్ర కోసం నేను పెద్దగా కసరత్తులు ఏమీ చేయలేదు. డ్యాని ఎలా ఉండాలో అలాగే ఉన్నా. పవన్‌కల్యాణ్‌గారు కూడా అంతే! సింపుల్‌గా ఆ పాత్ర ఎలా ఉంటుందో అలాగే సెట్‌‌లో ఉండేవారు. దర్శకుడు సాగర్‌ చాలా స్ట్రెయిట్‌ ఫార్వర్డ్‌ పర్సన్‌. అతన్ని చూస్తే జెలసీ ఉంటుంది. ఒకేసారి పవన్‌కల్యాణ్‌లాంటి స్టార్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో పని చేసే అవకాశం అతనికి వచ్చింది. ఈ సినిమా సక్సెస్‌ క్రెడిట్‌లో ఎవరికి ఎంత అంటే చెప్పలేం. దర్శకుడిగా సాగర్‌ చేయాల్సింది చేశాడు. మాటలు, స్ర్కీన్‌ప్లే రైటర్‌గా త్రివిక్రమ్‌గారు చేసేది చేశారు. టీమ్‌ అందరి కృషితోనే మేం ఈ సక్సెస్‌ సాధించాం. ఈ సినిమా విడుదల లేట్‌ అయింది కానీ.. మొదటి నుంచి అన్నీబాగా కుదిరాయి. పాటల విడుదల నుంచి సినిమాకు ఎలాంటి బజ్‌ వచ్చిందో తెలిసిందే.


డ్యాని పాత్ర చూసి నాన్న చాలా సంతృప్తి చెందారు. ఆయన అలా చెప్పడం చాలా అరుదుగా జరుగుతుంది. ‘బాహుబలి’ తర్వాత మళ్లీ ఈ సినిమాకే చాలా గొప్పగా చెప్పారు. ఏదో ఒక రోజు పాటలు, ఫైటులు లేకుండా టాకీతోనే సినిమా తీసి హిట్‌ కొడతా అని మా నాన్నతో చెబుతుంటా. అలాంటి ప్రయత్నం చేస్తా. ‘ఇతర ఇండస్ట్రీల్లో కథల్ని చెబుతారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఫిల్మ్‌ మేకింగ్‌ చెబుతుందని ‘వకీల్‌సాబ్‌’ రిలీజ్‌ టైమ్‌లో ఓ డిస్ట్రిబ్యూటర్‌ నాకు చెప్పారు. అప్పుడే నాకు ఈ విషయాలన్నింటి మీద ఓ అవగాహన వచ్చింది. ఇకపై అవుట్‌ అండ్‌ అవుట్‌ కమర్షియల్‌ సినిమాలు చేస్తాను. సోషల్‌ మీడియాలో దాని గురించే చర్చ నడుస్తోంది. అలాంటి చిత్రాలు చేయాలని నాకూ ఇప్పుడే తెలిసింది..’’ అని తెలిపారు.

Updated Date - 2022-03-03T03:25:46+05:30 IST