మన చరిత్ర చెప్పే చిత్రం పొన్నియన్‌ సెల్వన్‌

ABN , First Publish Date - 2022-09-24T06:12:17+05:30 IST

మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం ‘పొన్నియన్‌ సెల్వన్‌’. తొలి భాగం ఈనెల 30న విడుదల అవుతోంది...

మన చరిత్ర చెప్పే చిత్రం పొన్నియన్‌ సెల్వన్‌

మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం ‘పొన్నియన్‌ సెల్వన్‌’. తొలి భాగం ఈనెల 30న విడుదల అవుతోంది. విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్‌, త్రిష ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగులో ఈ చిత్రాన్ని దిల్‌రాజు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. సంగీత దర్శకుడు ఏ.ఆర్‌.రెహమాన్‌ మాట్లాడుతూ ‘‘ముఫ్ఫై ఎనిమిదేళ్ల క్రితం తెలుగు చిత్రసీమలో నా సంగీత ప్రయాణాన్ని ప్రారంభించాను. నన్ను ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు. ‘పొన్నియన్‌ సెల్వన్‌’లో మన సంస్ర్కృతి ఉంది, మన విలువలు ఉన్నాయి, మన రక్తం ఉంద’’న్నారు. కార్తి మాట్లాడుతూ ‘‘కులమత బేధాలు మర్చిపోయేలా చేసే మాధ్యమం సినిమా. మణిరత్నం గారి నలభై ఏళ్ల కల ‘పొన్నియన్‌ సెల్వన్‌’. ‘ఇది బాహుబలి సినిమాలా ఉంటుందా?’ అని చాలామంది అడుతున్నారు. మనం ‘బాహుబలి’ చూసేశాం. ఇంకో ‘బాహుబలి’ అవసరం లేదు. మన చరిత్రలో ఎన్నో కథలు ఉన్నాయి. అవన్నీ చెప్పాలి. అందులో భాగంగా తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమాలో రొమాన్స్‌ ఉంది. సాహస యాత్ర ఉంది. రామాయణ, మహాభారతంలో ఉండే గొప్ప పాత్రలు ఈ సినిమాలో ఉన్నాయ’’న్నారు. విక్రమ్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో గుర్రంపై ఒక షాట్‌ ఉంది. ఈ సినిమా వరకూ నాకు అది చాలు. ఈ సినిమాలో నటించిన వాళ్లంతా హీరోలే. అందరూ హీరోయిన్లే.  ప్రతి పాత్రనీ అంత శక్తిమంతంగా తీర్చిదిద్దార’’న్నారు. మణిరత్నం అనే ఒకే ఒక్క వ్యక్తి వల్ల ఈ అద్భుతం సాధ్యమైందన్నారు ‘జయం’ రవి. ఈ రోజుల్లో ఒక హీరోతో ఒక సినిమా చేయాలంటేనే నిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నాయని, ఇంతమంది హీరోలను ఒకే తెరపై తీసుకొచ్చి ఓ కవిత్వంలా ఈ చిత్రాన్ని మణిరత్నం తీర్చిదిద్దారన్నారు దిల్‌ రాజు. ‘‘మణిసార్‌ వెండి తెరపై ఓ పెయింటింగ్‌ సృష్టించారు. ఆయన కలలో మేమంతా భాగం కావడం చాలా సంతోషంగా ఉంద’’న్నారు ఐశ్వర్యరాయ్‌. ‘‘తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ నన్ను సొంత బిడ్డలానే ఆదరించారు. ఈ సినిమా కూడా వాళ్లందరికీ నచ్చుతుంద’’ని త్రిష తెలిపారు. ‘‘నలభై రెండేళ్లుగా నాపై ఎనలేని ప్రేమ చూపించారు తెలుగు ప్రేక్షకులు. ఆ ప్రేమనంతా ఈ సినిమాపై చూపించండి. అంతకంటే ఇంకేం అడగను. నా పెళ్లికి ముందు మణిరత్నం గారు పొన్నియన్‌ సెల్వన్‌ నవలలు బహుమతిగా ఇచ్చారు. ‘అవన్నీ చదివి సింగిల్‌ లైన్‌ రాసి ఇవ్వు’ అన్నారు. రాసిస్తే ఆయనకు నచ్చలేదు. ‘ఇదేనా సింగిల్‌ లైన్‌ అంటే’ అని అడిగారు. మా పెళ్లి ఆగిపోతుందేమో అనుకొన్నా. కానీ మా పెళ్లీ జరిగింది. ఇప్పుడు ఆ నవల సినిమాగానూ వస్తోంద’’న్నారు సుహాసిని. 


Updated Date - 2022-09-24T06:12:17+05:30 IST