పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీలో సినిమాలు చేస్తూనే ఉంటా

ABN , First Publish Date - 2022-12-19T02:30:26+05:30 IST

రవితేజ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ధమాకా’. శ్రీలీల నాయిక. విశ్వ ప్రసాద్‌ నిర్మాత. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించారు...

పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీలో సినిమాలు చేస్తూనే ఉంటా

రవితేజ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ధమాకా’. శ్రీలీల నాయిక. విశ్వ ప్రసాద్‌ నిర్మాత. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించారు. ఈనెల 23న విడుదల అవుతోంది. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ ‘‘ప్రసన్న మంచి కథ అందించాడు. తన హ్యూమర్‌ నాకు బాగా నచ్చుతుంది. తను దర్శకుడిగానూ మంచి విజయాన్ని అందుకోవాలి. శ్రీలీల రెండో సినిమాకే పాపులర్‌ అయిపోయింది. అందం, ప్రతిభ.. అన్నీ తనలో ఉన్నాయి. వచ్చే యేడాది మరో స్థాయికి వెళ్తుంది. భీమ్స్‌ పాటలు ఇరగదీశాడు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ.. నిజంగానే ఫ్యాక్టరీ లాంటిది. ఈ సంస్థలో సినిమాలు చేస్తూనే ఉంటా’’ అన్నారు. ‘‘నేను రవితేజ అభిమానిని. రవితేజ ఏం చేస్తే.. అభిమానులకు నచ్చుతుందో నాకు తెలుసు. ఈ సినిమా బంపర్‌ హిట్‌ కొట్టడం ఖాయం’’ అన్నారు దర్శకుడు. నిర్మాత మాట్లాడుతూ ‘‘రవితేజలానే మా పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ కూడా ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా ఎదిగింది. మా సంస్థలో వస్తున్న అతి పెద్ద కమర్షియల్‌ సినిమా ఇదే’’ అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘నా అల్లరి ప్రియుడులో రవితేజ నటించాడు. అప్పుడే అనుకొన్నా.. తను పెద్ద హీరో అవుతాడని. ‘పెళ్లి సందడి’తో శ్రీలీల ఓ ప్రభంజనం సృష్టించింది. వీరిద్దరి కాంబోలో వస్తున్న ‘ధమాకా’ మంచి విజయాన్ని అందుకోవాల’’ని ఆకాంక్షించారు. ‘‘పెళ్లి సందడి విడుదల అవ్వకముందే ఈ సినిమా ఒప్పుకొన్నా. నాపై నమ్మకం పెట్టుకొన్న దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు’’ అంది శ్రీలీల.

Updated Date - 2022-12-19T02:30:35+05:30 IST