టికెట్‌కి ఒక రూపాయి.. రైతుల కోసం!

ABN , First Publish Date - 2022-11-15T06:00:25+05:30 IST

‘‘నా ప్రతీ సినిమాలానే.. ‘లాఠీ’ చిత్రానికి ఎన్ని టికెట్లు తెగుతాయో.. ఒక్కో టికెట్‌కీ ఒక్కో రూపాయి చొప్పున రైతుల సంక్షేమానికి అందిస్తా’’ అన్నారు విశాల్‌...

టికెట్‌కి ఒక రూపాయి.. రైతుల కోసం!

‘‘నా ప్రతీ సినిమాలానే.. ‘లాఠీ’ చిత్రానికి ఎన్ని టికెట్లు తెగుతాయో.. ఒక్కో టికెట్‌కీ ఒక్కో రూపాయి చొప్పున రైతుల సంక్షేమానికి అందిస్తా’’ అన్నారు విశాల్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘లాఠీ’. సునయన కథానాయిక. వినోద్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. డిసెంబరు 22న విడుదల అవుతోంది. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ‘లాఠీ’ టీజర్‌ ఆవిష్కరించారు. విశాల్‌ మాట్లాడుతూ ‘‘అభిరుచితో చేసిన సినిమా ఇది. చాలా కష్టపడ్డాం. యువన్‌ ఇప్పటి వరకూ నాకు చాలా మంచి ఆల్బమ్స్‌ అందించాడు. ఈ సినిమాలో యువన్‌ ఇచ్చిన నేపథ్య సంగీతం సినిమాని మరో స్థాయికి తీసుకెళ్తుంది. నా పెళ్లి గురించి అందరూ అడుగుతున్నారు. నడిగర్‌ సంఘం కోసం భవనం కట్టిన తరవాతే పెళ్లి చేసుకొంటా’’ అన్నారు. విజయేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘సినిమా కోసం ఎంత బడ్జెట్‌ అయినా ఖర్చు పెట్టించి, ఎన్ని రోజులైనా షూటింగ్‌ చేసే జబ్బు విశాల్‌కి ఉంది. రాజమౌళి నుంచే ఈ జబ్బు అంటుకొందేమో..? రాజమౌళిలా విశాల్‌ కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించాల’’ని ఆకాంక్షించారు. ‘‘ఇదో సాధారణ కానిస్టేబుల్‌ గురించీ, అతని సాహసాల గురించీ చెప్పే కథ. విశాల్‌ ఈ చిత్రానికి మూల స్థంభం. యాక్షన్‌ ప్యాకేజిలా ఈ సినిమా ఉండబోతోంద’’న్నారు దర్శకుడు. ‘‘లాక్‌ డౌన్‌ సమయంలో ఈ కథ విన్నాం. విశాల్‌ అయితే బాగుంటుందనిపించింది. ఆయన కూడా కథ విని వెంటనే చేస్తానన్నారు. ఆ సమయంలో మా దగ్గర కేవలం రెండు లక్షలు మాత్రమే ఉన్నాయి. విశాల్‌ అందించిన ధైర్యంతో ఈ సినిమా తీశామ’’ని నిర్మాతలు రమణ, నంద తెలిపారు. 


Updated Date - 2022-11-15T06:00:25+05:30 IST

Read more