ఈసారి అల్లుడే విందు భోజనం వడ్డిస్తాడు

ABN , First Publish Date - 2022-06-04T05:47:18+05:30 IST

నాని కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అంటే.. సుందరానికీ’. నజ్రియా కథానాయిక.

ఈసారి అల్లుడే విందు భోజనం వడ్డిస్తాడు

నాని కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అంటే.. సుందరానికీ’. నజ్రియా కథానాయిక. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీస్‌ నిర్మించింది. ఈనెల 10న విడుదల కానుంది. గురువారం విశాఖపట్నంలో ట్రైలర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ‘‘మా అత్తగారిది వైజాగ్‌. అంటే నేను విశాఖ అల్లుడిని. ఇంటికి అల్లుడు వచ్చినప్పుడు విందు భోజనం పెడతారు. ఈసారి జూన్‌ 10న అల్లుడే విందు భోజనం వడ్డించబోతున్నాడు. సాధారణంగా ఓ సినిమా తీసి.. ‘మంచి సినిమా ఇది.. దీన్ని బ్లాక్‌బ్లస్టర్‌ చేయాలి’ అని చెబుతుంటాం. మేం బ్లాక్‌బ్లస్టర్‌ తీశాం... దీన్ని ఏ స్థాయికి తీసుకెళ్తారో ప్రేక్షకుల ఇష్టం. ఈ సినిమా చాలా అందంగా ఉంటుంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారు. విశాఖలోని సముద్రంలో అలలకు అలుపుండదు. మా సినిమాలోనూ అంతే. నవ్వులు, భావోద్వేగాలు.. అలల్లా.. వస్తూనే ఉంటాయి. ఈ సినిమాని ప్రేక్షకులతో పాటు చూడాలని నేనూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అన్నారు. నజ్రియా మాట్లాడుతూ ‘‘ఇది నా తొలి తెలుగు చిత్రం. తొలి ప్రయత్నంలోనే నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పుకోవడం ఆనందాన్ని అందించింది. ప్రతీరోజూ షూటింగ్‌ని ఆస్వాదించాను. మైత్రీ మూవీస్‌ లేకపోతే, ఈ ప్రయాణం ఇంత బాగా జరిగి ఉండేది కాదు. నాని మంచి కో-స్టార్‌. తన వల్ల సెట్లో మరింత సరదాగా గడిచిపోయింద’’న్నారు. నిర్మాతల్లో ఒకరైన వై.రవిశంకర్‌ మాట్లాడుతూ ‘‘జెర్సీతో నానిపై గౌరవం పెరిగింది. ఈ సినిమాతో అది రెట్టింపు అయ్యింది. సుందరం పాత్రలో.. నాని విశ్వరూపం చూడబోతున్నారు. నజ్రియా నటన ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. ఆమె భర్త ఫహద్‌ ఫాజిల్‌ని ‘పుష్ప’తో తెలుగులో మేమే పరిచయం చేశాం. ఇప్పుడు నజ్రియా తొలి తెలుగు సినిమా  కూడా మా సంస్థ ద్వారానే అవ్వడం ఇంకా ఆనందంగా ఉంద’’న్నారు. 

Updated Date - 2022-06-04T05:47:18+05:30 IST

Read more