‘ఫస్ట్‌ డే.. ఫస్ట్‌ షో’ చూడాల్సిందే!

ABN , First Publish Date - 2022-05-17T05:50:22+05:30 IST

‘స్వాతిముత్యం’, ‘సితార’, ‘సాగర సంగమం’, ‘సీతాకోక చిలుక..’ ఇలా ఒకటా, రెండా? పూర్ణోదయ మూవీ క్రియేషన్స్‌ నుంచి ఎన్నో కళాత్మక చిత్రాలొచ్చాయి...

‘ఫస్ట్‌ డే.. ఫస్ట్‌ షో’ చూడాల్సిందే!

‘స్వాతిముత్యం’, ‘సితార’, ‘సాగర సంగమం’, ‘సీతాకోక చిలుక..’ ఇలా ఒకటా, రెండా? పూర్ణోదయ మూవీ క్రియేషన్స్‌ నుంచి ఎన్నో కళాత్మక చిత్రాలొచ్చాయి. పూర్ణోదయ సినిమా అంటే.. అవార్డుల పంట అనే నమ్మకం ఆరోజుల్లో ఉండేది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఏడిద నాగేశ్వరరావు మనవరాలు ఏడిద శ్రీజ నిర్మాతగా మారి, శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నెలకొల్పారు. ఈ బ్యానర్‌లో తెరకెక్కించిన చిత్రానికి ‘ఫస్ట్‌ డే... ఫస్ట్‌ షో’ అనే పేరు ఖరారు చేశారు. వంశీ-లక్ష్మీనారాయణ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా లోగోని సోమవారం హైదరాబాద్‌లో నాగ అశ్విన్‌ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ‘‘పూర్ణోదయ లాంటి గొప్ప నిర్మాణ సంస్థ మళ్లీ సినిమాలు తీయాలనుకోవడం ఆనందంగా ఉంది. ‘శంకరాభరణం’, ‘స్వాతిముత్యం’లాంటి క్లాసిక్‌ చిత్రాలు ఈ సంస్థ నుంచి వచ్చాయి. ‘ఆపద్భాంధవుడు’ సినిమా అంటే చాలా ఇష్టం. అయితే ఆ సినిమా ఎందుకు ఫ్లాపయ్యిందో తెలిసేది కాదు. ఇంత పెద్ద సంస్థలో నాకు అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. ‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్‌ ఈ చిత్రానికి కథ అందించాడు. వంశీ ఈ కథని లైన్‌గా చెప్పాడు. రెండు నిమిషాలు చెబితేనే బాగా నవ్వుకున్నాను. రెండు గంటల పాటు ఇంకా నవ్విస్తారన్న నమ్మకం కలిగింద’’న్నారు. నిర్మాత శ్రీజ మాట్లాడుతూ ‘‘మా తాతగారి సినిమాలు చూస్తూ పెరిగాం. ఆ ఖ్యాతిని కాపాడుతూ సినిమాలు తీస్తాం’’ అన్నారు. ‘‘చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయ’’ని అనుదీప్‌ తెలిపారు. శ్రీకాంత్‌ రెడ్డి, సంచిత బాసు, భరణి, వెన్నెల కిషోర్‌ తదితరులు నటించారు. సంగీతం: రథన్‌, సమర్పణ: ఏడిద శ్రీరామ్‌. 


Updated Date - 2022-05-17T05:50:22+05:30 IST

Read more