Saachi: మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్లాప్‌తో ప్రారంభం

ABN , First Publish Date - 2022-06-04T22:15:26+05:30 IST

సత్యానంద్ స్టార్ మేకర్స్ (Satyanand Star Makers) సమర్పణలో.. విధాత ప్రొడక్షన్స్ (Vidhatha Productions) పతాకంపై సంజన (Sanjana), మూలవిరాట్ అశోక్ రెడ్డి (Mulavirat Ashok Reddy) నటీనటులుగా.. వివేక్ పోతగోని (Vivek Pothagoni) దర్శకత్వంలో ఉపేన్ నడిపల్లి..

Saachi: మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్లాప్‌తో ప్రారంభం

సత్యానంద్ స్టార్ మేకర్స్ (Satyanand Star Makers) సమర్పణలో.. విధాత  ప్రొడక్షన్స్ (Vidhatha Productions) పతాకంపై సంజన (Sanjana), మూలవిరాట్ అశోక్ రెడ్డి (Mulavirat Ashok Reddy) నటీనటులుగా.. వివేక్ పోతగోని (Vivek Pothagoni) దర్శకత్వంలో ఉపేన్ నడిపల్లి నిర్మిస్తున్న చిత్రం ‘సాచి’ (Saachi). యదార్థ సంఘటనల ఆధారంగా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో తెరకెక్కనున్న ఈ  చిత్రం తాజాగా హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas goud) ఆర్టిస్ట్ బిందు(Bindhu)పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా.. సత్యానంద్ (Satyanand) మాస్టర్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాత రామ్ మెహన్ రావు (Ram Mohan Rao) తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. 


అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్  మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి నిజజీవిత సంఘటనల ఆధారంగా తీసుకొని ఈ సినిమా తీస్తున్నారని తెలిసింది. దర్శకుడు వివేక్ పోతగోని అమెరికాలో స్థిరపడ్డా.. తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది అని తెలుసుకుంటూ.. తన తండ్రి కోరిక మేరకు తెలుగులో దర్శకుడు అవుతున్నారు. అమెరికాలో కొన్ని షార్ట్ ఫిలింస్ తీస్తూ.. జన్మనిచ్చిన గడ్డపైన సినిమా తీయాలని నిజ జీవితానికి దగ్గరగా ఉన్నటువంటి ‘సాచి’ కథను ఎంపిక చేసుకోవడం, ఈ కథతో ప్రజలను చైతన్యవంతులను చేయాలనే ప్రయత్నం చాలా మంచిది. మంచి కాన్సెప్ట్‌తో తీస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. ఇలాంటి సినిమాలు భావితరానికి చాలా అవసరం’’ అని అన్నారు.


దర్శకుడు వివేక్ పోతగోని మాట్లాడుతూ.. ‘‘మంత్రులు శ్రీనివాస్ గౌడ్‌గారితో పాటు మా సినిమా ప్రారంభోత్సవానికి వచ్చి, ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నేను అమెరికాలో స్థిరపడ్డా.. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన  కొన్ని యదార్థ  సంఘటనల ఆధారంగా  సినిమా  తీయాలనుకున్న సమయంలో..  తెలంగాణలోని ఖమ్మంలో జరిగిన కథ  విన్నాను. మంగలి వృత్తి చేస్తూ  జీవనం సాగించే ఒక నిరుపేద కుటుంబ యజమాని..  బ్రెయిన్ ట్యూమర్ బారినపడితే, అతని చికిత్స కొరకు వారి ఆస్తులను అమ్ముకొని రోడ్డున పడడంతో.. తండ్రి చేసే మంగలి వృత్తిని కూతురు స్వీకరించి, చదువుకుంటూ ఎన్నో అవమానాలు, అవహేళనలను ఎదుర్కొని.. ఆ కుటుంబాన్ని ఎలా పోషించింది అనేదే ఈ కథ సారాంశం. ఆ అమ్మాయి ధైర్యానికి మెచ్చుకొని మేము వారి కుటుంబానికి అండగా  నిలబడాలని  కొంత నగదుతో  సహాయం చేయడం జరిగింది. ఇందులో చాలా మంది కొత్తవారికి నటించే అవకాశం ఇవ్వడం జరిగింది. మంచి కాన్సెప్ట్‌తో తీస్తున్న ఈ సినిమాకు అందరి ఆశీర్వాదాలు కావాలి..’’ అని అన్నారు. వివేక్ చెప్పిన కథ నచ్చడంతో అతనితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నానని నిర్మాత ఉపేన్ తెలిపారు.

Updated Date - 2022-06-04T22:15:26+05:30 IST