Okkadu 4K : సరిగ్గా ఆరోజే విడుదల !
ABN , First Publish Date - 2022-09-05T17:52:41+05:30 IST
mahesh babu starer okkadu 4K will be releasing on january 8 2023

ఒకప్పటి బ్లాక్ బస్టర్ మూవీస్‌ను .. హైరిజల్యూషన్ క్వాలిటీతో మార్పులు చేసి రీరిలీజ్ చేసే ట్రెండ్ టాలీవుడ్‌లో ఊపందుకుంది. మహేశ్ (Mahesh) పుట్టినరోజున ‘పోకిరి’ (Pokiri) చిత్రాన్ని 4K గా విడుదల చేస్తే దాదాపు రూ. 1.5 కోట్లు కలెక్ట్ చేసి ఆశ్చర్యపరిచింది. అలాగే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బర్త్ డే నాడు జల్సాను కూడా విడుదల చేయగా.. ఎవరూ ఊహించని రీతిలో ఏకంగా రూ. 3కోట్లకు పైగానే వసూళ్ళను రాబట్టి.. రికార్డు క్రియేట్ చేసింది. అన్ని షోలూ హౌస్ ఫుల్లే. అంతటా అభిమానుల సందడే.
ఇదేదో బాగుందని మనవాళ్ళు అనుకుంటున్నట్టున్నారు. ప్రభాస్ (Prabhas) పుట్టినరోజున బిల్లా 4K వదలాలని అభిమానులు డిసైడయిపోయారు. ప్రభాస్ స్టైలిష్ పెర్ఫార్మెన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ అప్పట్లో బాగా ఆకట్టుకున్నాయి. అందుకే ఆ సినిమా అంతగా ఆడకపోయినా.. 4K రిజల్యూషన్‌లో ఇప్పుడు మరోసారి చూడాలని తహతహలాడుతున్నారు అభిమానులు. ఇంకా సూపర్ స్టార్ కృష్ణ (Krishna) సింహాసనం (Simhasanam) చిత్రాన్ని కూడా రీరిలీజ్ చేయబోతున్నారు. అయితే ఆ సినిమాను మాత్రం 8Kలో విడుదల చేయబోతున్నారు.
ఇక మరోసారి మహేశ్ బాబు వంతు వచ్చింది. మహేశ్‌కు తొలిసారిగా స్టార్ డమ్ ను తెచ్చిపెట్టిన సినిమా ఒక్కడు (Okkadu). గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వంలో, యయస్ రాజు (MS Raju) నిర్మాణంలో 2003, జనవరి 8న సంక్రాంతి కానుకగా విడుదలై.. బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అప్పట్లో ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. భూమిక (Bhumika) కథానాయికగా, ప్రకాశ్ రాజ్ (Prakash Raj) విలన్ గా నటించిన ఈ సినిమాకి మణిశర్మ (Manisharma) అద్భుతమైన సంగీతం అందించారు. వచ్చే ఏడాది జనవరి 8కి ఒక్కడు సినిమా విడుదలై సరిగ్గా 20 ఏళ్ళవుతుంది. ఆ సందర్భంగా.. అదే డేట్లో ఈ సినిమాను 4K లో విడుదల చేయబోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఆ సీజన్ లో కొత్త సినిమాల హడావిడి ఉంటుంది. అయినా సరే ఒక్కడు వెనకడుగు వేయడం లేదు. మరి ఈ సినిమాకు ఏ స్థాయిలో వసూళ్ళు వస్తాయో చూడాలి.