వేట కోసం కాచుకొన్న చిరుత
ABN , First Publish Date - 2022-06-27T10:05:11+05:30 IST
మలయాళ సూపర్ స్టార్ ఫృథ్వీరాజ్ కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కడువా’. షాజీ కైలాస్ దర్శకుడు...
మలయాళ సూపర్ స్టార్ ఫృథ్వీరాజ్ కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కడువా’. షాజీ కైలాస్ దర్శకుడు. సంయుక్త మీనన్ కథానాయిక. వివేక్ ఓబెరాయ్ కీలక పాత్రధారి. లిస్టెన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ నిర్మాతలు. ఈనెల 30న విడుదల అవుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో టీజర్ విడుదల చేశారు. ‘ఆయనొక చిరుత.. వేట కోసం కాచుకొన్న చిరుత..’ అనే డైలాగ్ టీజర్లో ఆకట్టుకొంటోంది. ఫృథ్వీరాజ్ మాట్లాడుతూ ‘‘మాస్ మసాలా సినిమా ఇది. ఈ జానర్లో మలయాళంలో సినిమా తీసి చాలా కాలమైంది. అందుకే మేం తెరకెక్కించాం. తెలుగు ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలూ ఈ కథలో ఉన్నాయ’’న్నారు. వివేక్ ఓబెరాయ్ మాట్లాడుతూ ‘‘నేను హైదరాబాద్‌లోనే పుట్టాను. ఇక్కడ మా బంధువులు, స్నేహితులు చాలామంది ఉన్నారు. అందుకే హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా సంతోషంగా ఉంటుంది. ‘కడువా’ మంచి జోష్ ఉన్న సినిమా. ఓ బుల్ ఫైట్ చూస్తున్నట్టు ఉంటుంద’’న్నారు. ‘‘భీమ్లా నాయక్‌లో నా పాత్రకు మంచి పేరొచ్చింది. ఆ సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరించారో, ‘కడువా’ని కూడా అలానే ఆశీర్వదిస్తార’’ని సంయుక్త ఆకాంక్షించారు. సంగీతం: జేక్స్ బిజోయ్.