Krishnam Raju: ఈ ఇద్దరు కృష్ణుల గురి తప్పలేదు.. కృష్ణం రాజుపై ఎంత నమ్మకం ఉంటే కృష్ణ ఆ మాటంటారు..!
ABN , First Publish Date - 2022-09-11T22:29:11+05:30 IST
ఒక కథకి, ఆ కథానాయకుడి పాత్రకీ న్యాయం చేయాలంటే రెబల్ స్టార్ కృష్ణంరాజుకి మాత్రమే సాధ్యమని, తన వల్ల ఎంతమాత్రం కాదనీ...

ఒక కథకి, ఆ కథానాయకుడి పాత్రకీ న్యాయం చేయాలంటే రెబల్ స్టార్ కృష్ణంరాజుకి (rebel star krishnam raju) మాత్రమే సాధ్యమని, తన వల్ల ఎంతమాత్రం కాదనీ ఒక పెద్ద సూపర్ స్టార్ (Super Star Krishna) అనుకున్నారంటే అది చాలు కృష్ణంరాజు (krishnam raju) ప్రత్యేకత గురించి చెప్పడానికి. ఆ పెద్ద సూపర్ స్టార్ మరెవరో కాదు- డేరింగ్ & డాషింగ్ హీరో నటశేఖర కృష్ణ (Actor Krishna). ఒక పోలీసాఫీసర్ కథకి కృష్ణంరాజు మాత్రమే సరిపోతారని కృష్ణ ఫిక్సయిపోయారు. పోటీలేని సూపర్ స్టార్‌గా వెండితెర మీద ఒక వెలుగు వెలుగుతున్న నటశేఖర కృష్ణకి మళయాళంలో సూపర్ హిట్ అయిన ఒక సిన్సియర్ పోలీసాఫీసరు కథ నచ్చింది. అయితే, ఆ కథానాయకుడి పాత్రని తాను న్యాయం చేయలేననీ, కృష్ణంరాజు మాత్రమే అతికినట్టు సరిపోతారని అనుకోవడమే కాదు, తన నిర్మాణ సంస్థ పద్మాలయా స్టూడియోస్ బ్యానర్ (Padmalaya Studios) కింద తీశారు కూడా. మూడున్నర దశాబ్దాల క్రితం సంచలన విజయం సాధించిన ఆ సినిమా-'మరణశాసనం' (Marana Sasanam)!
ఆ సినిమాలో సర్కిల్ ఇన్స్పెక్టర్ బలరామ్‌గా (CI Balaram Role) కృష్ణంరాజు (Krishnam Raju) పోషించిన పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. నటనలో తన ప్రతిభని ప్రదర్శించడానికి వీలు కల్పించే పాత్ర అది. నీతీనిజాయితీలే ఊపిరిగా వృత్తి ధర్మాన్ని ప్రవృత్తిగా మార్చుకున్న పోలీసాధికారి బలరాం. అవినీతి ఏ రూపంలో ఉన్నా సహించడు. అవినీతి అధికారుల పొడ కూడా గిట్టదు. అయితే, విధి నిర్వహణలో అతని నిబద్ధతకి బహుమానంగా ఎన్నో సార్లు బదిలీలు అవుతుంటాడు. ప్రమోషన్ దక్కదు. తాను చేయని లాకప్ డెత్ నేరం మీద పడుతుంది. అది కోర్టులో నిరూపణ కాకపోయినా, కానివాళ్లే కాదు, అయినవాళ్లు కూడా అనుమానిస్తారు. ప్రేమించినామె కూడా వదిలేసి, వేరే పెళ్ళి చేసుకుంటుంది. ప్రవాహంలో గడ్డిపోచలా వ్యవస్థలో భాగం అయితే ప్రశాంతంగా బతికేయవచ్చని స్నేహితుడైన తోటి పోలీసాఫీసర్ ఇచ్చే లౌక్యంతో ఇచ్చే సలహాలు బలరాంకి రుచించవు.
అవమానాలు, అవరోధాలు, అపజయాలు.. వాటికి తోడు ఒంటరితనం. ఆ ఒంటరితనం నుంచి తప్పించుకోవడానికి తాగుడు అలవాటవుతుంది. ఇంతలో మరో ఆమె చేరువౌతుంది. ఏ నటుడికైనా అటువంటి పాత్ర దక్కడం ఒక చక్కని అవకాశం. ఎన్నో షేడ్స్ ఉన్న పాత్రే, గొప్ప వైవిధ్యాన్ని ప్రదర్శించగలిగే అవకాశమే, కానీ, ఎవరైనా చేయగలిగిన పాత్ర కాదు. ‘అందుకే కృష్ణంరాజుని ఎంచుకున్నాం...’ అని ఏ భేషజం లేకుండా చెప్పారు కృష్ణ అప్పట్లో. ప్రేక్షకుల నాడి పట్టుకోవడంలో, మార్కెట్ ను అంచనా వేయడంలో కూడా కృష్ణ సిద్ధహస్తులని ‘మరణశాసనం’ విజయం నిరూపించింది. కృష్ణ సమర్పణలో పద్మాలయా బ్యానర్ కింద ఎస్ ఎస్ రవిచంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తీయబోతున్నట్టు ప్రకటన విడుదలై, షూటింగ్ ప్రారంభమైన తొలినాళ్లలోనే అన్ని ఏరియాల హక్కులూ అమ్ముడుబోవడం విశేషం.

మాతృక మళయాళంలో...
సీఐ బలరాంగా ముమ్ముట్టి నటించిన 'ఆవనాళి (aavanazhi) (వింటి ధ్వని)' 1986లో విడుదలై మళయాళంలో (Malayalam Movie) బాక్సాఫీస్ హిట్టుగా నిలిచింది. అప్పటి సామాజిక, రాజకీయ వాతావరణానికి తగ్గట్టు నిజాయితీపరుడైన పోలీసాధికారి కథని టి దామోదరన్ అందిస్తే, ఐవీ శశి దర్శకత్వం వహించాడు. అదే కథని కన్నడలో అంబరీష్- గీత జంటగా ‘అంతిమతీర్పు’ అని, తమిళంలో సత్యరాజ్ హీరోగా ‘కడమై కన్నియం కట్టుపాడు’ అని, తెలుగులో కృష్ణంరాజుతో ‘మరణశాసనం’ అని, హిందీలో రాజ్ ఎన్ సిప్పీ దర్శకత్వంలో వినోద్ ఖన్నా హీరోగా ‘సత్యమేవ జయతే’ అనీ తీశారు. ఆవనాళికి సీక్వెల్‌గా అదే ముమ్ముట్టీతో 1991లో ‘ఇన్స్పెక్టర్ బలరాం’, 2006లో ‘బలరాం వర్సెస్ తారాదాస్’ అని సినిమాలు కూడా తీశాడు ఐవీ శశి. ముమ్ముట్టి వేసిన సీఐ బలరాం పాత్ర అంతమంది నటులు అన్ని భాషల్లో పోషించినా, కృష్ణంరాజు మాత్రం ఆ పాత్ర మీద తనదైన ప్రత్యేక ముద్ర వేశారని పేరు పొందారు.