సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Superstar Krishna: తల్లి కోరిక మేరకు ‘ముగ్గురు కొడుకులు’

ABN, First Publish Date - 2022-11-15T13:21:20+05:30

సూపర్ స్టార్ కృష్ణ (SuperStar Krishna) మాతృమూర్తి నాగరత్నమ్మ గారికి ముగ్గురు కొడుకులు (Mugguru Kodukulu)...కృష్ణ, హనుమంతరావు, ఆదిశేషగిరిరావు. అందుకే ముగ్గురు కొడుకులు పేరుతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూపర్ స్టార్ కృష్ణ (SuperStar Krishna) మాతృమూర్తి నాగరత్నమ్మ గారికి ముగ్గురు కొడుకులు (Mugguru Kodukulu)...కృష్ణ, హనుమంతరావు, ఆదిశేషగిరిరావు. అందుకే ముగ్గురు కొడుకులు పేరుతో ఒక సినిమా తీయాలన్నది ఆమె కోరిక. అందుకే కథ కూడా రెడీ కాకుండానే ఆ టైటిల్ రిజిస్టర్ చేయించారు ఆమె. ఆ సినిమా కోసం ఓ కథ తయారు చేయమని పద్మాలయా సంస్థ ఆస్థాన రచయిత మహారధికి చెప్పారు నాగరత్నమ్మ. అయితే ఎప్పుడూ అడిగినా కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారే తప్ప ఏడాది గడిచినా కథ తయారు చేయలేదు మహారధి. ఆయన చెప్పే కబుర్లు విని వినీ విసుగెత్తి పోయింది నాగరత్నమ్మకు. దాంతో ఒక రోజు ఆమె సీరియస్‌గా హీరో కృష్ణ దగ్గరకు వెళ్లారు. ఇదిగో కృష్ణమూర్తి.. ఆ మహారధికి కథ తయారు చేయమని చెప్పి ఏడాది గడిచింది. అక్షరం ముక్క కూడా రాయలేదు.. ఇలా కాదు కానీ నా ముగ్గురు కొడుకులు కథ గురించి ఈ రోజు తెల్చాల్సిందే అని గట్టిగా అడిగారు. అమ్మ అంటే కృష్ణకు చాలా ఇష్టం. ఆమె ఏది అడిగినా కాదనే వారు కాదు. నువ్వు టెన్షన్ పడకమ్మా.. పరుచూరి బ్రదర్స్‌ (Paruchuri Brothers) తో రాయిస్తాలే అని తల్లికి నచ్చజెప్పారు.


ఆ తర్వాత పరుచూరి సోదరులకు కబురు చేశారు హీరో కృష్ణ. వాళ్ళు రాగానే నేను, రమేష్, మహేష్ కలసి ఓ సినిమా చేయాలనుకుంటున్నాం. సినిమా పేరు ‘ముగ్గురు కొడుకులు’. కథ తయారు చేయండి అని చెప్పారు కృష్ణ. ఆ సమయంలో పరుచూరి సోదరులు చాలా బిజీగా ఉన్నారు. అయినా చిత్ర కథ కోసం కసరత్తు చేశారు. అయితే వాళ్లు తయారు చేసిన కథ కృష్ణకు నచ్చలేదు. ఆ తర్వాత దర్శకుడు పి.సి రెడ్డి ఓ లైన్ చెప్పారు. అది బాగుందనిపించింది కృష్ణకు. పి.సి.రెడ్డి, రచయిత భీసెట్టి కలిసి కూర్చుని కథ తయారు చేశారు. చదువుకు ఇబ్బంది కాకుండా మహేష్ స్కూల్‌కి సెలవలు ఇచ్చినప్పుడు షూటింగ్ చేద్దాం. అది దృష్టిలో పెట్టుకొని కథ తయారు చేయండి అని హీరో కృష్ణ (Hero Krishna) ముందే చెప్పడంతో ఊటీ బ్యాక్‌డ్రాప్‌లో కథ సిద్ధం చేశారు.


మాటలు రాసే బాధ్యతను పరుచూరి బ్రదర్స్ స్వీకరించారు. హీరో కృష్ణ సరసన రాధను, రమేష్ పక్కన బాలీవుడ్ నటి సోనమ్‌ను ఎంపిక చేశారు. కృష్ణ తల్లితండ్రులు‌గా అన్నపూర్ణ, గుమ్మడి నటించారు. విలన్లుగా సత్యనారాయణ, నూతన్ ప్రసాద్, కోట శ్రీనివాసరావు నటించారు. షూటింగ్ మొత్తం ఊటీలోనే జరిగింది. కృష్ణ, రమేష్, మహేష్ కలసి నటించిన తొలి చిత్రం ఇదే. వీళ్లు ముగ్గురూ అన్నదమ్ములుగా నటించారు. అలాగే కృష్ణ కుమార్తె బేబీ ప్రియ కూడ ఇందులో నటించింది. సినిమాలోని ఓ సన్నివేశంలో మహేష్ అల్లూరి సీతారామరాజు గెటప్‌లో కనిపిస్తారు. అంత చిన్న వయసులో పెద్ద పెద్ద డైలాగులు అవలీలగా మహేష్ పలికేసి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ముగ్గురు కొడుకులు చిత్రానికి నిర్మాతగా తల్లి నాగరత్నమ్మ పేరే వేశారు కృష్ణ. ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించారు. చిత్రాన్ని తన తండ్రి ఘట్టమనేని వీర రాఘవయ్య చౌదరికి అంకితం ఇచ్చారు కృష్ణ. 1988 అక్టోబర్ 20న ముగ్గురు కొడుకులు చిత్రం విడుదలైంది. తను ఎంతో ముచ్చటపడి తీయించిన ఈ చిత్రం హిట్ అయినందుకు నాగరత్నమ్మ ఎంతో సంతోషించారు. అయితే ఈ చిత్రం వంద రోజుల వేడుకలో పాల్గొనకుండానే ఆమె కన్ను మూయడం విషాదకరం.

-వినాయకరావు

Updated Date - 2022-11-15T13:21:20+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!