Super Star krishna: అభిమానే కానీ భిన్న ధృవాలు

ABN , First Publish Date - 2022-11-15T13:53:30+05:30 IST

నటరత్న ఎన్టీఆర్‌, నటశేఖర కృష్ణ.. నటనా పరంగా, రాజకీయంగానూ, వ్యక్తిగతంగాను రెండు భిన్న ధృవాల్లాంటి వారు. అభిప్రాయ భేదాల్లో ఇద్దరి మధ్య తేడాలు ఉన్నప్పటికీ పరస్పర అభిమానాల్లో వారిద్దరి మధ్య ఎలాంటి తేడాలే లేవనే విషయం చాలాసార్లు రుజువైంది.

Super Star krishna: అభిమానే కానీ భిన్న ధృవాలు

నటరత్న ఎన్టీఆర్‌(Ntr), నటశేఖర కృష్ణ.. (Krishna)నటనా పరంగా, రాజకీయంగానూ, వ్యక్తిగతంగాను రెండు భిన్న ధృవాల్లాంటి వారు. అభిప్రాయ భేదాల్లో ఇద్దరి మధ్య తేడాలు ఉన్నప్పటికీ పరస్పర అభిమానాల్లో వారిద్దరి మధ్య ఎలాంటి తేడాలే లేవనే విషయం చాలాసార్లు రుజువైంది. స్వతహాగా హీరో కృష్ణ ఎన్టీఆర్‌ అభిమాని (Krishna big fan of Ntr). చిన్నతనంలో తెనాలి రత్నా టాకీస్‌లో ‘పాతాళ భైరవి’ చిత్రం చూసిన దగ్గర నుంచి ఎన్టీఆర్‌ అంటే అభిమానం ఏర్పడింది. అప్పటి నుంచి మిగిలిన హీరోల చిత్రాలు చూస్త్తున్నప్పటికి ఎన్టీఆర్‌ సినిమాలంటే మాత్రం ప్రత్యేకంగా చూేస వారు కృష్ణ. (Ntr anf krishna Fight)

ఆర్టిస్ట్‌ అవుదామని మద్రాస్‌ వెళ్ళినప్పుడు కూడా కృష్ణ మొదటిసారి కలిసింది తన అభిమాన నటుడు ఎన్టీఆర్‌నే. ఆ సమయంలో సీతారామ కళ్యాణం చిత్రం తీస్తున్నారు ఎన్టీఆర్‌. విజయా సంస్థ అధినేతల్లో ఒకరైన చక్రపాణి కృష్ణను ఎన్టీఆర్‌ దగ్గరకు తీసుకెళ్ళి పరిచయం చేశారు. అప్పటికీ కృష్ణ వయసు 19 ఏళ్లు. చాలా చిన్న వయసు అని, ఓ రెండేళ్లు నాటకాల్లో నటించాక సినిమాల్లోకి రమ్మనమని సలహా ఇచ్చారు ఎన్టీఆర్‌. సినిమాల్లోకి వచ్చి హీరో అయిన తర్వాత తన అభిమాన నటుడు ఎన్టీఆర్‌తో కలసి స్ర్తీ జన్మ చిత్రంలో తొలిసారిగా నటించారు కృష్ణ. ఆ సినిమాలో ఎన్టీఆర్‌కు తమ్ముడిగా నటించడంతో ఆయన్ని అన్నగారు అని పిలవడం అలవాటైంది కృష్ణకు. స్ర్తీ జన్మ చిత్ర నిర్మాణ సమయంలో కృష్ణ పద్థతులు నచ్చి నిలువు దోపిడి చిత్రంలో తన తమ్ముడి పాత్రకు కృష్ణను రికమెండ్‌ చేశారు ఎన్టీఆర్‌.


ఎన్టీఆర్‌–కృష్ణ కాంబినేషన్‌

పెదవి విరిచినా.. ఆయన హిట్‌ అన్నారు..

హీరో కృష్ణ నిర్మించిన తొలి కౌ బాయ్‌ సినిమా ‘మోసగాళ్లకు మోసగాడు’ ఎన్టీఆర్‌కు బాగా నచ్చింది. ఈ చిత్రం ప్రివ్యూ చూసి చాలా మంది సినీ ప్రముఖులు పెదవి విరిచినా, ఎన్టీఆర్‌ మాత్రం సినిమా హిట్‌ అవుతుందని చెప్పారు. విడుదలయ్యాక ఆయన మాటే నిజం అయింది. అలాగే కృష్ణ నిర్మించిన మరో చిత్రం పండంటి కాపురం చిత్రం రజతోత్సవం విజయవాడలో జరిగితే ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సభలోనే ఎన్టీఆర్‌తో ఓ సినిమా తీయాలనే కోరికను హీరో కృష్ణ వ్యక్తం చేేస్త వెంటనే ఎన్టీఆర్‌ ఆమోదించారు. అలా వీరిద్దరి కాంబినేషన్‌ లో వచ్చిన ‘దేవుడు చేసిన మనుషులు’ ఘన విజయం సాధించింది. ఆ చిత్రం తర్వాత అల్లూరి సీతారామరాజు చిత్రం తియనున్నట్లు కృష్ణ ప్రకటించారు.. ఇది ఎన్టీఆర్‌ ఆగ్రహానికి గురైంది. తను వద్దంటున్న వినకుండా ఆ సినిమా తీయడానికి కృష్ణ ప్రయత్నాలు చేస్తుండడంతో ఎన్టీఆర్‌ అలిగి, ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం వంద రోజుల వేడుకకు రాలేదు. అలాగే దాన వీర శూర కర్ణ, కురుక్షేత్రం చిత్ర నిర్మాణ సమయంలోనూ ఎన్టీఆర్‌, కృష్ణల మధ్య వివాదం తలెత్తింది. పోటా పోటీగా ఈ రెండు చిత్రాల నిర్మాణం కొనసాగింది. ఎన్టీఆర్‌కు బాసటగా ఏ ఎన్నార్‌ నిలిేస్త, కృష్ణకు శోభన్‌బాబు, కృష్ణంరాజు సపోర్ట్‌ ఇచ్చారు. ఇండస్ర్టీలోని ఇతర నటీ నటులు కూడా ఏదో ఒక శిబిరానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఆరు నెలలపాటు సాగిన యుద్థం లో చివరకు ఎన్టీఆర్‌ గెలిచారు.

ఆ తర్వాత ఎన్టీఆర్‌, కృష్ణ మధ్య మాటలే లేవు. ఎదురు పడినా పలకరించు కోలేని పరిస్థితి. బద్థ శత్రువులు లాగా ఉండే ఈ హీరోలు ఇద్దరూ కలిశారు. అంతే కాదు ‘వయ్యారి భామలు వగలమారి భర్తలు’ చిత్రంలో కలిసి నటించారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వెళ్లారు. కృష్ణ మద్దతు ప్రకటించారు. ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వడంతో ఎప్పుడూ బిజీగా ఉండే హీరో కృష్ణ మరింత బిజీ అయ్యారు. అప్పటివరకు ఎన్టీఆర్‌తో సినిమాలు తీసిన నిర్మాతల్లో అత్యధిక శాతం కృష్ణతో సినిమాల నిర్మాణం కొనసాగించడానికి ముందుకు రావడంతో కృష్ణ మరీ బిజీ అయిపోయారు.దీంతో ఆయన పని గంటలు సంఖ్య పెరిగింది. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ పెద్దల దృష్టి హీరో కృష్ణ మీద పడింది. రాజకీయంగా ఎన్టీఆర్‌ను ఎదుర్కొనాలంటే మాస్‌లో మాంచి ఫాలోయింగ్‌ ఉన్న హీరో కృష్ణ సపోర్ట్‌ తమకు అవసరం అని కాంగ్రెస్‌ పార్టీ భావించింది. రాజకీయాలకు ఎప్పుడూ దూరంగా ఉండే హీరో కృష్ణ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పార్టీ లో చేరాల్సి వచ్చింది. అంతే కాదు ఆ నాటి ప్రధాని రాజీవ్‌ గాంధీ ఆదేశాలకు అనుగుణంగా ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా కొన్ని సినిమాలు కూడా తీయాల్సి వచ్చింది. రాజీవ్‌గాంధీ మరణానంతరం కృష్ణ రాజకీయాలకు దూరం అయ్యారు. మళ్ళీ ఎన్టీఆర్‌కు దగ్గర అయ్యారు. తన 300వ చిత్రం ‘తెలుగు వీర లేవరా’ చిత్ర ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్‌, ఏయన్నార్‌లను ఆహ్వానించారు కృష్ణ. ఇక అప్పటి నుంచి ఈ అన్నదమ్ముల మధ్య విభేదాలు లేవు. ఎన్టీఆర్‌ మరణానంతరం ఆయన జాతీయ అవార్డును కూడా కృష్ణ అందుకొన్నారు.


యు. వినాయకరావు 

Updated Date - 2022-11-15T13:53:30+05:30 IST

Read more