Super star Krishna: తమిళ సూపర్ స్టార్ తో ముచ్చటగా మూడు...

ABN , First Publish Date - 2022-11-15T15:45:47+05:30 IST

సూపర్ స్టార్ కృష్ణ, తమిళ చిత్ర రంగ సూపర్ స్టార్ రజనీకాంత్ కలసి తెలుగులో మూడు చిత్రాల్లో నటించారు. ఈ కాంబినేషన్ కు శ్రీకారం చుట్టిన చిత్రం అన్నదమ్ముల సవాల్. కన్నడంలో హిట్ అయిన సహోదర సవాల్ చిత్రం ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది.

Super star Krishna: తమిళ సూపర్ స్టార్ తో ముచ్చటగా మూడు...

సూపర్ స్టార్ కృష్ణ(Krishna), తమిళ చిత్ర రంగ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajanikanth)కలసి తెలుగులో మూడు చిత్రాల్లో నటించారు. ఈ కాంబినేషన్ కు శ్రీకారం చుట్టిన చిత్రం అన్నదమ్ముల సవాల్ (Annadammula saval). కన్నడంలో హిట్ అయిన సహోదర సవాల్ చిత్రం ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. (Three movies with Rajani kanth)రజనీకాంత్ కన్నడంలో నటించిన అతి కొద్ది చిత్రాల్లో సహోదర సవాల్ ఒకటి. ఆ సినిమాలో విష్ణువర్ధన్ మరో హీరోగా నటించారు.తెలుగు దర్శకుడు కే.ఎస్.ఆర్.దాస్ ఆ కన్నడ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీ సారథి స్టూడియోస్ సంస్థ సహోదర సవాల్ రీమేక్ హక్కులు కొంది. క్రైమ్, యాక్షన్ అంశాలు కలిగిన ఈ చిత్రంలో హీరోగా కృష్ణ నటిస్తే బిజినెస్ కు డో కా ఉండదని నిర్మాతలు జి డి  ప్రసాద రావు, శశి భూషణ్ ఆయన్ని సంప్రదించారు. తన తొలి సినిమా నుంచి సారథి స్టూడియో తో అనుబంధం ఉంది కనుక కృష్ణ వెంటనే అంగీకరించారు. కన్నడంలో తను పోషించిన పాత్రనే తెలుగులో నూ పోషించారు రజనీకాంత్. తెలుగులో ఆయనకు ఇది ఐదొ చిత్రం. కృష్ణ సరసన జయచిత్ర, రజనీకాంత్ పక్కన చంద్రకళ నటించారు. అన్నదమ్ముల సవాల్ చిత్రం హిట్ అయింది. హీరో కృష్ణ, రజనీకాంత్ కలసి నటించిన రెండో చిత్రం ఇద్దరూ అసాధ్యులే. గీత, మాధవి హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో కృష్ణ, రజనీకాంత్ బావ, బావమరిదులుగా నటించారు. భారీ అంచనాల మధ్య విడుదల ఆయిన ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూడో చిత్రం రామ్ రాబర్ట్ రహీమ్. హిందీ లో హిట్ అయిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. హిందీలో అమితాబ్ పోషించిన పాత్ర ను కృష్ణ, వినోద్ ఖన్నా పాత్రను రజనీకాంత్, రిషీ కపూర్ పాత్రను చంద్ర మోహన్ పోషించారు. విజయనిర్మల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్న కృష్ణ  ఒక పక్క నటుడిగా కొనసాగుతూనే, వ్యాపార పరంగా కూడా ఎదగాలనే లక్ష్యం తో నిర్మాత కూడా మారారు. తన సీనియర్స్ ఎన్టీఆర్,  ఏయన్నార్ లతోనే కాకుండా, సహ నటులు శోభన్ బాబు, కృష్ణంరాజు లతో  కూడా భారీ చిత్రాలు నిర్మించారు. తమిళంలో శివాజీ గణేశన్, రజనీకాంత్ లతో సినిమాలు నిర్మించారు. రజనీకాంత్ హీరోగా నిర్మించిన చిత్రం పేరు మా వీరన్. తమిళంలో ఇదే తొలి 70 ఎం ఎం చిత్రం. రజనీకాంత్ సరసన అంబిక నటించిన ఈ చిత్రం షూటింగ్  తమిళ ఉగాది రోజున అంటే 1986 ఏప్రిల్ 14 న చెన్నై లోని విజయా గార్డెన్స్ లో మొదలైంది.  ఈ కార్యక్రమానికి కమల్ హాసన్ , మాధవి తదితరులు హాజరయ్యారు. మైసూర్ ప్యాలెస్ లో అధిక భాగం షూటింగ్ జరిగింది. ఆ ఏడాది నవంబర్ ఒకటిన విడుదల అయిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కొదమ సింహం పేరుతో తెలుగు లోకి అనువదించింది పద్మాలయా సంస్థ. 1986 డిసెంబర్ 12 న విడుదల అయిన ఈ చిత్రం తెలుగులో కూడా హిట్ అయింది.

- యు. వినాయకరావు 



Updated Date - 2022-11-15T15:45:47+05:30 IST