కథ మొత్తం మార్చాల్సిందేనా?
ABN , First Publish Date - 2022-10-08T05:30:00+05:30 IST
ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్లో ‘జనతా గ్యారేజ్’ వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్లో ‘జనతా గ్యారేజ్’ వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తరవాత వీరి కాంబో మళ్లీ సెట్ అయ్యింది. ‘ఆర్.ఆర్.ఆర్’ తరవాత... కొరటాల శివతో ఓ సినిమా చేయాలి ఎన్టీఆర్. అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పటి వరకూ పట్టాలెక్కలేదు. ‘ఇదిగో... అదిగో’ అన్నారు కానీ, ఎలాంటి కబురూ లేదు. దసరాకి కొబ్బరి కాయ కొడతారని చెప్పారు. అది కూడా అవ్వలేదు. దాంతో ఈ ప్రాజెక్టు చుట్టూ అనేక అనుమానాలు ముసురుకొంటున్నాయి. ఇది వరకు ఎన్టీఆర్కి సెకండాఫ్ నచ్చలేదని, కొన్ని మార్పులు, చేర్పులూ సూచించాడని చెప్పుకొన్నారు. ఇప్పుడు అసలు కథే నచ్చలేదని, దాన్ని పక్కన పెట్టి, కొత్త కథ రాయమని కొరటాలకు సూచించాడట ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల అదే పనిలో బిజీ బిజీగా ఉన్నారని సమాచారం అందుతోంది. కొరటాల మంచి కథకుడు. ఆయన దగ్గర కథలకు లోటు లేదు. అందుకే... ఎన్టీఆర్కి తగిన కథ సెట్ చేయడానికి ఆయనకంత సమయం పట్టకపోవొచ్చు. కాకపోతే.. ఎన్టీఆర్కి ఇప్పుడు మరో ఆప్షన్ కూడా ఉంది. ‘ఉప్పెన’తో సూపర్ హిట్ కొట్టిన బుచ్చిబాబుకి ఎన్టీఆర్ ఇది వరకే మాటిచ్చాడు. బుచ్చిబాబు ఎన్టీఆర్ కోసం ఓ కథ తయారు చేసి సిద్ధంగా ఉన్నాడు. కొరటాల సినిమా కనుక ఆలస్యమైతే... ఎన్టీఆర్ బుచ్చికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసే అవకాశాలూ కనిపిస్తున్నాయి.