ఘోస్ట్ అంటే దెయ్యం అని కాదు: King Nagarjuna

ABN , First Publish Date - 2022-07-10T00:53:13+05:30 IST

కింగ్ అక్కినేని నాగార్జున(King Akkineni Nagarjuna) హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ఘోస్ట్’ (The Ghost). ఈ చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాలను శనివారం

ఘోస్ట్ అంటే దెయ్యం అని కాదు: King Nagarjuna

కింగ్ అక్కినేని నాగార్జున(King Akkineni Nagarjuna) హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ఘోస్ట్’ (The Ghost). ఈ  చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాలను శనివారం నుండి చిత్రయూనిట్ మొదలుపెట్టింది. అందులో భాగంగా ‘కిల్లింగ్ మెషిన్’ అనే గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో  నాగార్జునతో పాటు నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్.. నటులు మహేంద్ర, క్రిష్, రవి వర్మ వంటివారు  పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్లింప్స్‌ని విడుదల చేయడమే కాకుండా.. చిత్ర విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తామని కిల్లింగ్ మెషిన్ గ్లింప్స్ ద్వారా మేకర్స్ ప్రకటించారు. నాగార్జున కల్ట్ క్లాసిక్, పాత్ బ్రేకింగ్ మూవీ ‘శివ’ చిత్రం కూడా 1989లో అదే తేదీన విడుదల కావడం విశేషం.


‘ది ఘోస్ట్’ కిల్లింగ్ మెషిన్ గ్లింప్స్ విషయానికి వస్తే.. ఇందులో నాగార్జున, తనపైకి వచ్చిన ఓ గుంపుని కత్తులతో తెగ నరకడం అనేది స్టైలిష్, యాక్షన్ ప్యాక్డ్‌గా వుంది. నాగార్జున చాలా ఫిరోషియస్ అండ్ టెర్రిఫిక్‌గా కనిపించారు. యువ సంగీత దర్శకులు భరత్ - సౌరభ్ ఇచ్చిన బీజీయం ఈ గ్లింప్స్‌‌ యాప్ట్‌గా ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం ఒక యాక్షన్ సీక్వెన్స్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయినట్లుగా మేకర్స్ ప్రకటించారు.


ఈ సందర్భంగా కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలో మేజర్ హైలెట్ యాక్షన్. దర్శకుడు ప్రవీణ్ సత్తారు యాక్షన్‌ని అద్భుతంగా తీశారు. కిల్లింగ్ మెషిన్ జస్ట్ గ్లింప్స్ మాత్రమే, ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు అద్భుతంగా ఉంటాయి. చాలా రోజుల తర్వాత నేను ట్రైనింగ్ తీసుకొని యాక్షన్ సీన్స్ చేశా. ఇలాంటి యాక్షన్ గతంలో నేను చేయలేదు, నాకు చాలా కొత్తగా అనిపించింది. చాలా ఎక్సయిటింగ్‌గా వుంది. చిత్రానికి మంచి టెక్నికల్ టీం పని చేసింది. సోనాల్ చౌహాన్ కూడా ఇందులో సరికొత్త పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రంలో యాక్షన్‌తో పాటు ఎమోషన్, సిస్టర్ సెంటిమెంట్ కూడా వుంటుంది. అక్టోబర్ 5న సినిమాని మీ ముందుకు తెస్తున్నాం’’ అని తెలిపారు.


అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన కొన్ని ప్రశ్నలకు నాగార్జున బదులిచ్చారు.


‘శివ’ చిత్రంలో చైన్ పట్టారు.. ‘ది ఘోస్ట్’లో రెండు కత్తులు పట్టారు.. మరో ‘శివ’లా అంచనాలు పెట్టుకోవచ్చా?

నాగార్జున: శివకి దీనికి పోలిక లేదు. యాక్షన్ స్టైలిష్ గా డిజైన్ చేసిన క్రమంలో కత్తులు వచ్చాయి. 


ఎవరికీ ఘోస్ట్ గా వుంటారు?

నాగార్జున: ఘోస్ట్ అంటే దెయ్యం అని కాదు. స్టైలిష్ పోల్ ఏజెంట్ విక్రమ్‌కి కోడ్ నేమ్.


ఇన్నేళ్ళ మీ అనుభవంలో ఎలాంటి పాత్రలు, ఎలాంటి కథలని ప్రేక్షకులు యాక్సప్ట్ చేస్తున్నారనిపించింది?

నాగార్జున: నిజంగా తెలీదండి. నాకే కాదు ఇది ఎవరికీ తెలియదని అనుకుంటాను. ప్రేక్షకులకు ఎప్పుడు, ఎందుకు ఒక సినిమా నచ్చుతుందో తెలీదు. ఈ మధ్య రాజమౌళి గారితో మాట్లాడుతున్నప్పుడు ఇదే టాపిక్ వచ్చింది. ‘మన మనసుకు నచ్చిన సినిమా బలంగా నమ్మి తీసేయాలి. మనకి నమ్మకం ఉంటేనే జనాలకి నచ్చుతుంది’ అన్నారు.


ప్రవీణ్ సత్తారు చెప్పిన కథలో కొత్త పాయింట్ ఏమిటి?

నాగార్జున:  ట్రీట్మెంట్, యాక్షన్ డిజైన్ చాలా కొత్తగా వుంటుంది. ఈ ట్రెండ్‌కి తగ్గట్టు వుంటుంది.

Updated Date - 2022-07-10T00:53:13+05:30 IST

Read more