చిత్రోత్సవాల్లో ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ సెగ

ABN , First Publish Date - 2022-11-30T04:56:42+05:30 IST

గోవాలో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ సెగ పుట్టించింది. ఈ సినిమా గురించి జ్యూరీ హెడ్‌, ఇజ్రాయిల్‌ దర్శకుడు నడవ్‌ లాపిడ్‌ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు...

చిత్రోత్సవాల్లో ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ సెగ

గోవాలో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ సెగ పుట్టించింది. ఈ సినిమా గురించి జ్యూరీ హెడ్‌, ఇజ్రాయిల్‌ దర్శకుడు నడవ్‌ లాపిడ్‌ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ సినిమా చూసి నేను దిగ్ర్భాంతికి గురయ్యా. ఇది ప్రచారం కోసం తీసిన హింసాత్మక చిత్రం. ఇలాంటి చిత్రాల్ని అంతర్జాతీయ చిత్రోత్సవాలలో ఎలా ప్రదర్శిస్తారు?’’ అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. దీనిపై అనుపమ్‌ ఖేర్‌ తనదైన రీతిలో స్పందించారు. ‘‘ఇలాంటి మాటలు మాట్లాడడం సిగ్గు చేటు. నాడు యూధుల నరమేధం నిజమైతే.. కశ్మీరీ పండిట్ల ఊచకోత కూడా నిజమే. దేవుడు ఆయనకు కాస్త తెలివితేటల్ని, బుద్దినీ ప్రసాదించాలి’’ అని కామెంట్‌ చేశారు. నడవ్‌ లాపిడ్‌ వ్యాఖ్యలపై ఇజ్రాయిల్‌ రాయబారి నవోర్‌ గిలాన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘భారతదేశంలో అతిథుల్ని చాలా గౌరవిస్తారు. దేవుడిలా చూస్తారు. అలాంటి దేశానికి అతిథిగా వెళ్లిన మీరు.. ఆ దేశ సంప్రదాయాల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదు. మీ ప్రవర్తన పట్ల సిగ్గు పడుతున్నా. భారత ప్రభుత్వానికి నా క్షమాపణలు’’ అంటూ ట్వీట్‌ చేశారు. ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రంపై లాపిడ్‌ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని, దానికీ ‘ఇఫా’ జ్యూరీకీ ఎలాంటి సంబంధం లేదని ‘ఇఫా’ ఓ ప్రకటనలో తెలిపింది.

Updated Date - 2022-11-30T04:56:42+05:30 IST

Read more