Jayasudha : మంచి స్నేహితుడ్ని కోల్పోయాను

ABN , First Publish Date - 2022-09-11T18:38:35+05:30 IST

రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) సరసన కథానాయికగా ఎక్కువ సినిమాలు చేసిన నటీమణి జయసుధ (jayasudha). దాదాపు 25 సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు. అందులో చాలా సినిమాలు మంచి విజయాలు సాధించాయి.

Jayasudha : మంచి స్నేహితుడ్ని కోల్పోయాను

-సురేశ్ కవిరాయని

రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) సరసన కథానాయికగా ఎక్కువ సినిమాలు చేసిన నటీమణి జయసుధ (jayasudha). దాదాపు 25 సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు. అందులో చాలా సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఈ క్రమంలో కృష్ణంరాజుతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సహజనటి జయసుధ. ఆమె మాట్లాడుతూ..  ‘మేము ఇద్దరం కలిసి నటించిన మొదటి సినిమా నుండి మేము మంచి స్నేహితులం. నన్ను ఎంతో అభిమానంతో, ఆప్యాయతో పలకరిస్తూ ఉండేవారు కృష్ణంరాజు గారు. నన్ను జయసుధ అనే పిలిచేవారు. నేను రాజు గారు అని అనేదాన్ని. అదీ కాకుండా, రాజు గారు స్థాపించిన సంస్థ గోపి కృష్ణ మూవీస్ లో కూడా నేను ఎక్కువ సినిమాలు చెయ్యడం వల్ల కూడా నేను అంటే ప్రత్యేక అభిమానం చూపించేవారు. కనీసం వారానికి రెండు మూడు సార్లు ఫోన్ చేసి, ఎలా వున్నావు? పిల్లలు ఎలా వున్నారు? ఏమి చేస్తున్నావు? అంటూ ఆప్యాయంగా అడుగుతూ ఉండేవారు. నేను ఒక మంచి స్నేహితుడిని కోల్పోయాను, అని చెప్పారు జయసుధ.


మా పెద్దబ్బాయి పుట్టినప్పుడు ఆ విషయం కృష్ణంరాజు గారికి తెలిసింది. అయితే ఆయన షూటింగ్ కోసం సింగపూర్ వెళ్లాల్సి వచ్చింది. అప్పట్లో ఇంత కమ్యూనికేషన్ ఉండేది కాదు కదా, అందుకని రాజు గారు..  పుట్టిన అబ్బాయికి  మొదటి వారం నుంచి మూడు నెలల వరకు ఏమేమి కావాలో, అన్నీ సింగపూర్‌లో కొని ఒక పెద్ద బాక్స్ లో పంపారు. నేను ఏంటి ఈ బాక్స్ అని ఓపెన్ చేస్తే.. ఏముంది? అన్నీ ఇంపోర్టెడ్  వస్తువులే. డైపర్స్ కూడా అందులో వున్నాయి. మొత్తం చిన్న పిల్లాడికి కావాల్సిన వస్తువులు, అట్టబొమ్మలుతో సహా అన్నీ వున్నాయి అందులో. అదీ కాకుండా, స్టెరిలైజింగ్ టాబ్లెట్స్ ఉండేవి, అవి కూడా పంపారు. 


సెట్స్లో రాజుగారు మామూలుగా ఉండేవారు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవారు కాదు . అయన ఉన్నప్పుడు నో గాసిప్స్, వేరే వాళ్ళ గురించి కూడా అస్సలు మాట్లాడితే వొప్పుకునేవారు కాదు. ఒకవేళ ఎవరయినా అలాంటి విషయాలు మాట్లాడితే వెంటనే రాజుగారు కట్ చేసేసేవారు ఆ విషయాన్ని. భేషజం లేని వ్యక్తి, అందరితో సరదాగా ఉండేవారు ఎప్పుడూ. ఎవరికయినా సహాయం చెయ్యటం అంటే రాజుగారు ముందు ఉండేవారు. నేను, రాజుగారు, చిరంజీవి (Chiranjeevi) కలిసి ‘ప్రేమ తరంగాలు’ (Prema Tharangalu) అనే సినిమా చేశాం. ఇది హిందీ సినిమా ‘ముకద్దర్ కా సికిందర్’ (Muquaddar ka sikandar) సినిమాకి రీమేక్. చిరంజీవి వినోద్ ఖన్నా (Vinod Khanna) రోల్ వేస్తే, రాజుగారు అమితాబ్ (Abithab) రోల్ వేశారు. 


అలాగే  విశ్వనాధ్ (Viswanath) గారి దర్శకత్వంలో ‘అల్లుడు పట్టిన భారతం’ (Alludu Pattina Bharatham) అనే సినిమా కూడా చేసాము. ఇది పెద్దగా ఆడలేదు అనుకుంటా అప్పట్లో. ఇంకా చాలా మంచి సినిమాలు వచ్చాయి మా కాంబినేషన్ లో.  ‘బొబ్బిలి బ్రహ్మన్న, త్రిశూలం, ఆడవాళ్ళూ మీకు జోహార్లు, కటకటాల రుద్రయ్య’ ఇలా చాలా వున్నాయి. ‘బావ బావమరిది’  (Bava Bavamaridi) అన్న సినిమా కూడా చేశాం. నేను, రాజుగారు, సుమన్ కాంబినేషన్ ఈ సినిమా. ఇందులో రాజుగారికి, సిల్క్ స్మిత (Silk Smitha) కి కొన్ని సీన్స్ వున్నాయి, అవి చేశాక నా దగ్గరికి వచ్చి అనేవారు. జయసుథా.. ఎందుకో నాకు ఆ సీన్స్ నాకు నప్పవేమో అనిపిస్తోంది, చూస్తారు అంటావా? అని. లేదండి సినిమా మీ మీదే కదా, క్లైమాక్స్ కూడా మీ మీదే వుంది, తప్పకుండా నచ్చుతుంది జనాలకి అని చెప్వాను నేను. ఆలా అయన అందరికి గౌరవం ఇచ్చేవారు. మంచి వ్యక్తిత్వం వున్న రాజు గారు నాకు మంచి స్నేహితుడు. పరిశ్రమ బాగు కోరే మనిషి ఆయన అని చెప్పారు జయసుధ.

Updated Date - 2022-09-11T18:38:35+05:30 IST