నవ్వుల యోగి Jandhyala

ABN , First Publish Date - 2022-06-19T17:26:03+05:30 IST

నవ్వడం తేలికే. నవ్వించడమే బహు కష్టం. ఆ విద్య అందరికీ అంత తేలిగ్గా ఒంటపట్టదు. దానికి ఎంతో సెన్సుండాలి.. సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి. వెటకారం, చమత్కారం నరనరాన ప్రవహించాలి. అప్పుడే పదిమందినీ నవ్వించేంత హాస్య ప్రతిభ అలవడుతుంది.

నవ్వుల యోగి Jandhyala

నవ్వడం తేలికే. నవ్వించడమే బహు కష్టం. ఆ విద్య అందరికీ అంత తేలిగ్గా ఒంటపట్టదు. దానికి ఎంతో సెన్సుండాలి.. సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి. వెటకారం, చమత్కారం నరనరాన ప్రవహించాలి. అప్పుడే పదిమందినీ నవ్వించేంత హాస్య ప్రతిభ అలవడుతుంది. అందులో ఆరితేరిన అగ్రగణ్యుడు జంధ్యాల. ‘నవ్వించడం ఒక యోగం, నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం’ అని అందుకే అన్నారాయన. తెలుగు చిత్ర సీమలో ఆరోగ్యకరమైన హాస్యానికి చిరునామా జంధ్యాల. ఆయన చిత్రాల్లోని పాత్రలు.. గిలిగింతలు పెడతాయి, చెక్కిలిగింతలు పెడతాయి. పొట్టచెక్కలు చేస్తాయి, కిందపడి దొర్లేలా చేస్తాయి. అలాగే కన్నీళ్ళూ పెట్టిస్తాయి. నిజజీవితంలో మన కళ్ళముందే తిరుగుతాయి అలాంటి పాత్రలు. వాటినే అత్యంత సహజమైన రీతిలో వెండితెరపై సృష్టిచేసిన హాస్య బ్రహ్మ ఆయన. జంధ్యాల వీరవెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి అనే ఆ నవ్వుల విధాత వర్ధంతి నేడు (జూన్ 19). ఈ సందర్భంగా ఆయన సినీ జీవిత విశేషాల్ని ఒకసారి మననం చేసుకుందాం.


1951, జనవరి 14న పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో జన్మించారు జంధ్యాల. చిన్నప్పటినుంచి ఆయనకి నాటకాలపై ఎంతో ఆసక్తి. అందుకే ఆయన పలు నాటకాల్ని రచించారు. వాటికి మంచి ఆదరణ దక్కింది. ఆ ప్రతిభే ఆయన్ను సినీరంగంవైపుకు మళ్ళించింది. 1976లో విడుదలైన ‘దేవుడు చేసిన బొమ్మలు’ జంధ్యాల మాటలు రాసిన తొలి చిత్రం. ఆ తర్వాత ‘సిరిసిరిమువ్వ,  అడవిరాముడు,  శంకరాభరణం, సాగరసంగమం,  వేటగాడు, సప్తపది’ లాంటి ఎన్నో చిత్రాలకు ఆయన మాటలు రాశారు. అవన్నీ ఘన విజయం సాధించడంతో తెలుగునాట జంధ్యాల పేరు మారుమోగిపోయింది. ఆయన దాదాపు 85 చిత్రాలకు రచయితగా పనిచేయగా.. వాటిలో ఎనభై చిత్రాలు ఘన విజయం సాధించడం ఆయన ప్రతిభకు అసలైన నిదర్శనం. ఒక చేత్తో పక్కా మాస్ చిత్రం అడవిరాముడు, మరో చేత్తో అసలు సిసలు క్లాస్ చిత్రం ‘శంకరాభరణం’ చిత్రాలకు మాటలు రాయడం ఆయనకే చెల్లింది.  


‘ముద్దమందారం’ చిత్రంతో దర్శకుడిగా అవతారమెత్తారు జంధ్యాల. ఆయన మార్క్ హాస్యం, ఎమోషన్స్ తో తెరకెక్కిన ఆ ప్రేమకథా చిత్రం అద్భుత విజయం సాధించింది. ఆ తర్వాత దర్శకుడిగా జంధ్యాలకు తిరుగే లేకుండా పోయింది. ‘మల్లె పందిరి, నాలుగు స్థంబాలాట, శ్రీవారికి ప్రేమలేఖ, రెండు జెళ్ళసీత, మూడు ముళ్ళు, రావూ గోపాలరావూ, బాబాయ్ అబ్బాయ్, శ్రీవారి శోభనం, మొగుడూ పెళ్ళాలు, రెండు రెళ్ళుఆరు, చంటబ్బాయ్, వివాహ భోజనంబు, జయమ్ము నిశ్చయమ్మురా, అహనా పెళ్ళంట, సీతారామ కళ్యాణం, నీకు నాకు పెళ్ళంట, చూపులు కలిసిన శుభవేళ, హైహై నాయక, బావా బావా పన్నీరు’ లాంటి ఎన్నో హాస్య చిత్రాలు తెలుగు వారిని నవ్వుల్లో ముంచెత్తాయి.  ఎందరో హాస్యనటీనటుల్ని తెలుగు తెరకు పరిచయం చేసి వారిని స్టార్ కమెడియన్స్ గా మార్చిన ఘనత జంధ్యాలదే. 


అచ్చతెలుగు తిట్లను తన చిత్రాల్లోని పాత్రలతో పలికించి.. వాటిని తెలుగు జాతికి అంకింత చేశారు జంధ్యాల. అలాంటి తిట్లకు పేటెంట్ రైట్స్ ఆయనవే. అలాగే.. తన పాత్రలకు విచిత్రమైన మ్యానరిజమ్స్ , వింత వింత మనస్తత్వాల్ని సృష్టించి.. ప్రేక్షకులపై నవ్వుల దండయాత్ర చేయించారాయన. సిట్యువేషనల్ కామెడిని, అసభ్యతకు తావులేని సంభాషణలతో తెలుగు నాట ఆరోగ్యకరమైన కామెడీ పంటను పండించిన నవ్వుల కర్షకుడు ఆయన. వ్యంగ్యం, హాస్యం, చమత్కారం కలగలిపి.. వెండితెరపై హాస్యపు జల్లును కురిపించిన జంధ్యాల.. నవ్వు ఉన్నంవరకూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో కలకాలం నిలిచే ఉంటారు. 

Updated Date - 2022-06-19T17:26:03+05:30 IST

Read more