James Bond: 597 మందిని మట్టుపెట్టిన బాండ్
ABN, First Publish Date - 2022-10-30T16:05:29+05:30
సినిమాల్లో హీరో పాత్రలు ఎన్నయినా ఉండొచ్చు... కానీ కొందరు హీరోలను మాత్రం తరాలు మారినా మర్చిపోలేం...
సినిమాల్లో హీరో పాత్రలు ఎన్నయినా ఉండొచ్చు... కానీ కొందరు హీరోలను మాత్రం తరాలు మారినా మర్చిపోలేం. నల్లటి సూట్‌లో చేతిలో పిస్టల్ పట్టుకుని ‘బాండ్... జేమ్స్‌బాండ్’ అంటూ స్టయిలిష్‌గా కనిపించే క్యారెక్టర్‌ను ఎవరైనా ఎలా మర్చిపోగలరు. బ్రిటీష్ రచయిత ఇయాన్ ఫ్లెమింగ్ 1953లో సృష్టించిన ఈ క్యారెక్టర్ తొలిసారిగా ‘డాక్టర్ నో’గా 1962లో తెరకెక్కింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే అరవై ఏళ్లుగా సరికొత్త ‘బాండ్’లు తెరపై సవాళ్లు ఎదుర్కొంటూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూనే ఉన్నారు.
60 ఏళ్ల ‘బాండ్’ గురించిన కొన్ని ఆసక్తికర విశేషాలివి..
- బాండ్ సిరీస్‌లో 1962 నుంచి ఇప్పటిదాకా 25 సినిమాలు వచ్చాయి. ‘నో టైమ్ టు డై’ గత ఏడాది విడుదలయ్యింది. వీటిలో ఎక్కువసార్లు బాండ్‌గా కనిపించింది రోజర్‌మూర్ (7).
- ఈ డాషింగ్ ఏజెంట్‌కు ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనంత మంది అభిమానులున్నారు. వారిలో ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ కూడా ఒకరు. 1963 నవంబర్ 21న ఆయన వైట్‌హౌస్‌లో ‘ఫ్రమ్ రష్యా విత్ లవ్’ సినిమా చూశారు. ఆ మరుసటి రోజే ఆయన హత్యకు గురయ్యారు.
- గత ఏడాది విడుదలైన ‘నో టైమ్ టు డై’ వరకే జేమ్స్‌బాండ్ తెరపై 597 మందిని మట్టుబెట్టాడట.ః
- తొలి బాండ్ ప్రేయసిగా ఉర్సులా ఆండ్రెస్ నటించింది.
- జేమ్స్‌బాండ్‌గా ఎవరు కనిపిస్తారనే చర్చ ప్రతీ సినిమాకు హాట్‌హాట్‌గా జరుగుతూనే ఉంటుంది. 26వ సినిమాలో తొలిసారి బాండ్‌గా నల్ల జాతీయుడైన నటుడు ఇడ్రిస్ ఎల్బా కనిపిస్తాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
- బాండ్ సినిమాల్లో ఆయన ఉపయోగించే కార్లు, గ్యాడ్జెట్లు పాపులర్ అవుతాయి. అండర్‌వాటర్ కార్ (ది స్పై హూ లవ్డ్ మీ), జెట్ ప్యాక్ (థండర్‌బాల్), ఎక్స్‌రే సన్‌గ్లాసెస్ (ఆక్టోపసీ), మాగ్నటిక్ రిస్ట్‌వాచ్ (లైవ్ అండ్ లెట్ డై), రాకెట్ ఫైరింగ్ బూమ్‌బాక్స్ (ది లివింగ్ డే లైట్స్)ను ఎవరూ మర్చిపోలేరు.
- తొలిసారిగా జేమ్స్‌బాండ్ పాత్రలో సీన్ కానరీ కనిపించారు. ఆ తర్వాత రోజర్‌మూర్, తిమోతీ డాల్టన్, పియర్స్ బ్రాస్నన్, డేనియర్ క్రేగ్ పాపులర్ అయ్యారు.
- రోజర్‌మూర్ బాండ్‌గా కనిపించిన ‘ఆక్టోపసీ’లోని కొంత భాగాన్ని మనదేశంలోని ఉదయ్‌పూర్‌లో చిత్రీకరించారు. ‘స్కైఫాల్’ను కూడా ఇక్కడే చిత్రీకరించాల్సి ఉన్నప్పటికీ రైల్వేశాఖ అనుమతి నిరాకరణతో టర్కీకి వెళ్లారు.
- ఇప్పటిదాకా విడుదలైన బాండ్ సినిమాల్లో ‘థండర్‌బాల్’ వసూళ్లపరంగా అత్యధికంగా విజయవంతమైంది.
- 60 ఏళ్ల చరిత్రలో ‘బాండ్’గా పాపులర్ కానీ నటుడు జార్జ్ లాజెన్‌బీ మాత్రమే. ఆయన 1969లో ఒకే ఒక్క సినిమాలో కనిపించారు.
- ‘గోల్డ్ ఫింగర్’లో నటించిన గెర్ట్ ఫ్రోబ్ ‘బాండ్’ తొలి విలన్.