కొత్త ఒరవడికి శ్రీకారం

ABN , First Publish Date - 2022-12-29T00:44:13+05:30 IST

‘బిగ్‌ బాస్‌’ ఫేమ్‌ సయ్యద్‌ సోహైల్‌, మోక్ష హీరోహీరోయిన్లుగా నటించిన ‘లక్కీ లక్ష్మణ్‌’ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది...

కొత్త ఒరవడికి శ్రీకారం

‘బిగ్‌ బాస్‌’ ఫేమ్‌ సయ్యద్‌ సోహైల్‌, మోక్ష హీరోహీరోయిన్లుగా నటించిన ‘లక్కీ లక్ష్మణ్‌’ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. ఎ.ఆర్‌. అభి దర్శకత్వంలో హరిత గోగినేని ఈ సినిమాను నిర్మించారు. బుధవారం నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో బిగ్‌ టికెట్‌ను దర్శకుడు అభి తండ్రి గంగిరెడ్డి ఆవిష్కరించి, సోహైల్‌ తండ్రి సలీమ్‌కు అందజేశారు. ఈ నెల 31న విడుదలవుతున్న ‘కొరమీను’ చిత్రం టీమ్‌ను ఈ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు ఆహ్వానించి, కొత్త ఒరవడి తీసుకు వచ్చారు. ఈ రెండు సినిమాల యూనిట్స్‌ ఒకరికొకరు సపోర్ట్‌ అందించుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో హీరో సోహైల్‌ మాట్లాడుతూ ‘నేను ఈ స్థాయికి రావడానికి కారణం మా నాన్న. నాకు సినిమా తప్ప మరొకటి తెలీదు. నిర్మాత హరితగారు చిత్రాన్ని తనే విడుదల చేస్తున్నారు. దర్శకుడు అభి ఎంతో కష్టపడ్డారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం ఇది. మొదటి నుంచి చివరి వరకూ సినిమా చూసి నవ్వుతారు, ఏడుస్తారు’ అన్నారు. దర్శకుడు అభి మాట్లాడుతూ ‘థియేటర్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత మంచి సినిమా చూశామని ప్రేక్షకులు ఫీల్‌ అవుతారు. ‘నేను ఏమీ చేయలేను.. దేనికీ పనికి రాను’ అనే డిప్రషన్‌లో ఉన్న సమయంలో నిర్మాత హరిత నన్ను నమ్మి ఈ అవకాశం కల్పించారు. ఆమె సహా ప్రతి ఒక్కరూ చిత్రం కోసం కష్టపడ్డారు’ అన్నారు. ‘బడ్జెట్‌ పరంగా ఇది చిన్న సినిమానే అయినా, కంటెంట్‌ పరంగా పెద్ద సినిమా. మా ప్రతి చెమట చుక్కనీ డబ్బుగా మార్చి ఈ సినిమా తీశాం. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అన్నారు నిర్మాత హరిత. ఈ కార్యక్రమంలో బెక్కం వేణుగోపాల్‌, హీరోయిన్‌ మోక్ష, దేవీ ప్రసాద్‌, ఆర్‌.పి.పట్నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-29T00:44:13+05:30 IST

Read more