33 ఏళ్ల నాటి ఆ లేఖలో సల్మాన్‌ ఏం రాశారంటే...?

ABN , First Publish Date - 2022-12-28T02:50:21+05:30 IST

కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ తన 57వ పుట్టిన రోజుని మంగళవారం గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు.

33 ఏళ్ల నాటి ఆ లేఖలో  సల్మాన్‌ ఏం రాశారంటే...?

కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ తన 57వ పుట్టిన రోజుని మంగళవారం గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. ముంబై బాంద్రాలోని తన ఇంట్లో సల్మాన్‌ ఇచ్చిన పార్టీకి స్నేహితులు, శ్రేయోభిలాషులు, చిత్ర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన హీరోగా నటించిన తొలి చిత్రం ‘మైనే ప్యార్‌ కియా’ను చాలా మంది గుర్తు చేసుకున్నారు. చాలా కొద్ది మంది మాత్రం ఆ సినిమా విడుదలైన నాలుగు నెలలకు సల్మాన్‌ రాసిన భావోద్వేగపు లేఖను, అందులోని విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఇంతకీ ఆ లేఖలో సల్మాన్‌ ఏం రాశారు?

‘మైనే ప్యార్‌ కియా’ చిత్రం 1989 డిసెంబర్‌ 29న విడుదలైంది. అంతవరకూ చిన్న చిన్న వేషాలతో నెట్టుకొస్తున్న సల్మాన్‌ హీరోగా నటించిన తొలి సినిమా ఇదే. భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా ఘన విజయం సాధించి 1989లో హైయ్యెస్ట్‌ గ్రాసర్‌గా నిలిచింది. కల్ట్‌ క్లాసిక్‌గా పేరొందిన ‘మైనే ప్యార్‌ కియా’తో సల్మాన్‌ ఖాన్‌ ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయ్యారు. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకొనే అవసరం ఆయనకు కలగలేదు.

ఈ చిత్రం విడుదలైన నాలుగు నెలల తర్వాత సల్మాన్‌ తనని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ భావోద్వేగ లేఖ రాశారు. సొంత దస్తూరితో ఆంగ్లంలో రాసిన ఆ లేఖలో నన్ను నటుడిగా ఆదరిస్తున్న మీకు ధన్యవాదాలు. ఇకపై కూడా మీకు నచ్చే సినిమాలే చేస్తాను. నా కొత్త సినిమా ఎప్పుడు వచ్చినా అది తప్పకుండా మంచి సినిమా అవుతుందని మీకు హామీ ఇస్తున్నాను. భవిష్యత్‌లో కూడా మీరు నాపై ఇలాంటి అభిమానాన్ని చూపిస్తారని ఆశిస్తున్నాను. నా సినిమాలు మీరు చూడడం ఆపేస్తే అదే నా కెరీర్‌కు ఆఖరి రోజని భావిస్తా. ... ఇక నా వ్యక్తిగత జీవితం గురించి అంటారా.. దాని గురించి నేను మాట్లాడను. ఎందుకంటే దాని గురించి మీకు అందరికీ తెలుసు కనుక.

ఇలా సాగింది ఆ లేఖ. అప్పటికీ ఇప్పటికీ సల్మాన్‌లో మార్పు లేదు. తన వ్యక్తిగత జీవితం గురించి ఇప్పుడు కూడా మాట్లాడడం లేదు.

సంగీతకు సల్మాన్‌ ముద్దు

బర్త్‌డే పార్టీలో తన మాజీ ప్రేయసి సంగీత బిజ్లానీ మీద ప్రత్యేక శ్రధ్ద కనబర్చారు సల్మాన్‌. గతంలో దాదాపు పదేళ్ల పాటు సల్మాన్‌, సంగీత ప్రేమలోకంలో విహరించారు. బర్త్‌డే పార్టీకి వచ్చిన సంగీత కారు డోర్‌ను తన బాడీ గార్డ్‌ తీయబోతుంటే అతన్ని వారించి, తనే స్వయంగా తీశారు సల్మాన్‌. ఆమెను ఆలింగనం చేసుకుని, నుదిటి మీద ముద్దు పెట్టుకున్నారు. తిరిగి ఆమె వెళ్లిపోవడానికి కారులో కూర్చున్నప్పుడు ‘ఐ లవ్‌ యూ’ చెప్పారు సల్మాన్‌.

Updated Date - 2022-12-28T02:50:21+05:30 IST

Read more