సినిమా అంటే అయాన్‌కు ఎంత ప్రేమో!

ABN , First Publish Date - 2022-06-01T11:27:00+05:30 IST

రణబీర్‌ కపూర్‌, అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, అలియాభట్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొన్న ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా రణబీర్‌...

సినిమా అంటే అయాన్‌కు ఎంత ప్రేమో!

రణబీర్‌ కపూర్‌, అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున,  అలియాభట్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొన్న ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా రణబీర్‌, దర్శకుడు అయాన్‌, చిత్రసమర్పకుడు రాజమౌళి సోమవారం వైజాగ్‌ వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి ‘ఐకానిక్‌ మెలోడీ థియేటర్‌లో అభిమానులతో ముచ్చటించారు. ‘నాలుగేళ్ల క్రితం కరణ్‌జోహర్‌ నాకు ఫోన్‌ చేసి ‘ఒక పెద్ద సినిమా చేయబోతున్నాను. చిత్ర దర్శకుడు అయాన్‌ ముఖర్జీ మీకు కథ చెబుతారు. అది మీకు నచ్చితే సౌత్‌ ఇండియాలో ఈ సినిమాకు మిమ్మల్ని సమర్పకుడిగా అనుకుంటున్నాను...’ అన్నారు. తర్వాత అయాన్‌ను కలిశాను. ఆయన కథ చెప్పిన విధానం కంటే సినిమా మీద ఆయన పెంచుకున్న పెంచుకున్న ప్రేమ, తన ఎక్సయిట్మెంట్‌ చూసి చాలా ఇంప్రెస్‌ అయ్యాను. అప్పటివరకూ తను తీసిన విజువల్స్‌, ఇతర మెటీరియల్‌ చూశాక ఇండస్ట్రీకి  మరో పిచ్చోడు దొరికాడని అనుకున్నా. ఇంత పెద్ద సినిమాను స్ర్కీన్‌ మీదే చూడాలి అనే విధంగా తీశాడు. నాకు 20 నిముషాల సినిమానే చూపించాడు. అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి రెండు మెతుకులు ముట్టుకుంటే చాలు కదా. నాగార్జున గారంటే నాకు పర్సనల్‌గా చాలా ఇష్టం. అలాగే అలియా ఈ సినిమాలో ఉండడం దర్శకుడి అదృష్టం. రణబీర్‌ హృదయంలో ఆమె ఉండడం అతని అదృష్టం’ అన్నారు దర్శకుడు రాజమౌళి. చిత్ర దర్శకుడు అయాన్‌ ముఖర్జీ మాట్లాడుతూ ‘ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎన్నో హాలీవుడ్‌ సినిమాలు కామిక్‌ బుక్స్‌ ఆధారంగా తీసినవే. వాటితోనే అంత కంటెంట్‌ క్రియేట్‌ చేసి ఆదరణ పొందినప్పుడు , ఎన్నో గొప్ప గొప్ప కథలు, పురాణ ఇతిహాసాలు ఉన్న మన భారతీయ చరిత్ర గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఆలోచనకు రూపమే ఈ ‘బ్రహ్మస్త్ర’ చిత్రం’ అన్నారు. ఈ సమావేశంలో రాజమౌళికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన రణబీర్‌ కపూర్‌ ఆ తర్వాత అభిమానులతో ముచ్చటించారు. 


Updated Date - 2022-06-01T11:27:00+05:30 IST

Read more