సంక్రాంతికి పర్ఫెక్ట్ సినిమా ‘హీరో’
ABN, First Publish Date - 2022-01-07T03:51:45+05:30
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘హీరో’. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై గల్లా పద్మావతి..
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘హీరో’. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై గల్లా పద్మావతి నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 15న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాని మొదలుపెట్టి దాదాపు రెండేళ్లు అవుతోంది. సగం పూర్తి అయ్యేసరికి ఆల్పా, గామా, భీటా, డెల్టా, ఒమిక్రాన్ ఇలా అన్నింటిని చూశాం. గ్యాప్ దొరికినప్పుడల్లా షూటింగ్ చేస్తూ వచ్చాం. ఈ పరిస్థితులు ఎప్పుడు మారతాయో ఎవ్వరూ ఊహించలేరు. ఏది ఏమైనా మనం ముందుకు వెళ్లాల్సిందే. సినిమా ముందుకు జరగాల్సిందే. ఎన్ని సినిమాలు వాయిదా వేసుకున్నారో చూశాం. మా రెండేళ్ల నిరీక్షణకు ఇప్పుడు సరైన సమయం వచ్చింది. మా సినిమాకు ఈ సంక్రాంతి దొరికింది. కృష్ణగారు జనవరి 15న విడుదల చేయమని చెప్పేశారు. జనవరి 15న అశోక్‌ని, మా బ్యానర్‌ను పరిచయం చేయబోతోన్నాం. మీ అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాను. ఈ బ్యానర్‌ను కేవలం అశోక్ కోసమే పెట్టాం. నా రెండో కొడుకు సిద్దార్థ్‌కి కూడా సినిమా మీదే ఆసక్తి ఉన్నట్టుంది. ఈ సినిమా కోసం పద్మావతి ఎక్కువగా కష్టపడింది. సిద్దార్థ్, అశోక్ ముందు ముందు ఈ బ్యానర్‌ను ఎంత వరకే తీసుకెళ్తారనేది వారిష్టం..’’ అని అంటే.. పద్మావతి గల్లా మాట్లాడుతూ ‘‘డిస్ట్రిబ్యూటర్లంతా కూడా సాయం చేస్తున్నారని మా బాబాయ్ ఆదిశేషగిరి రావు చెప్పారు. అందుకే సినిమా ఇంత తక్కువ టైం ఉన్నా కూడా విడుదల చేస్తున్నాం. పండుగకు సినిమాలు చూసే ఆనవాయితీ ఉందని, నాగార్జునగారు కూడా వస్తున్నామని ప్రకటించారు. అందుకే మేం కూడా ధైర్యం చేసి సినిమాను జనవరి 15న తీసుకురాబోతోన్నాం. మా అశోక్‌ను, అతని టాలెంట్‌ను అందరికీ చూపించబోతోన్నాం. నిధి చక్కగా నటించింది. వారిద్దరి జోడి బాగుంది. మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. సినిమాలో అశోక్‌ను చూస్తుంటే నాన్న గారే ఎక్కువగా గుర్తొచ్చారు. యాక్షన్ సీక్వెన్స్‌లో అయితే మహేష్ కనిపించాడు’’ అని అన్నారు.
నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. ‘‘అశోక్‌కి ఇది మొదటి సినిమానే అయినా అద్భుతంగా నటించాడు. చాలా బాగా డ్యాన్స్ చేశారు. మొదటి సినిమాలా ఎక్కడా అనిపించదు. ప్రతీ ఒక్క ఎమోషన్‌ను అద్బుతంగా పోషించారు. శ్రీరామ్ ఆదిత్య గారు ఎంతో పర్ఫెక్షన్తో తీశారు. సినిమా చూస్తే మీకే అర్థమవుతోంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్’ అని తెలుపగా.. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ.. ‘‘సంక్రాంతికి థియేటర్లోకి వద్దామని మమ్మల్ని ప్రోత్సహించిన ఆదిశేషగిరి రావుగారికి థ్యాంక్స్. ముందుగా ఈ సినిమాను జనవరి 26న విడుదల చేద్దామని అనుకున్నాం. కానీ కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. దాంతో మాకు సంక్రాంతి దొరికింది. ఇలాంటి సినిమాకు, కంటెంట్‌కు సంక్రాంతి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ డేట్ మాకు దొరకడం అదృష్టం. ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి శుభాలే ఎదురవుతున్నాయి. అశోక్‌కి ఇది మొదటి సినిమాలా ఎక్కడా అనిపించదు. ఈ సినిమాతో నాకు బ్రదర్ దొరికాడు. గల్లా ఫ్యామిలీ నా ఫ్యామిలీలా అయిపోయింది. కథకు ఈ టైటిల్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఫస్ట్ సినిమా కదా? అని హీరో టైటిల్ పెట్టలేదు. మేం ఎంత పాజిటివ్‌గా ఈ సినిమా తీశామో.. మీకు అర్థమవుతోంది. విజిల్ వేసే సీన్స్ ఇందులో ఉంటాయి. పండుగ సినిమా అంటే.. పర్ఫెక్ట్ పండుగ సినిమాతోనే వస్తున్నాం. నిధి, అశోక్ కలిసి ఓ మాస్ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు వేశారు. త్వరలోనే ఆ పాటను విడుదల చేస్తాం. సినిమాను చూస్తే అందరికీ పండుగ ఫీలింగ్ వస్తుంది’’ అని తెలిపారు.
అశోక్ గల్లా మాట్లాడుతూ.. ‘‘నా కల నిజమవుతున్నట్టు అనిపిస్తోంది. సంక్రాంతికి రాబోతోన్నామని తెలిసినప్పటి నుంచి మా ఎనర్జీ వేరే లెవెల్‌కి వెళ్లింది. పాటను రిలీజ్ చేశాక.. తాతగారి ఫ్యాన్స్, మహేష్ బాబు గారి ఫ్యాన్స్, నార్మల్ ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. ఇలాంటి సినిమాను పండుగకు తీసుకురావాలని అనుకున్నాం. మేం ఎంత ఎంజాయ్ చేస్తూ సినిమాను తీశామో.. ఆడియెన్స్ కూడా అంతే ఎంజాయ్ చేస్తే మా టార్గెట్ రీచ్ అయినట్టే. చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించినప్పుడే నాకు నటన మీద ఇంట్రెస్ట్ పుట్టింది. సినిమా చేసేటప్పుడు ఎలాంటి ఒత్తిడిని తీసుకోలేదు. కానీ విడుదల రోజు మాత్రం అది ఉంటుంది. ఈ సినిమాలో కృష్ణగారు, మహేష్ బాబుగారు ఎలాంటి ప్రత్యేక పాత్రలో కనిపించరు’’ అని అన్నారు.