కోలుకో... కృష్ణయ్యా...!

ABN , First Publish Date - 2022-11-15T06:04:41+05:30 IST

‘సూపర్‌ స్టార్‌ కృష్ణకు ఏమైంది..? ఇప్పుడు ఎలా ఉంది..?’ అందరి ఆందోళనా ఇదే. ఎనభై ఏళ్ల అలుపెరుగని ప్రయాణం, ఐదు వసంతాల సినీ అనుభవం....

కోలుకో... కృష్ణయ్యా...!

‘సూపర్‌ స్టార్‌ కృష్ణకు ఏమైంది..? ఇప్పుడు ఎలా ఉంది..?’ అందరి ఆందోళనా ఇదే. ఎనభై ఏళ్ల అలుపెరుగని ప్రయాణం, ఐదు వసంతాల సినీ అనుభవం.. ఇప్పుడు ఆసుపత్రి పడక  మీద అతికష్టమ్మీద శ్వాస తీసుకొంటోంది. కృష్ణ ఆరోగ్యం అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉందని చెబుతున్న వైద్యుల మాటలు... అభిమానుల్ని మరింత ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. కృష్ణ త్వరగా కోలుకోవాలని ప్రపంచం నలుమూలల ఉన్న ఆయన అభిమానులు ముక్కోటి దేవతలకు మొక్కుకొంటున్నారు.  సూపర్‌ స్టార్‌ ఎప్పటిలా నవ్వుతూ... ఆసుపత్రి నుంచి బయటకు వస్తుంటే చూడాలని చిత్రసీమ మొత్తం కోరుకొంటోంది.


పోరాటం కృష్ణకు కొత్తేం కాదు. అది ఆయన జీవితంలో మమేకమై చాలా ఏళ్లయ్యింది. ఎలాంటి నేపథ్యమూ లేకుండా చిత్రసీమలో అడుగుపెట్టినప్పుడే... పోరాట స్ఫూర్తి మొదలైంది. అంచెలంచెలుగా ఎదిగి.. ‘సూపర్‌ స్టార్‌’ అవ్వడం వెనుక ఏకంగా ఓ యుద్ధమే ఉంది. ప్రయోగాలకు నెరవకుండా, ఓటమికి భయపడకుండా ముందడుగు వేయడంలో ఎనలేని మొండితనముంది. ఇప్పుడు కూడా అవన్నీ కృష్ణ తోడుండాలని, ఉండాలన్నది అభిమానుల ఆశ.. ఆకాంక్ష. 


గండాలెన్నో దాటి....

ఊటీలో ‘సిరిపురం మొనగాడు’  షూటింగ్‌ జరుగుతోంది. ఓ యాక్షన్‌ సీన్‌.. సెట్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఫిరంగులో మందుగుండు దూర్చి.. పేలిస్తే... విస్ఫోటనం జరగాలి.. ఇదీ సీను. ఎప్పటిలా కృష్ణ ఉత్సాహంగా బరిలోకి దిగారు. ‘యాక్షన్‌...’ అంటూ దర్శకుడు కె.ఎస్‌.ఆర్‌.దాస్‌  గట్టిగా అరవడం ఆలస్యం... కృష్ణ చక చకా రంగంలో దూకారు. మందు గుండు ఫిరంగిలో కూరిస్తే.. అనూహ్యంగా ముందుకు వెళ్లాల్సిన ఆ మంట.. వెనుకున్న . కృష్ణవైపుకు దూసుకొచ్చింది. ఆ అనూహ్య పరిణామానికి కృష్ణ నివ్వెరబోయి కళ్లు తిరిగి కింద పడ్డారు. అంతే స్పాట్‌లో  అంతా షాక్‌. అదృష్టం బాగుండడంతో ప్రాణాలతో  బయటపడ్డారు కృష్ణ.


కృష్ణకు నీటి గండం ఉందట. కృష్ణ మాతృమూర్తి ఇదే మాట బలంగా నమ్మారు. కృష్ణ ఎప్పుడు షూటింగ్‌ కి బయల్దేరినా.. ‘నీటికి సంబంధించిన సీన్లు ఏం లేవు కదా’ అని ఆరా తీసేవార్ట. కృష్ణకు నీటి గండం ఉందన్న సంగతి... సినీ ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. ఓసారి నిజంగానే కృష్ణ నీటి గండంలో చిక్కుకొన్నారు కూడా. ఈ ఘటన.. ‘జన్మ జన్మల బంధం’ షూటింగ్‌ సమయంలో జరిగింది. అందులో వాణిశ్రీ కథానాయిక. అయితే ఆ సమయంలో... కృష్ణ, వాణీశ్రీలకు మాటల్లేవు. షూటింగ్‌లో సన్నివేశం కోసం.. ఇద్దరూ నవ్వుతూ, రొమాన్స్‌ చేస్తూ కెమెరా ముందు నటిస్తున్నారంతే. ‘కట్‌’ చెప్పగానే ఎవరి దారి వాళ్లది. ఓరోజు.. నీటి ప్రవాహంలో ఓ సన్నివేశం తీయాల్సివచ్చింది. కృష్ణ నీళ్లలో దూకి వాణిశ్రీని కాపాడాల్సిన సన్నివేశం అది. అసలే.. కృష్ణకు నీటి గండం ఉంది. అయినా సరే.. నీటిలో దూకారు. కానీ.. అదుపు తప్పి మునిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సరిగ్గా అప్పుడే వాణిశ్రీ తన బలాన్నంతా ఉపయోగించి.. కృష్ణ నీటిలో మునిగిపోకుండా అడ్డుకొన్నారు. 


ఎన్టీఆర్‌ - కృష్ణల స్నేహం గురించి తెలిసినవాళ్లకు వారిద్దరి మధ్య ఉన్న ‘గ్యాప్‌’ గురించి కూడా తెలుసు. ఇద్దరి పార్టీలు వేరు, సిద్ధాంతాలు వేరు. ఎన్టీఆర్‌కి వ్యతిరేకంగా, కాంగ్రెస్‌కి మద్దతుగా కృష్ణ ఓసారి ఎన్నికల సభలో పాల్గొంటే... అక్కడి ఎన్టీఆర్‌ అభిమానులు కృష్ణపై రాళ్లు విసిరారు. ఆ సమయంలో కృష్ణ కంటికి గాయమైంది. చివరికి ఆపరేషన్‌ చేయాల్సివచ్చింది. ఇలాంటి ఆటుపోట్లు.. మరణ గండాలు కృష్ణ జీవితంలో చాలానే చూశారు. కానీ... ప్రతీసారీ ధైర్యంగా పోరాడారు. మళ్లీ మామూలు మనిషి అయ్యారు. ఇప్పుడు కూడా కృష్ణ అదే స్ఫూర్తి చూపిస్తారన్నది అందరి ఆశ. కృష్ణ ఎప్పుడూ అభిమానుల గురించే ఆలోచిస్తారని అంతా అంటుంటారు. అది నిజం కూడా. ఇప్పుడు కూడా అంతే. ఆయన అభిమానుల కోసమైనా... సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా తిరిగి రావాలి.


Updated Date - 2022-11-15T06:04:41+05:30 IST

Read more