గీత గోవిందం, పోకిరి కలిపితే..‘సర్కారు వారి పాట’

ABN , First Publish Date - 2022-04-30T06:06:19+05:30 IST

దర్శకుడి ఆలోచనల్ని ఓ సక్రమమైన పద్ధతిలో అందంగా పేర్చే బాధ్యత ఎడిటర్‌దే. సెట్లో దర్శకుడు ఎంత మొండిగా ఉండాలో..

గీత గోవిందం, పోకిరి కలిపితే..‘సర్కారు వారి పాట’

దర్శకుడి ఆలోచనల్ని ఓ సక్రమమైన పద్ధతిలో అందంగా పేర్చే బాధ్యత ఎడిటర్‌దే. సెట్లో దర్శకుడు ఎంత మొండిగా ఉండాలో, ఎడిటింగ్‌ రూమ్‌ దగ్గర ఎడిటర్‌ అంత పట్టు చూపించాలి. సినిమాని ప్రేక్షకుల దృష్టి కోణంలో చూసి, కతెర్లు వేసేది ఎడిటరే. దర్శకుడు ఆ సీన్‌ని ఎంత ప్రేమించి తీసినా, కథలో ఇమడకపోతే, ఎడిటర్‌ ‘కట్‌’ చెప్పాల్సిందే. అలా వందలాది చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసి, ఆయా విజయాల్లో కీలక పాత్ర పోషించారు మార్తాండ్‌ కె. వెంకటేష్‌. ఆయన జడ్జిమెంట్‌కి తిరుగులేదని ఇండస్ర్టీలో టాక్‌. ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’కు ఎడిటర్‌గా పనిచేశారు. మే 12న ఈ చిత్రం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మార్తాండ్‌ చెప్పిన విషయాలివి.


‘‘పరశురామ్‌ కథలన్నీ క్లాస్‌ టచ్‌తో సాగుతాయి. కానీ ‘సర్కారు వారి పాట’ హై ఓల్టేజీతో సాగే మాస్‌ సినిమా. మహేష్‌ ‘పోకిరి’కి నేనే ఎడిటర్‌ని. పరశురామ్‌ ‘గీత గోవిందం’కీ నేనే పనిచేశా. ఆ రెండు సినిమాలూ కలిపితే ఎలా ఉంటుందో ‘సర్కారు వారి పాట’ అలా ఉంటుంది. ‘పోకిరి’ని ఎడిట్‌ చేస్తున్నప్పుడు ‘ఈ సినిమా సూపర్‌ హిట్‌ అవుతుందని’ చెప్పా. అలానే జరిగింది. ఇప్పుడూ అలాంటి నమ్మకమే కలుగుతోంది. ‘పోకిరి’ని మించిపోయే సినిమా అవుతుందన్నది నా అంచనా. ఈ సినిమాలో మాస్‌ అంశాలతో పాటు చక్కటి సందేశం ఉంటుంది. అది అందరికీ కనెక్ట్‌ అవుతుంది. ఇది వరకటి సినిమాల్లో కంటే మహేష్‌ చాలా అందంగా కనిపిస్తారు’’


‘‘హీరో, హీరోయిన్ల పాత్రలకు ప్రేక్షకుడు కనెక్ట్‌ అయితే ఆ సినిమా హిట్టే. ‘సర్కారు వారి పాట’లో ఆ మ్యాజిక్‌ ఉంటుంది. మహేష్‌ పాత్రని ప్రేమించేస్తాం. కీర్తి సురేష్‌ని  చూస్తే ‘ఇలాంటి అమ్మాయి మనక్కూడా దొరికితే బాగుంటుంది’ అనిపిస్తుంది. వారిద్దరి కెమిస్ర్టీ బాగా కుదిరింది. లవ్‌ ట్రాక్‌ చాలా ఫన్నీగా ఉంటుంది. ఇవన్నీ ఈ సినిమాకి ప్లస్‌ పాయింట్స్‌గా మారాయి. పైగా నిర్మాతలు ఈ సినిమాని చాలా రిచ్‌గా తీశారు. విజువల్‌గా చాలా బాగుంటుంది’’


‘‘ఇప్పటి వరకూ 450 సినిమాలకు పనిచేశా. ‘రాజకుమారుడు’, ‘టక్కరి దొంగ’, ‘పోకిరి’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వీటికి నేనే ఎడిటర్‌ని. పరశురామ్‌తో చాలా కాలంగా ప్రయాణం చేస్తున్నా. తను చాలా మంచి రచయిత. హీరో పాత్రని ప్రేమిస్తాడు. అందుకే తెరపై తన హీరోలు అంత బాగుంటారు. ‘సర్కారు వారి పాట’లోనూ మహేష్‌ పాత్రని బాగా తీర్చిదిద్దారు’’


‘‘రీలు నుంచి డిజిటల్‌ యుగంలోకి వచ్చాం. అప్పట్లో యేడాదికి పది సినిమాలకు ఎడిట్‌ చేస్తే గొప్ప. ఇప్పుడు వేగం పెరిగింది. ఇరవై సినిమాల వరకూ పనిచేసే సౌలభ్యం ఉంది. అయితే రీలు రోజుల్లోనే ఎడిటర్‌కి విలువ, గౌరవం ఎక్కువగా ఉండేవి. ఎవరు రష్‌ చూడాలన్నా.. ఎడిటర్‌ రూమ్‌లోకి రావాల్సిందే. ఇప్పుడు అలా కాదు. సెట్లోనే ఎడిట్‌ చేసి చూసుకుంటున్నారు. దర్శకుడు - ఎడిటర్‌ మధ్య అవగాహన చాలా ముఖ్యం. అవుట్‌ పుట్‌ కోసం గొడవలు పడడం సహజమే. అదంతా మంచి సినిమా కోసం. నేను పనిచేసిన దర్శకులంతా నా అభిప్రాయాన్ని గౌరవిస్తారు’’

Updated Date - 2022-04-30T06:06:19+05:30 IST