దనుష్ - ఐశ్వర్యలకు హైకోర్టులో ఊరట
ABN , First Publish Date - 2022-07-15T13:43:03+05:30 IST
కోలీవుడ్ హీరో ధనుష్, ఆయన మాజీ భార్య, సూపర్‌స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్యలకు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. వారిద్దరూ కోర్టులో

- వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు
- సర్కారు కౌంటరుకు ఆదేశం
అడయార్(చెన్నై), జూలై 14: కోలీవుడ్ హీరో ధనుష్, ఆయన మాజీ భార్య, సూపర్‌స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్యలకు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. వారిద్దరూ కోర్టులో నేరుగా హాజరుకావాలని సైదాపేట 18వ మేజిస్ట్రేట్ కోర్టు జారీ చేసిన ఆదేశాలను నిలుపుదల చేస్తూ గురువారం ఆదేశించింది. ధనుష్ హీరోగా ‘వేలైయిల్లా పట్టాదారి’ అనే చిత్రాన్ని తమ సొంత నిర్మాణ సంస్థ వండర్బాయ్స్ బ్యానరులో నిర్మించారు. దీని డైరెక్టర్లుగా ధనుష్, ఐశ్వర్య ఉన్నారు. అయితే, ఈ సినిమాలోని పొగత్రాగే సన్నివేశాలు ఉండగా, ఇవి తెరపై కనిపించే సమయంలో ‘పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం’ అనే ప్రకటన వేయలేదు. దీంతో తమిళనాడు పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ కంట్రోల్ డైరెక్టరు డాక్టర్ వీకే పళని గతంలో సైదాపేట 18వ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన కోర్టు జూలై 15వ తేదీ శుక్రవారం కోర్టులో నేరుగా హాజరుకావాలని ధనుష్, ఐశ్వర్యలను ఆదేశించింది. ఈ ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ వారు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై గురువారం విచారణ జరిపిన హైకోర్టు.. ధనుష్, ఐశ్వర్యలకు ఊరటనిచ్చేలా ఆదేశాలు జారీచేసింది. అలాగే, ఈ కేసులో ప్రభుత్వం కౌంటరు దాఖలు చేసేలా నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.