Closer to Oscar : ఆస్కార్‌కు మరింత చేరువలో..

ABN , First Publish Date - 2022-12-23T04:39:45+05:30 IST

ఆస్కార్‌ అవార్డుల వేడుక జరిగే సమయం దగ్గర పడుతున్న కొద్దీ సినిమా వాళ్లలో ఉత్కంఠ పెరుగుతోంది. తాజాగా గురువారం ఆస్కార్‌ కమిటీ పది విభాగాల్లో షార్ట్‌ లిస్ట్‌ను...

Closer to Oscar : ఆస్కార్‌కు మరింత చేరువలో..

ఆస్కార్‌ అవార్డుల వేడుక జరిగే సమయం దగ్గర పడుతున్న కొద్దీ సినిమా వాళ్లలో ఉత్కంఠ పెరుగుతోంది. తాజాగా గురువారం ఆస్కార్‌ కమిటీ పది విభాగాల్లో షార్ట్‌ లిస్ట్‌ను ప్రకటించింది. ఇందులో మనదేశం నుంచి నాలుగు ఎంట్రీలు ఉండడం ఒక విశేషమైతే, వాటిల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట కూడా ఉండడం మరింత విశేషం. షార్ట్‌ లిస్ట్‌ ద్వారా ఆస్కార్‌లో మనదేశానికి ఇలాంటి అవకాశం లభించడం ఇదే ప్రథమం. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంతో పాటు గుజరాతీ చిత్రం ‘చల్లో షో’ కూడా ఈ షార్ట్‌ లిస్ట్‌లో ఉండడం గమనార్హం. డాక్యుమెంటరీ, ఫీచర్‌ ఫిల్మ్‌, డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌, ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌, మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టయిల్‌, మ్యూజిక్‌ (ఒరిజనల్‌ స్కోర్‌), మ్యూజిక్‌ (ఒరిజనల్‌ సాంగ్‌), యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌, లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌, సౌండ్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌... ఇలా మొత్తం పది విభాగాల్లో షార్ట్‌ లిస్ట్స్‌ ప్రకటించింది ఆస్కార్‌ కమిటీ. ప్రతి విభాగంలో పది నుంచి పదిహేను ఎంట్రీలు ఉంటాయి. వీటిల్లో ఓటింగ్‌ ద్వారా ఫైనల్‌ నామినేషన్లను జనవరి 24న వెల్లడిస్తారు. లాస్‌ ఏంజిల్స్‌లో మార్చి 12న జరిగే ఆస్కార్‌ వేడుకలో విజేతలను ప్రకటిస్తారు. ఆస్కార్‌ వెబ్‌ సైట్‌లో పేర్కొన్న సమాచారం ప్రకారం ‘నాటు నాటు’ పాటకు 14 పాటల నుంచి గట్టి పోటీ ఉంది. వీటిల్లో ‘అవతార్‌.. ద వే ఆఫ్‌ వాటర్‌’ చిత్రంలోని ‘నథింగ్‌ ఈజ్‌ లాస్ట్‌’ పాట కూడా ఉండడం గమనార్హం. ఇప్పటికే గోల్డెన్‌ గ్లోబ్‌, క్రిటిక్స్‌ ఛాయిస్‌ వంటి అంతర్జాతీయ అవార్డులను పొందిన ‘నాటు నాటు’ పాటను ఆస్కార్‌ వరిస్తుందా లేదా అన్నది కొద్ది రోజుల్లో తేలిపోతుంది.

Updated Date - 2022-12-23T06:24:12+05:30 IST