మళ్లీ రాని... మహా నటుడు

ABN , First Publish Date - 2022-12-24T00:47:00+05:30 IST

కైకాల సత్యనారాయణ కేవలం నటుడే కాదు.. తెలుగు వారి జ్ఞాపకం. వందల చిత్రాల్లో నటించి, మెప్పించి, మనసుల్లో చెరగని ముద్ర వేసిన ఘనుడు...

మళ్లీ రాని... మహా నటుడు

కైకాల సత్యనారాయణ కేవలం నటుడే కాదు.. తెలుగు వారి జ్ఞాపకం. వందల చిత్రాల్లో నటించి, మెప్పించి, మనసుల్లో చెరగని ముద్ర వేసిన ఘనుడు... కైకాల. ఆయన మరణం.. చిత్రసీమకు పెను విషాదం. కైకాల ఇక లేరు అనే వార్త.. దేశమంతటినీ దిగ్భారంతిలో పడేసింది. సినీ. రాజకీయ ప్రముఖులు ఆ మహా నటుడి మృతికి సంతాపం వ్యక్తం చేశారు.

అనేక తరాలకు చిర పరిచితులు

‘‘ప్రసిద్ద సినీ దిగ్గజం కైకాల సత్యనారాయణ మృతి పట్ల చింతిస్తున్నాను. విభిన్న పాత్రలతో, అద్భుతమైన నటనా చాతుర్యంతో అనేక తరాల ప్రేక్షకులకు ఆయన చిర పరిచితులు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి’’

ట్విట్టర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ

చెరగని ముద్ర వేశారు

‘‘తన అద్వితీయమైన నటనతో కైకాల తనకంటూ ఒక చెరగని ముద్ర వేశారు. ఎంపీగా ప్రజా సంక్షేమానికి పాటు పడ్డారు. నవరస సార్వభౌమునిగా భారతీయ సినిమాకు, మరీ ముఖ్యంగా తెలుగు సినిమాకు ఆయన చేసిన కృషి చిరస్థాయిగా మిగిలిపోతుంది.’’

తమిళ సై (తెలంగాణ గవర్నర్‌)

లోక్‌సభలో వాణిని వినిపించారు

కైకాల సత్యనారాయణ 777 చిత్రాల్లో, తన నటనతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. మచిలీపట్నం పార్లమెంటు సభ్యునిగా లోక్‌సభలో ప్రజా సమస్యలపై తన వాణిని వినిపించారు.

విశ్వ భూషణ్‌ హరిచందన్‌ (ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌)

కుటుంబ పెద్దను కోల్పోయా

‘‘కుటుంబ పెద్దను కోల్పోయాను. అన్నయ్యా అంటూ నన్ను అప్యాయంగా పిలిచే వ్యక్తి లేడు అనేది జీర్ణించుకులేకపోతున్నా. ఎప్పుడు కలిసిన అప్యాయంగా పలకరించేవాడు. అవకాశం లభించినప్పుడల్లా కైకాల ఇంటికి వెళ్లి కలిసేవాడిని. ఓ సందర్భంలో ఉప్పుచాపతో భోజనం పంపమని చెప్పారు. రెండు నెలల క్రితం కూడా ఆసుపత్రిలో ఉన్న కైకాలను పరామర్శించాను. వ్యక్తిగతంగా చాలా కోల్పోయిన భావన కలుగుతోంది.’’

చిరంజీవి

అజాత శత్రువు

‘‘అజాత శత్రువు లాంటి కైకాల సత్యనారాయణను కోల్పోయాం. ఎప్పుడు కలిసినా అప్యాయంగా పలుకరించేవారు. కోపం అనేది ఎప్పుడూ చూడలేదు.’’

పవన్‌ కళ్యాణ్‌

నా మొదటి కథను కైకాలకే చెప్పాను

‘‘నేను సినీ పరిశ్రమకు వచ్చాక నా మొదటి కథను కైకాల సత్యనారాయణకే వినిపించాను. ఆయన రమా ఫిల్మ్ప్‌ అనేక హోదాల్లో పనిచేశాను. పరిపూర్ణమైన జీవితాన్ని గడిపారు. ఎక్కడ మచ్చ లేకుండా సినీ ప్రస్థానాన్ని కొనసాగించారు. ఆయన మరణం తీరని లోటు.’’

త్రివిక్రమ్‌

మేటి నటుడు కైకాల..

‘‘కైకాల సత్యనారాయణ అకాల మరణం దిగ్ర్భాంతికి గురిచేసింది. విభిన్న పాత్రల్లో నటించి, విలక్షణ నటనతో అభిమానులతో నవరస నటనా సార్వభౌమ అనిపించుకున్న మేటినటులు. ఆరు దశాబ్దాల సినీ జీవితంలో ఎన్టీఆర్‌తో ఆయనకున్న అనుబంధం సొంత అన్నదమ్ముల బంధం కన్నా ఎక్కువ. కైకాల మరణం సినీరంగానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’.

చంద్రబాబునాయుడు, టీడీపీ జాతీయ అధ్యక్షుడు

నా చిత్రాల్లో మంచిపాత్రలు పోషించారు

‘‘ఆరు దశాబ్దాల పాటు తెలుగు సినిమా రంగంలో పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రల్లో నవరస నటనా సార్వభౌముడిగా తన వైవిధ్యమైన నటనతో అలరించారు. మా కుటుంబంతో ఆయనకు స్నేహ సంబంధాలున్నాయి. నాన్నగారితో కలిసి ఎన్నో సినిమాల కోసం పనిచేశారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. మంచి నటుడిగానే కాకుండా పార్లమెంట్‌ సభ్యుడిగా తనదైన ముద్రవేశారు. సినీజీవితం, ప్రజాజీవితంలోనూ ఎంతో బాధ్యతాయుతంగా ఆయన అందించిన సేవలు మరు వలేనివి.’’

బాలకృష్ణ

సినీ పరిశ్రమకు తీరని లోటు

‘‘విలక్షణ నటనతో విభిన్న పాత్రలకు జీవం పోసిన ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తూ.. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.’’

నారా లోకే శ్‌, టీడీపీ నాయకుడు

కైకాల మరణవార్త కలచివేసింది

‘‘కైకాల సత్యనారాయణ అకాల మరణవార్త నన్ను కలచివేసింది. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.’’

రామ్‌చరణ్‌

నా హృదయాన్ని ముక్కలు చేసింది

‘‘తెలుగు సినీ పరిశ్రమలో నేను అభిమానించే నటుల్లో ఒకరైన కైకాల సత్యనారాయణ మరణం నా హృదయాన్ని ముక్కలు చేసింది. మన ఇంటిలో మనిషిలా ఆయన అందరితో కలిసిపోయేవారు.’’

నాని

అత్యుత్తమ నటుల్లో ఒకరు

‘‘కైకాల మరణం అత్యంత బాధాకరం. ఆయన మృతితో దుఃఖంలో మునిగిపోయాం. భారతీయ సినిమాలు చూసిన అత్యుత్తమ నటుల్లో ఆయన ఒకరు.’’

రవితేజ

బహుముఖ ప్రజ్ఞాశాలి

‘‘పొద్దున్నే భయంకరమైన వార్తతో మేల్కొన్నాను. కైకాల సత్యనారాయణ లెజండరీ యాక్టర్‌. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన నటన రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది.’’

సాయిధరమ్‌తేజ్‌

సత్యనారాయణ మృతి బాధాకరం

‘‘కైకాల సత్యనారాయణ మృతి చాలా బాధాకరం. ఆయనతో పనిచేసిన మధుర జ్ఞాపకాలు నాకు చాలా ఉన్నాయి. ఆయనను చాలా మిస్‌ అవుతాను. ఆయన కుటుంబసభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి.’’

మహేశ్‌బాబు

నటనకు నిఘంటువు

‘‘ఈ విషాద వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. నటనకు నిఘంటువు కైకాల సత్యనారాయణ. ఆయన స్థానం చిత్రసీమలో ఎప్పటికీ చెక్కు చెదరదు’’

జయప్రద

ఎవరూ భర్తీ చేయలేరు

‘‘ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన సత్యనారాయణగారు మన మధ్య లేకపోవడం ఎప్పటికీ తీరని లోటే. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు’’

ఎన్టీఆర్‌

తీరని లోటు...

‘‘విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ మరణం బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. కైకాల మరణం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు.’’

షర్మిల, వైఎ్‌సఆర్‌టీపీ అధినేత్రి

హృదయాల్లో మిగిలే ఉంటారు..

‘‘విలక్షణ పాత్రలు పోషించడం ద్వారా తెలుగు ప్రజల హృదయాల్లో కైకాల స్థానం సంపాదించారు. ఆయన ఎప్పటికీ మన మనసుల్లోనే ఉంటారు.’’

రేవంత్‌రెడ్డి

Updated Date - 2022-12-24T00:47:01+05:30 IST