Auto Jaani: పూరి జగన్నాథ్‌కి మాటిచ్చేశారు

ABN , First Publish Date - 2022-10-15T16:28:35+05:30 IST

దర్శకుల్లో పూరి జగన్నాథ్‌ ఒక బ్రాండ్‌. హిట్‌ ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటారాయన. అతి తక్కువ సమయంలో క్వాలిటీ సినిమా తీయగలిగే సత్తా ఉన్న దర్శకుడు.

Auto Jaani: పూరి జగన్నాథ్‌కి మాటిచ్చేశారు

దర్శకుల్లో పూరి జగన్నాథ్‌ (Puri jaganadh)ఒక బ్రాండ్‌. హిట్‌ ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటారాయన. అతి తక్కువ సమయంలో క్వాలిటీ సినిమా తీయగలిగే సత్తా ఉన్న దర్శకుడు. ఇండస్ట్రీ హిట్లు అతని ఖాతాలో ఉన్నాయి. అందుకే పూరికి వరుసగా ఫ్లాపులున్న ఆయన్ని అభిమానించేవారు మాత్రం అతని బ్రాండ్‌ వాల్యూ ఏ మాత్రం తగ్గదంటారు. ‘లైగర్‌’తో పరాజయాన్ని తర్వాత వాట్‌ నెక్ట్స్‌ అని మరో సినిమాపై దృష్టిపెట్టారు. అలాగే చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రంలో అతిథిగా ఓ కీలక పాత్ర పోషించి ఆ సినిమా సక్సెస్‌ క్రెడిట్‌లో భాగమయ్యారు. అయితే పూర్తి మీడియా ముందుకు ఎప్పుడు వచ్చినా చిరంజీవితో ‘ఆటోజానీ’ (Auto Jaani) ప్రస్తావన రాకమానదు. చిరు కోసం ఆయన ఎంతో ఇష్టంగా రాసుకున్న కథ అది. చిరంజీవి కమ్‌బ్యాక్‌ చిత్రం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఆటోజానీ కూడా ఓ ఆప్షన్‌గా ఉంది. చిరంజీవి ఓకే చేసిన కథ అది. అయితే సెకెండాఫ్‌ కాస్త తేడాగా ఉండడం వల్ల ఆ కథ పక్కకు జరిగింది. పూరి జగన్నాథ్‌ మాత్రం ‘ఆటోజానీ చేసే తీరతా అని ఆ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ చెబుతున్నాడు. ‘గాడ్‌ఫాదర్‌’ ప్రమోషన్‌లో భాగంగా చిరు, పూరి ఇన్‌స్టాగ్రామ్‌లో చిట్‌ చాట్‌ జరిగింది. మాటల్లో ‘ఆటోజానీ’ టాపిక్‌ వచ్చింది. ‘నా ఆటోజానీ ఏం చేశావ్‌ పూరి.. ఉందా? లేక ఆ పేజీ చించేశావా’ అని అడిగారు చిరు. ‘లేదు అన్నయ్య..  ఆ కథ పాతదై పోయింది. మీ కోసం ఇంకో  కథ రాస్తున్నా. త్వరలోనే కలుస్తా’’ అని పూరి జగన్‌ చెప్పారు. అందుకు చిరంజీవి ‘నువ్వు ఎప్పుడైనా రావొచ్చు. నీ సినిమా కోసం నేను ఎదురు చూస్తుంటా’ అని మాటిచ్చారు. దీనిని బట్టి మళ్లీ.. పూరికి చిరు సినిమాపై ఆశలు చిగురించినట్లే అని అభిమానులు చెప్పుకుంటున్నారు. 


Updated Date - 2022-10-15T16:28:35+05:30 IST