బిర్యానీ.. ఆ టేస్టే వేరు
ABN , First Publish Date - 2022-09-21T06:28:08+05:30 IST
తెలుగులో ఉత్తరాది భామల హవానే ఎక్కువ. ఒకట్రెండు సినిమాలు చేస్తే చాలు... వాళ్లూ తెలుగు అమ్మాయిల్లానే కలిసిపోతారు...

తెలుగులో ఉత్తరాది భామల హవానే ఎక్కువ. ఒకట్రెండు సినిమాలు చేస్తే చాలు... వాళ్లూ తెలుగు అమ్మాయిల్లానే కలిసిపోతారు. మన భాష నేర్చుకుంటారు. డబ్బింగులు చెప్పేస్తారు. రాశీఖన్నా అయితే రెండాకులు ఎక్కువే చదివింది. తనైతే ఏకంగా తెలుగులో పాటలే పాడేసింది. ‘‘తెలుగు వాతావారణం, మర్యాదలు.. అన్నీ నాకు బాగా నచ్చేశాయి. అందుకే త్వరగా తెలుగమ్మాయిలా మారిపోయా. ఆఖరికి నా ఆహార పద్ధతులూ, ఇష్టాలూ మారిపోయాయి. వచ్చిన కొత్తలో.. ఇక్కడి రుచులు ఆస్వాదించా. కారం, మసాలా ఘాటు ఎక్కువగా అనిపించింది. కానీ ఆ వాసన తగిలితే మాత్రం నోరూరుపోతుంది. హైదరాబాద్ బిరియానీ బాగా ఇష్టం. మిగిలిన ప్రాంతాల్లోనూ బిరియానీ తిన్నా... అంత టేస్ట్ అనిపించేది కాదు. ఇప్పుడు మా ఇంటికెళ్లినా కారం కారంగానే తినాలనిపిస్తుంది. నా అలవాట్లు చూసి ఇంట్లోవాళ్లు ఆశ్చర్యపోతుంటారు. కొన్ని రెసిపీలు నేర్చుకొని, ఇంట్లోవాళ్లని ప్రయత్నించమని చెబుతున్నా. వాళ్లు కూడా అతి త్వరలో నా రూట్లోకి వచ్చేస్తారు. ఎందుకంటే తెలుగింటి వంటలు అంత గొప్పగా ఉంటాయి’’ అని కితాబు ఇచ్చింది రాశీఖన్నా.