Superstar Krishna: జేమ్స్ బాండ్ అంటే మాకు కృష్ణ గారే

ABN , First Publish Date - 2022-11-15T16:05:30+05:30 IST

కృష్ణ గారు సినిమాల్లో చేసిన ఆ స్టైల్ ఈరోజుకి కూడా ఎవరూ చేసి వుండలేదు. అది ఒక్క కృష్ణగారు చేస్తేనే అందంగా ఉండేది. చాలా స్టైల్ గా ఉండేది అప్పట్లో. అలాగే జేమ్స్ బ్యాండ్ సినిమాలు చెయ్యాలన్నా, సి.ఐ.డి సినిమాలు చెయ్యాలన్నా కూడా కృష్ణ గారు ఒక్కరే చెయ్యాలి.

Superstar Krishna: జేమ్స్ బాండ్ అంటే మాకు కృష్ణ గారే

--సురేష్ కవిరాయని

నాకు అప్పటికి నిండా పదేళ్లు కూడా ఉండవేమో. అంటే నేను చెప్తున్నది 1974 ఆ ప్రాంతం లో. మా వూరు లింగాలవలస అనే ఒక కుగ్రామం. మేము సినిమాకి వెళ్లాలంటే మా వూరు నుంచి కొన్ని మైళ్ళ దూరం లో వున్న సీతారాంపురం అనే ఊరుకి నడిచి వెళ్ళాలి. మా వూర్లో నేను నా మొదటి సినిమా చూసే సమయానికి పవర్ లేదు, కిరోసిన్, నూనె దీపాలు మాత్రమే ఉండేవి. మా నాన్నగారు ఉపాద్యాయ వృత్తిలో ఉండేవారు, కాబట్టి మా ఇంట్లో ఎప్పుడూ స్కూల్ విద్యార్థులు ఉండేవారు (మా ఇంట్లో ఉండి చదువుకునేవారు). అలంటి వూరు నుండి నేను మా ఇంటికి వచ్చిన విద్యార్థులుతో  నాకు పది సంవత్సరాల అప్పుడు పక్కన సీతారాంపురం వెళ్లి చూసిన మొదటి సినిమా కృష్ణగారు నటించిన 'గూఢచారి 116'. 

అంతే అదే నేను కృష్ణ గారిని తెర మీద చూడటం, ఇంకా అప్పటి నుండే నేను అతని అభిమానిని అవ్వటం. నేను పుట్టింది కూడా కృష్ణ గారి మొదటి సినిమా 'తేనె మనసులు' సినిమా విడుదల అయిన సంవత్సరమే. అందుకేనేమో నేను అతనికి హార్డ్ కోర్ అభిమానిగా మారేనేమో అని అనిపిస్తూ ఉంటుంది. అప్పట్లో ఆ సీతారాంపురంలో కొత్త సినిమా అంటే సినిమా మారినప్పుడు ఒక రిక్షా మా వూరు వచ్చి లౌడ్ స్పీకర్ లో ప్రకటిస్తూ ఉండేవారు. అందులో నటించిన నటీనటుల పేర్లు కూడా చెపుతూ ఉండేవారు. అప్పుడు కృష్ణగారి సినిమా వచ్చినప్పుడు నేను మా ఇంటికి వచ్చిన విద్యార్థులతో వెళ్ళేవాడిని. మా ఇంట్లో మేము అయిదుగురం అన్నదమ్ములం, ఒక అక్క, అయినా నాకు ఒక్కడికే ఈ సినిమా పిచ్చి. మా అమ్మ, నాన్న కూడా ఎప్పుడూ నన్ను దెబ్బలాడేవారు కారు నేను సినిమా చూడటానికి వెళ్ళినప్పుడు. అప్పట్లో నేల టికెట్ 45 పైసలు, బెంచి 70 పైసలు, కుర్చీ ఒక రూపాయి ధరలు ఉండేవి. 

ఆలా మొదలయింది నేను కృష్ణగారి అభిమాని అవ్వటం. ఇంక అప్పట్లో పేపర్లలో కృష్ణ గారిని 'ఆంధ్ర జేమ్స్ బాండ్' అని సంభోదించేవారు. అయితే మాకు జేమ్స్ బాండ్ అంటే హాలీవుడ్ సినిమాలో వేసే జేమ్స్ బాండ్ అని తెలీదు, కానీ కృష్ణ సి.ఐ.డి గా ఆ సినిమాలో వేస్తున్నారని మాత్రం తెలుసు. ఎందుకంటే అప్పట్లో కృష్ణ చాలా సినిమాల్లో సి.ఐ.డి గా వేసేవారు. ఆ సినిమాలు చూసి మేము కూడా చిన్నప్పుడు అలానే ఫీల్ అయ్యేవాళ్ళము. ఎలా అంటే దీపావళి పండగ వస్తే చిన్న పిస్టల్స్, అందులోకి పేల్చుకోవడానికి రీల్స్ (అందులో కేపులుండేవి) ఉండేవి. అవి మేము ఎడం చెయ్యి పిస్టల్ పైన పెట్టి కృష్ణ గారు సినిమాలో ఎలా కాలుస్తారో ఆలా మేము కూడా అప్పట్లో అతనిలా దీపావళి పిస్టల్స్ పేల్చుకునేవాళ్ళం. అది అప్పట్లో ఒక స్టైల్ గా ఉండేది. కృష్ణ గారు సినిమాల్లో చేసిన ఆ స్టైల్ ఈరోజుకి కూడా ఎవరూ చేసి వుండలేదు. అది ఒక్క కృష్ణగారు చేస్తేనే అందంగా ఉండేది. చాలా స్టైల్ గా ఉండేది అప్పట్లో. అలాగే జేమ్స్ బ్యాండ్ సినిమాలు చెయ్యాలన్నా, సి.ఐ.డి సినిమాలు చెయ్యాలన్నా కూడా కృష్ణ గారు ఒక్కరే చెయ్యాలి. ఇంక అప్పటి నుండి వరసగా కృష్ణ గారి సినిమాలు చూస్తూ, అతని గురించి వింటూ, చదువుతూ పెరిగాను. 

అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క కృష్ణ గారిని మాత్రమే హీరో కృష్ణ గారు అని అంటారు. వేరే ఎవరిని ఆలా పిలవరు. నేను తరువాత మా లింగాలవలసలో పడవ తరగతి పూర్తి చేసి, ఇంటర్మీడియట్ చదవటం కోసం రాజాం అనే చిన్న టౌన్ కి షిఫ్ట్ అవ్వటం, ఇక్కడ మూడు సినిమా హాల్స్ ఉండటం నా సినిమా చూసే పరంపర కొనసాగింది. కృష్ణ గారి సినిమా ఏది వచ్చినా, ఎలా వున్నా చూడాల్సిందే. 

అయితే ఒక్క జేమ్స్ బాండ్ సినిమాలే కాదు, కృష్ణ గారు పంచెకట్టు సినిమాలన్నీ కూడా హిట్లే. గ్రామీణ వాతావరణం నేపధ్యం లో వచ్చిన ఎన్నో సినిమాలు, 'పచ్చని సంసారం' నుండి 'పాడిపంటలు' వరకు ఎన్నో సినిమాలు. ఎన్నో హిట్స్. అవన్నీ అప్పట్లో మాకు ఒక పెద్ద క్రేజ్ గా ఉండేది. 'పాడిపంటలు' సినిమా అయితే అందులోని పాటలు, సన్నివేశాలు, భావోద్వేగాలు అన్నీ ఈరోజుకి గుర్తుండిపోయేలా ఉంటాయి. 

అలాగే కృష్ణగారి జీవితంలో మర్చిపోలేని సినిమా 'అల్లూరి సీతారామారాజు'. ఆ సినిమా మేము చిన్నప్పుడు చూసేటప్పుడు పేర్లు (టైటిల్స్) వేసున్నప్పుడు వచ్చిన పాట 'రగిలింది విప్లవాగ్ని ఈరోజు' వింటూ ఉంటే రోమాలు నిక్కబొడుచుకునేవి. కూర్చున్న కుర్చీకి గట్టిగా అంటిపెట్టుకొని ఆ పాట చూసేవాళ్ళం. ఆ సినిమా ఒక చరిత్ర, చలన చిత్ర పరిమిశ్రలో ఒక వినూత్న చరిత్రని సృష్టించింది.  


కృష్ణగారి అభిమానులకి మిగతా వారి అభిమానులకి ఒక చిన్న తేడా ఉండేది అప్పట్లో. కృష్ణ గారి సినిమా బాగోలేకపోతే మొహమాటం లేకుండా బాగోలేదు అని చెప్పేసే వారు, చూసేవారు కాదు. కృష్ణ గారు కూడా ఆ సినిమా పోయింది అని ఒప్పేసుకునేవారు. ఆలా ఉండేవారు అభిమానులు కూడా నిర్మొహమాటంగా. 

సినిమాలు ఆలా ఉంటే, పేపర్లలో కృష్ణ గారి గురించి వార్తలు కూడా వస్తూ ఉండేవి. 'జై ఆంధ్ర' ఉద్యమానికి కృష్ణ చలన చిత్ర పరిశ్రమతో సంబంధం లేకుండా తన మద్దతు ప్రకటించటం అప్పట్లో ఒక సంచలనం. అప్పుడిప్పుడే ఎదుగుతున్న ఒక స్టార్ ఆలా ప్రకటించటం అప్పట్లో సినిమా పరిశ్రమలో చాలామందికి నప్పలేదు. కృష్ణ మీద కక్ష కూడా కట్టారు. కానీ కృష్ణ తాను అన్న మాటకి కట్టుబడే వున్నారు. అందుకే అతను నిజ జీవితం లో కూడా ఒక డేరింగ్ అండ్ డాషింగ్ హీరో. అలాగే దివిసీమ వరదలు వచ్చి కొట్టుకుపోయినప్పుడు కృష్ణ గారు ఎంతగానో విరాళాలు ఇచ్చారు. అది ఒక్కటే కాదు, ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా కృష్ణ గారే ముందు ఉండేవారు.

Updated Date - 2022-11-15T16:05:30+05:30 IST