నా ఆత్మ కథలో అన్నీ నిజాలే రాస్తున్నా...
ABN , First Publish Date - 2022-02-14T06:41:47+05:30 IST
‘‘నా జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు, అవమానాలు చవిచూశా. కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నడిచిన రోజులున్నాయి. నా కష్టాలు ఇంకెవరికైనా వచ్చి ఉంటే ఆత్మహత్య చేసుకునేవారు...
‘‘నా జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు, అవమానాలు చవిచూశా. కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నడిచిన రోజులున్నాయి. నా కష్టాలు ఇంకెవరికైనా వచ్చి ఉంటే ఆత్మహత్య చేసుకునేవారు’’ అన్నారు మోహన్‌బాబు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘సన్నాఫ్ ఇండియా’ ఈనెల 18న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.
‘సన్నాఫ్ ఇండియా’ ఓ సామాన్యుడి కథ. తాను చేయని తప్పుకి శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఆ బాధలో తానొక నిర్ణయం తీసుకుంటాడు. అదేమిటన్నది ఆసక్తికరం. ప్రైవేటు ఆసుపత్రులు, ప్రైవేటు బ్యాంకులు, ప్రైవేటు కాలేజీలు ఉన్నప్పుడు ప్రైవేటు జైళ్లు ఎందుకు ఉండకూడదన్న ప్రశ్న ఈ సినిమాతో లేవనెత్తాం. ఆ పాయింట్ కచ్చితంగా ఆలోచనలో పడేస్తుంది.
ఇది ఓటీటీ కోసం తీసిన సినిమా. కొన్ని ముద్దు సీన్లు కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. ఓ మంచి సినిమా చూశామన్న సంతృప్తి ప్రేక్షకుడికి కలుగుతుంది. ఇలాంటి కథ ఈ మఽధ్య కాలంలో చేయలేదు. ‘పుణ్యభూమి నాదేశం’, ‘ఎం.ధర్మరాజు ఎం.ఏ’ లాంటి చిత్రాల్లో నా పాత్రలు గుర్తుండిపోయాయి. ‘సన్నాఫ్ ఇండియా’ కూడా అంతే.
విలన్ పాత్రల్లో రకరకాల మేనరిజాలను చేసిన నటుడ్ని. ఇప్పటికీ విలన్‌గా నటించాలని వుంది. ఓ పెద్ద హీరో సినిమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఈమధ్య వార్తలొచ్చాయి. అవన్నీ గాసిప్పులే. విలన్‌గా నటించాలంటే.. ఇప్పుడు కొంచెం ఇబ్బంది. నేను హీరోని కొట్టడం, హీరో నన్ను కొట్టడం.. ఇలాంటి సీన్లు ఇప్పుడు చేయలేను.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాను. ఆ ఉద్దేశ్యం లేదు. చంద్రబాబు నాయుడు మా బంధువు. అందుకే అప్పట్లో టీడీపీ కోసం ప్రచారం చేశాను. జగన్ కూడా నా బంధువే. అందుకే వైకాపా తరపున కూడా ప్రచారం చేశాను. ఇటీవల ఏపీ మంత్రి పేర్ని నాని మా ఇంటికి వచ్చారు. తను నా స్నేహితుడు. ఓ పెళ్లిలో కలిశాం. ‘బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం.. ఇంటికి రండి’ అని ఆహ్వానించా. ఆయన వచ్చాడు. మేం వ్యక్తిగత విషయాలు మాట్లాడుకున్నాం తప్ప, రాజకీయాల గురించి కాదు. ఆ మాత్రం దానికే.. జనాలు రకరకాలుగా అనుకోవడం భావ్యం కాదు.
నా ఆత్మ కథని పుస్తకంగా రాస్తున్నా. అందులో అన్నీ నిజాలే ఉంటాయి. తిరుపతిలో శిరిడీసాయి మందిరం నిర్మించబోతున్నాం. దర్శకత్వం చేయాలని వుంది. రెండు కథలు కూడా సిద్ధం చేసుకున్నా.