‘అద్దె గర్భం’పై విచారణకు త్రిసభ్య కమిటీ

ABN , First Publish Date - 2022-10-14T06:48:08+05:30 IST

నయనతార దంపతులు సరోగసీ విధానం (అద్దె గర్భం) ద్వారా తల్లిదండ్రులైన వ్యవహారంలో విధి విధానాలు పాటించారా లేదా అనే అంశాన్ని నిగ్గు తేల్చేందుకు తమిళనాడు ప్రభుత్వం...

‘అద్దె గర్భం’పై విచారణకు త్రిసభ్య కమిటీ

నయనతార దంపతులు సరోగసీ విధానం (అద్దె గర్భం) ద్వారా తల్లిదండ్రులైన వ్యవహారంలో విధి విధానాలు పాటించారా లేదా అనే అంశాన్ని నిగ్గు తేల్చేందుకు తమిళనాడు ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించింది.  ‘అద్దె గర్భం’ వ్యవహారంలో అవసరమైతే నయనతార, విగ్నేష్‌ శివన్‌లను కూడా విచారించి, వారంరోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించినట్టు తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి ఎం.సుబ్రహ్మణ్యం  వెల్లడించారు. ఈ కమిటీ సమర్పించే నివేదికను పరిశీలించిన తర్వాత అద్దె గర్భం అంశంలో నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలితే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఇదిలావుంటే, సరోగసీ విధానం ద్వారా నయనతార దంపతులకు పిల్లలు పుట్టేలా సహకరించింది చెన్నైలోని ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రేనని తెలుస్తోంది. నయనతార దంపతుల బిడ్డలకు అద్దె గర్భం ద్వారా జన్మనిచ్చింది కేరళకు చెందిన మహిళగా ప్రచారం జరుగుతోంది. ఈమెకు, నయనతారకు మంచి పరిచయం ఉన్నట్టు తెలుస్తోంది. 

నేరం నిరూపితమైతే పదేళ్ళ జైలు?

అద్దెగర్భం వ్యవహారంలో సరోగసీ విధి విధానాలను ఉల్లంఘించినట్టు తేలితే నయనతారకు గరిష్టంగా పదేళ్ళ వరకు జైలు శిక్ష పడే అవకాశమున్నట్లు న్యాయవిభాగ వర్గాలు చెబుతున్నాయి. వివాహం తర్వాత నయనతార దంపతులు స్థానిక ఎగ్మూరులోని ఒక లగ్జరీ అపార్టుమెంటులో నివసిస్తున్నారు. అద్దె గర్భం వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ దంపతులిద్దరూ ఇంటికే పరిమితమయ్యారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశించడం, ఇందుకోసం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయడం, ఈ కమిటీ విచారణ ప్రారంభించడంతో నయనతార తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆమె తన న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. 

(ఆంధ్రజ్యోతి, చెన్నై)


Updated Date - 2022-10-14T06:48:08+05:30 IST