The Kashmir Files: సినిమా ‘చెత్త’ అన్న బాలీవుడ్ దర్శకుడు.. కౌంటర్ ఇచ్చిన వివేక్ అగ్నిహోత్రి

ABN , First Publish Date - 2022-12-20T12:54:29+05:30 IST

ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్ సాధించిన బాలీవుడ్ చిత్రం ‘ది కాశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files). 1992లో కశ్మీరీ పండిట్లపై జరిగిన ఊచకోత ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) దర్శకుడు

The Kashmir Files: సినిమా ‘చెత్త’ అన్న బాలీవుడ్ దర్శకుడు.. కౌంటర్ ఇచ్చిన వివేక్ అగ్నిహోత్రి

ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్ సాధించిన బాలీవుడ్ చిత్రం ‘ది కాశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files). 1992లో కశ్మీరీ పండిట్లపై జరిగిన ఊచకోత ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) దర్శకుడు. కొన్ని నెలల క్రితం విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.350 కోట్ల వసూళ్లని సాధించింది. అంతేకాకుండా.. ఎంతోమంది నెటిజన్లు ఈ సినిమాపై ప్రశంసలు సైతం కురిపించారు. అదే సమయంలో ఈ చిత్రంపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు విమర్శలు సైతం చేశారు.

తాజాగా ‘మోహన్ జోషీ హజీర్ హో’, ‘ఆల్బర్ట్ పింటోకో గుస్సా క్యూ ఆతా హై’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సయ్యిద్ అక్తర్ మీర్జా (Saeed Akhtar Mirza) ఈ చిత్రంపై విమర్శలు చేశాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాని ఓ చెత్త (Garbage)గా అభివర్ణించాడు. ఆయన మాట్లాడుతూ.. ‘నాకు సంబంధించి ‘ది కాశ్మీర్ ఫైల్స్’ ఓ చెత్త. కాశ్మీరీ పండిట్ సమస్య చెత్తనా? కాదు. అది కానేకాదు. అది నిజం. దీని వల్ల కాశ్మీరీ హిందులే ఇబ్బందిపడ్డారా? కాదు. ముస్లింలు కూడా ఇబ్బందిపడ్డారు. గూఢచార సంస్థల కుతంత్రాలు, జాతీయ ప్రయోజనాలు అని చెబుతూ సరిహద్దు దేశాల నుంచి కొందరు డబ్బు తీసుకుని ఈ దేశంలోకి ప్రవేశించారు. వారు విధ్వంసం సృష్టించడం కొనసాగించారు. ఏదో ఒక వైపు మాట్లాడకుండా.. మనిషిగా సమస్యని అర్థం చేసుకోడానికి ప్రయత్నించాలి’ అని చెప్పుకొచ్చాడు.

సయీద్ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా వివేక్ అగ్నిహోత్రి స్పందించాడు. ‘నేను మీర్జా సాబ్‌కి సలాం చెబుతున్నాను. ది ఢిల్లీ ఫైల్స్ తర్వాత మళ్లీ కలుద్దాం సర్. 2024’ అని ఓ ట్వీట్‌లో రాసుకొచ్చాడు. అలాగే.. ‘నేను ఈ విషయాన్ని ఎప్పుడూ చెప్పాలనుకోలేదు. అయితే కఠినమైన సత్యాన్ని మాట్లాడే సమయం వచ్చిందని నేను భావిస్తున్నాను. వారి జీవితమంతా వారు ముస్లిం బాధితులపై సినిమాలు తీశారు. భారతదేశంలో మాత్రమే 'ముస్లిం సోషల్' అనే జానర్ ఉంది. హిందువులు ఈ వ్యక్తులను ధనవంతులుగా, సెలబ్రీటీలుగా మార్చారు. అయినప్పటికీ.. కృతజ్ఞత లేని బాలీవుడ్‌కు హిందువులపై ఏ మాత్రం సానుభూతి లేదు’ అని మరో ట్వీట్‌లో రాసుకొచ్చాడు.

Updated Date - 2022-12-20T13:01:25+05:30 IST