The Kashmir Files: నడవ్ లపిడ్ కామెంట్స్ ఎఫెక్ట్.. మూవీ కొనసాగింపుకి సిద్ధమవుతున్న దర్శకుడు

ABN , First Publish Date - 2022-12-01T18:51:04+05:30 IST

‘ది కాశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files) సినిమాపై జరుగుతున్న వివాదం గురించి తెలిసిందే. గోవాలో జరిగిన 53వ భారత అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో..

The Kashmir Files: నడవ్ లపిడ్ కామెంట్స్ ఎఫెక్ట్.. మూవీ కొనసాగింపుకి సిద్ధమవుతున్న దర్శకుడు

‘ది కాశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files) సినిమాపై జరుగుతున్న వివాదం గురించి తెలిసిందే. గోవాలో జరిగిన 53వ భారత అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమాపై జ్యూరీ ఛైర్మన్, ఇజ్రాయెల్ దర్శకనిర్మాత నడవ్ లపిడ్ (Nadav Lapid) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. నడవ్ మాట్లాడుతూ.. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని, అది చాలా అసభ్యకరమైన చిత్రం అని మాట్లాడాడు. దీనిపై దేశవ్యాప్తంగా చాలామంది స్పందిస్తూ.. నడవ్ మీద విమర్శలు చేశారు. ముఖ్యంగా ఈ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri), నటుడు అనుపమ్ ఖేర్ అయితే ఘాటుగా స్పందించారు. నడవ్ కామెంట్స్ వల్ల డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. 


ఓ ఇంటర్వ్యూలో వివేక్ మాట్లాడుతూ.. ‘‘నేను ఇప్పుడే నిర్ణయించుకని ఓ ప్రకటన చేస్తున్నాను. మా వద్ద చాలా కథలు, కథనాలు, నిజాలు ఉన్నాయి. వాటితో ఒకటి కాదు 10 సినిమాలు తీయవచ్చు. అయితే ఒకే ఒక్క సినిమా చేయాలని నిర్ణయించుకున్నాం. కానీ ఇప్పుడు, నేను పూర్తి సత్యాన్ని బయటకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాను. దానికి టైటిల్ ‘ది కాశ్మీర్ ఫైల్స్ అన్‌రిపోర్టెడ్’. ఈ సంవత్సరంలోనే నేను ఆ సీక్వెల్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని.. నేను ఇప్పుడే నిశ్చయించుకున్నాను.


అన్‌రిపోర్టెడ్‌ని వెబ్ సిరీస్ లేదా డాక్యుమెంటరీగా తెరకెక్కిస్తాను అనేది త్వరలో అందరికీ తెలియజేస్తాను. నేను పూర్తి సత్యాన్ని అందరికీ తెలియజేస్తాను. ఇప్పుడు ఈ విషయం కళకు మాత్రమే కాదు. ఈ దేశ ఖ్యాతికి సంబంధించింది. నా వద్ద ఉన్న సమాచారం, రుజువులు, నేను మాట్లాడిన ప్రజలు అందరినీ బయటకి తీసుకొచ్చి జనాల ముందు ఉంచుతాను. నిజాలను ప్రజల ముందు ఉంచడం నా నైతిక బాధ్యత’ అని చెప్పుకొచ్చాడు.

Updated Date - 2022-12-01T18:51:04+05:30 IST